వీకేసీఎంలో వాటర్‌ స్ప్రింక్లర్‌ వాహనం బోల్తా | - | Sakshi
Sakshi News home page

వీకేసీఎంలో వాటర్‌ స్ప్రింక్లర్‌ వాహనం బోల్తా

May 9 2026 7:38 AM | Updated on May 9 2026 7:38 AM

డ్రైవర్‌కు తీవ్రగాయాలు

రుద్రంపూర్‌: సింగరేణి కొత్తగూడెం ఏరియా పరిధిలోని వీకేసీఎంలో శుక్రవారం వాటర్‌ స్ప్రింక్లర్‌ (క్వారీలో నీరు చల్లే) వాహనం బ్రేకులు ఫెయిలై బోల్తా పడింది. దీంతో డ్రైవర్‌ అర్జున్‌కు తీవ్రగాయాలయ్యాయి. అతడిని ఆస్పత్రికి తరలించి చికిత్స అందించారు. అయితే డీడీఎంఎస్‌స్థాయి అధికారి వచ్చేవరకు బోల్తాపడిన వాహనాన్ని అక్కడే ఉంచాల్సి ఉండగా, అతి జాగ్రత్తగా గ్యారేజీకి పంపించినట్లు తెలిసింది. బ్రేకులు ఫెయిలై ప్రమాదం జరిగిందని క్వారీ నిర్వాహకులు చెబుతుండగా, వాహనం ఫిట్‌నెస్‌ లేదని, డోర్‌ లాక్‌లు పనిచేయడం లేదని, సీటు బెల్ట్‌ వ్యవస్థ లేదని కార్మికులు పేర్కొంటున్నారు. ఆఫ్‌లోడింగ్‌ పనులు చేపడుతున్న ప్రైవేట్‌ కంపెనీ ప్రారంభం నుంచి కాలంచెల్లిన వాహనాలను వినియోగిస్తోందని పలుమార్లు ఫిర్యాదు చేసినా అధికారులు పట్టించుకోవడం లేదని కార్మిక సంఘాలు ఆరోపిస్తున్నాయి. రాష్ట్రంలోని అధికార పార్టీకి చెందిన ఒక ముఖ్యనేత బంధువు సంస్థ కావడంతో అఽధికారులు నోరుమెదపడం లేదని పేర్కొంటున్నాయి. ఇప్పటికై నా తగిన చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేస్తున్నాయి.

కొండగొర్రె మాంసం స్వాధీనం

ములకలపల్లి: వన్యప్రాణి కొండగొర్రె మాంసాన్ని అటవీశాఖ అధికారులు శుక్రవారం స్వాధీనం చేసుకున్నారు. ములకలపల్లి ఫారెస్ట్‌ రేంజ్‌ ఆఫీసర్‌ (ఎఫ్‌ఆర్‌ఓ) రవికిరణ్‌ కథనం ప్రకారం.. తిమ్మంపేట జీపీలోని పుట్టతోగులో కొండగొర్రె మాంసం విక్రయిస్తుండగా అధికారులు దాడి చేశారు. గ్రామానికి చెందిన కోండ్రు కిరణ్‌ ఇంట్లో మాంసాన్ని స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటనలో కిరణ్‌తోపాటు, కట్టం శంకర్‌ను అదుపులోకి తీసుకుని, కేసు నమోదు చేసినట్లు ఎఫ్‌ఆర్‌ఓ తెలిపారు.

Advertisement
 
Advertisement
Advertisement