మక్కలు, ధాన్యం వర్షార్పణం | - | Sakshi
Sakshi News home page

మక్కలు, ధాన్యం వర్షార్పణం

May 9 2026 7:38 AM | Updated on May 9 2026 7:38 AM

● అకాల వర్షంతో తడిసిన కల్లాలు, కేంద్రాల్లోని పంట ఉత్పత్తులు ● ప్రకృతి ప్రకోపం, కొనుగోళ్ల జాప్యంతో రైతుల మనోవేదన

● అకాల వర్షంతో తడిసిన కల్లాలు, కేంద్రాల్లోని పంట ఉత్పత్తులు ● ప్రకృతి ప్రకోపం, కొనుగోళ్ల జాప్యంతో రైతుల మనోవేదన

టేకులపల్లి/దమ్మపేట/ఇల్లెందురూరల్‌: అకాల వర్షంతో రైతులను మనోవేదనకు గురిచేస్తోంది. చేతికివచ్చిన పంట వర్షార్పణం అవుతుంటే రైతు గుండె బరువెక్కుతోంది. గురువారం కురిసిన వర్షానికి జిల్లాలోని పలు ప్రాంతాల్లో ధాన్యం, మక్కలు తడిసిపోయాయి. ఇల్లెందు, టేకులపల్లి, దమ్మపేట మండలాల్లో తీవ్ర నష్టం జరిగింది. టేకులపల్లి మండలంలో సుమారు 35 వేల ఎకరాల్లో మొక్కజొన్న సాగు చేయగా, పంట కోతలు పూర్తయ్యాయి. గింజలను ఆరబెట్టి అమ్మకానికి సిద్ధం చేశారు. వర్షం రావడంతో మొక్కజొన్న రాశులు నీటిలో తడిసి ముద్దయ్యాయి. టేకులపల్లి కొనుగోలు కేంద్రంలో స్థలం సరిపోక మొక్కజొన్న ట్రక్కులను ప్రభుత్వ పాఠశాలలో నిలిపిఉంచారు. వర్షం నేపథ్యంలో ఆ రైతులంతా ఆందోళన చెందతున్నారు. కల్లాల్లో తడిసిన ధాన్యాన్ని చూస్తూ రైతులు గుండెలు బాదుకుంటున్నారు. ఇల్లెందు మండలంలో గురువారం రాత్రి కురిసిన భారీ వర్షంతో జనజీవనం స్తంభించింది. ప్రధాన రహదారులపై చెట్లు విరిగిపడటంతో రాకపోకలు స్తంభించాయి. ఇల్లెందు–గుండాల ప్రధాన రహదారిలో కొమ్ముగూడెం గ్రామం వద్ద భారీ వృక్షం విరిగి రోడ్డుకు అడ్డంగా పడటంతో ఆర్టీసీ బస్సు ఇతర వాహనాలు మాణిక్యారం, మస్సివాగు మీదుగా రాకపోకలు సాగించాయి. రైతులు రోడ్డుపై ఆరబెట్టుకున్న మక్కలు వరదకు కొట్టుకుపోయాయి. మామిడిగూడెం గ్రామపంచాయతీలో ఐదు ఇళ్ల పైకప్పులు పూర్తిగా ఎగిరిపోయాయి. విద్యుత్తు సరఫరా పూర్తిగా నిలిచిపోయింది. దమ్మపేట మండల కేంద్రంలోని వ్యవసాయ కమిటీ మార్కెట్‌ యార్డు కొనుగోలు కేంద్రంలో శుక్రవారం సాయంత్రం కురి సిన అకాల వర్షానికి, రైతులు ఆరబోసిన ధాన్యం తడిసింది. మండలంలోని పలుచోట్ల అకస్మాత్తుగా వర్షం కురవడంతో రోడ్డుపై, మార్కెట్‌ యారుల్డో ధాన్యం ఆరబోసిన రైతులు భయాందోళనలతో ధాన్యపు రాశులపై హడావిడిగా పట్టాలను కప్పా రు. మార్కెట్‌ యార్డులో సరిపడా టార్పాలిన్‌ పట్టాలను ఇవ్వని కారణంగా ధాన్యపు రాశులు తడిసిపోయాయని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. ధాన్యం ఆరబోసి రోజులు గడుస్తున్నా కాంటా వేయడం లేదని వాపోయారు. తహసీల్దార్‌ రామనరేష్‌ కేంద్రాన్ని పరిశీలించారు. రైతులకు సరిపడా టార్పాలిన్‌ పట్టా లను అందజేయాలని బాధ్యులను ఆదేశించారు. ధాన్యపు కాంటాలు సకాలంలో జరిగేలా ఉన్నతాధికారులతో మాట్లాడుతానని తెలిపారు.

Advertisement
 
Advertisement
Advertisement