ప్రమాదపుటంచున.. | - | Sakshi
Sakshi News home page

ప్రమాదపుటంచున..

May 9 2026 7:38 AM | Updated on May 9 2026 7:38 AM

● ఆయకట్టు పెంచబోతే అసలుకే ఎసరు వచ్చిన వైనం ● బలహీనపడిన కరకట్ట, తాత్కాలిక రిపేర్లతోనే సరి ● ఇంకా అనుమతుల దశలో మరమ్మతుల ప్రతిపాదనలు

పరిస్థితి చేయిదాటితే..

శతాబ్దాల నాటి సింగభూపాలెం చెరువు
● ఆయకట్టు పెంచబోతే అసలుకే ఎసరు వచ్చిన వైనం ● బలహీనపడిన కరకట్ట, తాత్కాలిక రిపేర్లతోనే సరి ● ఇంకా అనుమతుల దశలో మరమ్మతుల ప్రతిపాదనలు

సాక్షి ప్రతినిధి, భద్రాద్రి కొత్తగూడెం: ఉమ్మడి ఖమ్మం జిల్లాలోనే ఏ చెరువుకు, ఏ మైనర్‌ ఇరిగేషన్‌ ప్రాజెక్ట్‌కు లేని చరిత్ర సింగభూపాలెం చెరువుకు ఉంది. కాకతీయలు దగ్గర సేనానిగా పని చేసిన సింగభూపాలుడు ఈ చెరువును తవ్వించాడు. జూలురుపాడు పాపకొల్లు అటవీ ప్రాంతం సమీపంలో ఉన్న కొండలపైనుంచి వర్షపు నీరు చెరువులో చేరేలా నిర్మాణం చేపట్టారు. ఆ తర్వాత నిజాం కాలంలో 1920 తర్వాతనే వైరా, పాలేరు రిజర్వాయర్లు నిర్మించారు. వాటిని నాగార్జున సాగర్‌ ప్రాజెక్టుతో అనుసంధానం చేయడంతో క్రమంగా ఆ రెండు ప్రాజెక్టులను ఆధునీకరించారు. ఆయకట్టు కూడా పెరిగింది. కానీ సింగభూపాలెం చెరువు పరిస్థితి ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్న చందంగానే ఉంది.

మిషన్‌ కాకతీయలో పనులు

సింగభూపాలెం చెరువు నీటి నిల్వ సామర్థ్యం 0.45 టీఎంసీలు ఉండగా ఆయకట్టు 2,500 ఎకరాలుగా ఉంది. తెలంగాణ వచ్చిన తర్వాత ఆయకట్టు రెట్టింపు చేసేందుకు మిషన్‌ కాకతీయ ద్వారా ప్రణాళికలు రూపొందించారు. మిషన్‌ కాకతీయ ఫేస్‌–1లో రూ.9.26 కోట్లు కేటాయించారు. ఫేస్‌–2 వచ్చే సరికి రూ.24 కోట్లకు పెంచారు. చెరువుకు మరమ్మతులు చేపట్టడంతోపాటు నీటి నిల్వ సామర్థ్యం, ఆయకట్టు పెంచేలా ప్రణాళిక రూపొందించారు. తోగు వాగు ద్వారా వచ్చే నీటిని చెరువులోకి మళ్లించాలని నిర్ణయించారు. ఇదే సమయంలో మత్తడి, కరకట్ట ఎత్తు పెంచారు.

ఈ సీజన్‌లోనూ అంతే

సింగభూపాలెం చెరువు మరమ్మతుల విషయంలో నిర్లక్ష్య ధోరణి ఈ సీజన్‌లోనూ కొనసాగుతోంది. బలహీనపడిన కట్టను దృష్టిలో ఉంచుకుని ముందుగానే ఆ మేరకు యాక్షన్‌ ప్లాన్‌ సిద్ధం చేయాల్సి ఉండగా, ఇందుకు విరుద్ధంగా ఇక్కడ పరిస్థితి ఉందనే విమర్శలు వస్తున్నాయి. చెరువు మరమ్మతుల కోసం రూ.9 కోట్లకు పైగా అంచనాలతో ప్రతిపాదనలు సిద్ధం చేశామని, అనుమతులు కూడా వచ్చి నట్టే అని ఇరిగేషన్‌ విభాగం చెబుతోంది. అయితే, పనులు జనవరి, ఫిబ్రవరిలో మొదలు పెడితే ఈ పాటికి చివరి దశకు వచ్చేవి. కానీ ఇప్పటి వరకు పనులు మొదలే కాలేదు. సింగభూపాలెం చెరువులో మత్స్యకార సొసైటీలు చేపలు పట్టడం పూర్తయిన తర్వాత పనులు మొదలు పెట్టే అవకాశం ఉంది. కానీ, టెండర్లు, కాంట్రాక్టర్ల ఎంపిక తదితర తతంగమంతా పూర్తయ్యే సరికి వానాకాలం వచ్చేస్తుంది. దీంతో ఈ సీజన్‌లోనూ చెరువు కట్ట పరిస్థితి ప్రమాదభరితంగానే ఉండనుంది.

ఇటీవల కాలంలో క్లౌడ్‌ బరస్ట్‌ తరహాలో తక్కువ సమయంలో అత్యంత భారీవర్షాలు కురవడం సాధారణ విషయంగా మారింది. ఇలాంటి వాన ల వల్లే అశ్వారావుపేట దగ్గర పెద్దవాగు కొట్టుకుపోయింది. అదృష్టవశాత్తు సింగభూపాలెం క్యాచ్‌మెంట్‌ ఏరియాలో గడిచిన నాలుగైదేళ్లుగా అతి భారీ వర్షాలు కురవలేదు. దీంతో కట్ట బలహీనంగా ఉన్నా పెద్దగా సమస్యలు రాలేదు. కానీ, బలహీనపడిన కట్ట విషయంలో తగిన చర్యలు తీసుకోకపోతే భారీ నష్టం వాటిల్లే అవకాశం ఉంది. సింగభూపాలెం చెరువు ఎగువ ప్రాంతంలో ఉండగా, దాని దిగువన సుజాతనగర్‌, చుంచుపల్లి, కొత్తగూడెం ఉన్నా యి. దురదృష్టవశాత్తు చెరువుకు గండి పడితే దిగువ ప్రాంతాల్లో ఉన్న పొలాలు, నివాస స్థలాలు ముంపునకు గురయ్యే ప్రమాదం ఉంది.

Advertisement
 
Advertisement
Advertisement