పుస్తకాలు వచ్చేశాయ్‌ | - | Sakshi
Sakshi News home page

పుస్తకాలు వచ్చేశాయ్‌

May 9 2026 7:38 AM | Updated on May 9 2026 7:38 AM

జిల్లాకు చేరిన 88.64 శాతం

పుస్తకాలు

సమీప పాఠశాలలకు

చేరవేస్తున్న అధికారులు

పునఃప్రారంభం రోజే విద్యార్థులకు

అందజేత..

పాఠశాలలకు పంపిస్తున్నాం

కొత్తగూడెంఅర్బన్‌: రాబోయే విద్యా సంవత్సరానికి సంబంధించి పాఠ్య పుస్తకాలు జిల్లాకు చేరాయి. పాఠశాలలు జూన్‌ 12వ తేదీ నుంచి తిరిగి ప్రారంభం కానుండటంతో అదే రోజు విద్యార్థులకు పుస్తకాలు అందజేయనున్నారు. వచ్చిన పుస్తకాలన్నీంటిని పాతకొత్తగూడెంలోని తెలంగాణ స్కూల్‌లో భద్రపరిచారు. మరోవైపు సమీపంలో ఉన్న పాఠశాలలకు కూడా చేరవేస్తున్నారు. గతంలో మాదిరి ఈ సారి కూడా 1వ తరగతి నుంచి 10వ తరగతి వరకు బైలింగ్వల్‌ (ద్విభాషా) పాఠ్య పుస్తకాలు వచ్చాయి. తెలుగు, ఆంగ్ల మీడియం రెండింటికి కూడా ఒకే పుస్తకాలు ఉంటాయి. దీనివల్ల విద్యార్థులు తెలుగు, ఆంగ్లంలో సబ్జెక్ట్‌ నేర్చుకునే అవకాశం ఉంటుంది. ఈ ఏడాది పదో తరగతి పరీక్షల్లో జిల్లా వ్యాప్తంగా 800 మంది విద్యార్థులు తెలుగు సబ్జెక్‌లో ఫెయిల్‌ కావడం గమనార్హం. మాతృభాషపై మక్కువ పెంచేలా కార్యాచరణ చేపట్టి తెలుగు సబ్జెక్ట్‌లో వచ్చే ఏడాది అందరూ విద్యార్థులు ఉత్తీర్ణత సాధించేలా చూడాల్సిన బాధ్యత ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులపై ఉందని, నిర్లక్ష్యం వహించవద్దని కలెక్టర్‌, డీఈఓ ఇటీవల నిర్వహించిన సమీక్షలో ఆదేశాలు జారీచేశారు. ఆదేశాలను హెచ్‌ఎంలు, ఉపాధ్యాయులు ఎంత మేరకు ఆచరణలో పెడతారో వేచి చూడాలి.

జిల్లాకు చేరిన 88.64 శాతం పాఠ్యపుస్తకాలు

2026–27 విద్యా సంవత్సరానికి 5,05,294 పాఠ్యపుస్తకాలు జిల్లాకు రావాల్సి ఉండగా, 4,47,916 పుస్తకాలు వచ్చాయి. ఇంకా 57,378 పుస్తకాలు రావాల్సి ఉంది. మిగిలిన పుస్తకాలు పాఠశాలల పునఃప్రారంభం లోగా చేరుతాయని విద్యాధికా రులు చెబుతున్నారు. వీటితోపాటు గతంలో నోట్‌ పుస్తకాలను కూడా అందజేసి పేద విద్యార్థులకు తోడ్పాటుగా ప్రభుత్వం నిలిచేది. గతంలో పాఠ్యపుస్తకాలతో పాటు నోట్‌ పుస్తకాలను కూడా జిల్లా గోదాంకు పంపించేవారు. ప్రస్తుతం నోట్‌ పుస్తకాలను నేరుగా పాఠశాలలకు చేర్చుతున్నారు. కేజీ బీవీలలో ఇంటర్‌ వరకు కూడా పాఠ్య పుస్తకాలతో పాటు విద్యార్థులకు నోట్‌ పుస్తకాలను సైతం అందజేస్తున్నారు. జిల్లాకు అన్ని తరగతులకు సంబంధించి మొత్తం 72 టైటిల్స్‌ ఇప్పటి వరకు వచ్చాయి. ఇంకా 8 రకాల టైటిల్స్‌ పుస్తకాలు రావాల్సి ఉంది. రెండో తరగతికి సంబంధించిన పుస్తకాలు 7,389, నాలుగో తరగతికి సంబంధించిన 7,445, ఆరో తరగతికి సంబంధించి 11,311, ఏడో తరగతికి సంబంధించి 9,326, ఎనిమిదో తరగతికి సంబంధించి 10,625 పుస్తకాలు ఇంకా రావాల్సి ఉంది.

జిల్లా కేంద్రానికి చేరిన పుస్తకాలను పాఠశాలలకు పంపించే పనిలో సంబంధిత అధికారులు నిమగ్నమయ్యారు. జిల్లా కేంద్రం చుట్టు పక్కల పాఠశాలలకు ఇప్పటికే చేరాయి. పాఠశాలల ప్రారంభం రోజున విద్యార్థులకు అందజేయనున్నాం. నోటు పుస్తకాలు నేరుగా పాఠశాలలకు చేరుతున్నాయి.

–నాగలక్ష్మి, డీఈఓ

రావాల్సిన మొత్తం పుస్తకాలు : 5,05,294

వచ్చినవి : 4,47,916

ఇంకా రావాల్సినవి : 57,378

Advertisement
 
Advertisement
Advertisement