జూలూరుపాడు: వరి ధాన్యం, మక్కలు కొనుగోళ్లు సజావుగా సాగేలా చర్యలు తీసుకుంటున్నామని (డీసీఓ) ఎ.శ్రీనివాసరావు తెలిపారు. శుక్రవారం జూలూరుపాడు పీఏసీఎస్‌లోని ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఆయన పరిశీలించారు. ధాన్యం కొనుగోళ్లు, నిల్వలు, మౌలిక సదుపాయాలు, రవాణా ఏర్పాట్లపై సొసైటీ సిబ్బందిని వివరాలు అడిగి తెలుసుకున్నారు. కాంటా వేసిన మక్కల బస్తాల నిల్వలు పేరుకుపోవడంతో కాంట్రాక్టర్‌కు ఫోన్ చేసి మాట్లాడారు. దీంతో రెండు లారీలను పంపిస్తామని కాంట్రాక్టర్ తెలిపాడు. కాగా, కలెక్టర్ అంకిత్ పర్యటన అనివార్య కారణాలతో రద్దయింది. తహసీల్దార్ శ్రీనివాస్, అధికారులు సుధాకర్, దీపక్ ఆనంద్, తులసీరామ్, అశోక్ యాదవ్, ఆదినారాయణ, ఎన్.వెంకటేశ్వర్లు, కె.శ్రీనివాసరావు పాల్గొన్నారు.
ఇద్దరు నిందితులకు జైలు శిక్ష
భద్రాచలం అర్బన్: సెల్‌ఫోన్ చోరీ కేసులో నిందితుడికి జైలు శిక్ష విధిస్తూ భద్రాచలం ప్రథమ శ్రేణి న్యాయమూర్తి శివనాయక్ శుక్రవారం తీర్పు వెలువరించారు. భద్రాచలం పోలీస్ స్టేషన్‌లో 2022లో నమోదైన సెల్‌ఫోన్ చోరీ కేసులో ముద్దాయి బండారు సాయితేజను పోలీసులు అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. అనంతరం నిందితుడిపై చార్జిషీటు దాఖలు చేయగా, విచారించిన న్యాయస్థానం అతడికి ఏడు నెలల జైలు శిక్షతో పాటు రూ.500 జరిమానా విధించింది. అలాగే బెదిరించి డబ్బులు వసూలు చేసిన ఘటనకు సంబంధించి 2018లో భద్రాచలం పోలీస్ స్టేషన్‌లో నమోదైన కేసులో కొత్తపేట కాలనీకి చెందిన దయామూర్తిపై పోలీసులు చార్జిషీటు దాఖలు చేశారు. విచారణ చేపట్టిన న్యాయమూర్తి నిందితుడికి ఆరు నెలల జైలు శిక్షతో పాటు రూ.500 జరిమానా విధించారు.
ఆగి ఉన్న ఆటోను ఢీ కొట్టిన కారు
ముగ్గురికి గాయాలు
జూలూరుపాడు: ఆగి ఉన్న ఆటోను కారు ఢీకొట్టిన ఘటన మండలంలోని మాచినేనిపేటతండాలో శుక్రవారం జరిగింది. ఈ ప్రమాదంలో ఒకరికి తీవ్ర గాయాలు కాగా, మరో ఇద్దరికి స్వల్పగాయాలయ్యాయి. మండలంలోని వెంగన్నపాలేనికి చెందిన దుద్దుకూరి వెంకటేశ్వర్లు తన ఆటోను మాచినేనిపేటతండా పంచాయతీ కార్యాలయం ఎదుట రహదారి పక్కన నిలిపి ఉంచాడు. ఈ క్రమంలో హైదరాబాద్ నుంచి భద్రాచలం వెళుతున్న కారు అదుపుతప్పి రహదారి పక్కన ఉన్న ఆటోను ఢీకొట్టింది. దీంతో ఆటోడ్రైవర్ దుద్దుకూరి వెంకటేశ్వర్లుకు తీవ్ర గాయాలు కాగా, ఆటోలో ఉన్న మరో ఇద్దరు ప్రయాణికులకు స్వల్ప గాయాలయ్యాయి. వెంకటేశ్వర్లును చికిత్స నిమిత్తం ఖమ్మం తరలించారు. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు వివరాలు సేకరించారు.
యువతి అదృశ్యం
ములకలపల్లి: యువతి అదృశ్యంపై శుక్రవారం పోలీసులు కేసు నమోదు చేశారు. ఎస్సై మధుప్రసాద్ కథనం ప్రకారం.. మండల కేంద్రంలోని భగత్‌సింగ్‌నగర్ గ్రామానికి చెందిన తాళ్ల తేజస్విని పాల్వంచలోని డిగ్రీ కళాశాలలో మూడో సంవత్సరం చదువుతోంది. కాలేజీలో పని ఉందంటూ గురువారం ఇంటి నుంచి వెళ్లిన ఆమె తిరిగి రాలేదు. యువతి తండ్రి కన్నయ్య ఫిర్యాదుతో పోలీసులు అదృశ్యం కేసు నమోదు చేశారు.


