భద్రాచలం: భద్రాచలం శ్రీ సీతారామ చంద్రస్వామి దేవస్థానంలో గురువారం రామయ్య నిత్యకల్యాణం కనుల పండువగా జరిగింది. తొలుత తెల్లవారుజామున గర్భగుడిలో స్వామివారికి సుప్రభాత సేవ, సేవాకాలం, ఆరాధన తదితర పూజలు చేశారు. అనంతరం నిత్యకల్యాణానికి బేడా మండపంలో కొలువుదీరిన స్వామివారికి విశ్వక్సేన పూజ, పుణ్యావాచనం చేశారు. స్వామివారికి కంకణధారణ, యజ్ఞోపవీత ధారణ, అమ్మవారికి కంకణధారణ, యోక్త్రధారణ గావించి నిత్యకల్యాణ మహోత్సవాన్ని శాస్త్రోక్తంగా జరిపారు. స్వామివారికి బేడా మండపంలో స్నపన తిరుమంజనం గావించారు.
పెద్దమ్మతల్లికి
సువర్ణ పుష్పార్చన
పాల్వంచరూరల్: పెద్దమ్మతల్లి అమ్మవారికి గురువారం వైభవంగా సువర్ణ పుష్పార్చన పూజలు నిర్వహించారు. మండలంలోని శ్రీకనకదుర్గ (పెద్దమ్మతల్లి) ఆలయంలో అర్చకులు అమ్మవారికి 108 సువర్ణ పుష్పాలతో అర్చన, హారతి, మంత్రపుష్పం, నివేదన తదితర పూజలు చేశారు. ఈ కార్యక్రమంలో అర్చకులు పద్మనాభశర్మ, రవికుమార్ శర్మ పాల్గొన్నారు.
ప్రతిభావంతులకు
ఎస్పీ అభినందన
సూపర్‌బజార్(కొత్తగూడెం): పదో తరగతి, ఇంటర్మీడియట్ ఫలితాల్లో ప్రతిభ చూపిన పోలీస్ సిబ్బంది పిల్లలను ఎస్పీ రోహిత్‌రాజు అభినందించారు. పోలీస్ హెడ్ క్వార్టర్స్‌లో గురువారం ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమానికి 63 మంది పోలీస్ సిబ్బంది పిల్లలు, వారి తల్లిదండ్రులు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ తల్లిదండ్రులు కష్టాన్ని గుర్తించాలని పిల్లలకు సూచించారు. పట్టుదల, క్రమశిక్షణ, ఆత్మ స్థైర్యం ఉంటే లక్ష్యాలను సులభంగా సాధించవచ్చని సూచించారు. జీవితంలో ఎప్పుడూ పాఠాలను నేర్చుకుంటూనే ఉండాలని చెప్పారు. తాను కూడా పోలీస్ కుటుంబంలో పుట్టి పెరిగానంటూ బాల్యం నుంచి ఐపీఎస్ సాధించే వరకు తన అనుభవాలను వారితో పంచుకున్నారు. అనంతరం విద్యార్థులకు ప్రశంసా పత్రాలు, మెమెంటోలను అందజేశారు. ఈ కార్యక్రమంలో ఏఆర్ డీఎస్పీ సత్యనారాయణ, సీఐలు వెంకటేశ్వర్లు, కరుణాకర్, ఇంద్రసేనారెడ్డి, ఎంటీఓ సుధాకర్, ఆర్‌లు నరసింహారావు, కృష్ణారావు, లాల్ బాబు, సిబ్బంది పాల్గొన్నారు.
సింగరేణి వైద్యుల
నియామకంలో జాప్యం
రుద్రంపూర్: సింగరేణి ఆస్పత్రుల్లో వైద్యుల నియామకంలో యాజమాన్యం తీవ్ర జాప్యం చేస్తోంది. స్పెషలిస్ట్ వైద్యుల కొరతను తీర్చేందుకు సంస్థ వ్యాప్తంగా 32 ఖాళీలను భర్తీ చేసేందుకు గత డిసెంబర్‌లో యాజమాన్యం నోటిఫికేషన్ విడుదల చేసింది. జనవరి 8,9 తేదీల్లో హైదరాబాద్‌లోని సింగరేణి భవన్‌లో సంస్థ ఉన్నతాధికారులు, సీనియర్ వైద్యాధికారులు ఇంటర్వ్యూలు నిర్వహించారు. కానీ ఇప్పటివరకు పోస్టింగ్ ఇవ్వలేదు. కాగా 32 పోస్టులకు 74 మంది అభ్యర్థులు ఇంటర్వ్యూకు హాజరయ్యారు. జనరల్ సర్జన్–4, గైనకాలజిస్ట్–7, పీడియాట్రీషియన్–4, చెస్ట్ ఫిజీషియన్–3, ఈఎన్‌టీ సర్జన్–2, అనష్థీసియన్– 7, పెథాలజిస్ట్–1, హెల్త్ ఆఫీసర్–3, సైక్రియాట్రిస్ట్–1 పోస్టులు ఖాళీగా ఉన్నట్లు నోటిఫికేషన్‌లో పేర్కొన్నారు. ఇప్పటికై నా యాజమాన్యం స్పందించి వైద్యుల పోస్టులను భర్తీ చేయాలని కార్మికులు కోరుతున్నారు.


