పెండింగ్ సమస్యల పరిష్కారమే లక్ష్యం
ప్రభుత్వం, యాజమాన్యంతో చర్చించినా స్పందన రాకపోవడంతో నిర్ణయం
రుద్రంపూర్: సింగరేణిలో పెండింగ్ సమస్యల పరిష్కారం కోసం జాతీయ కార్మిక సంఘాల నాయకులు సమ్మెకు సిద్ధమవుతున్నారు. ఎనిమిది నెలల క్రితం కార్మికుల సమస్యలను యాజమాన్యం, ప్రఽభుత్వం దృష్టికి తీసుకెళ్లినా పరిష్కారంపై దృష్టి సారించలేదని నాయకులు చెబుతున్నారు. ఈనేపథ్యాన కార్మిక సంఘాలతో కలిసి ఈనెల 15వ తేదీ తర్వాత సమ్మె నోటీసు అందజేసి, జూన్‌లో సమ్మెకు సిద్ధమవుతున్నట్లు వెల్లడించారు.
ఒప్పుకున్నవి అమలుకాక..
సింగరేణిలో 2023 డిసెంబర్‌లో గుర్తింపు సంఘం ఎన్నికలు జరిగాయి. అప్పటి నుంచి ఇద్దరు సీఎండీ, డైరెక్టర్లు, ఇతర అధికారులు మారినా కార్మికుల సమస్యలు పరిష్కారం కావడం లేదని చెబుతున్నారు. రాష్ట్రప్రభుత్వం కూడా సమస్యల పరిష్కారానికి ముందుకు రాకుండా నిర్లక్ష్యంగా వ్యహరిస్తుందని ఆరోపిస్తున్నారు. వీటికి తోడు స్ట్రక్చర్ సమావేశంలో అంగీకరించిన వాటిని కూడా అమలుచేయకపోవడంతో కార్మికులు అనేక సమస్యలతో సతమవుతున్నారని చెబుతున్నారు. ఈనేపథ్యాన సమ్మె చేయడం తప్ప మరోమార్గం కానరావడం లేదని కార్మికుల సంఘాల నాయకులు చెబుతున్నారు.
ఇవీ ప్రధాన సమస్యలు..
● గత 14 మాసాలుగా పెండింగ్‌లో మెడికల్ బోర్డ్ నిర్వహించాలని మారుపేర్లు, విజిలెన్స్‌లో ఉన్న సుమారు 3వేల డిపెండెంట్ కేసులను వన్‌టైమ్ సెటిల్‌మెంట్ కింద సెటిల్ చేసి వారికి ఉద్యోగాలు ఇవ్వాలి. (వీటి సమస్యల పరిష్కారం కోసం అడ్వకేట్ జనరల్‌కు లీగల్ ఒపీనియం కోసం పంపి సంవత్సరం దాటినా ఇంత వరకు పరిష్కారం చూపడంలేదు)
● డిస్మిస్ అయిన కార్మికులను 100 మస్టర్లు అనే నిబంధన లేకుండా వన్‌టైమ్ సెటిల్‌మెంట్ కింద ఉద్యోగాలివ్వాలి.
● మైనింగ్, క్లరికల్, ట్రేడ్స్‌మెన్లకు సొంతింటి కల నెరవేర్చాలి.
● సింగరేణి కార్మికులు, రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వానికి రూ.వేల కోట్లను పలు టాక్స్‌ల రూపేణా చెల్లిస్తున్నారు. వాటిలో కార్మికులు చెల్లిస్తున్న ఇన్‌కమ్ టాక్స్‌ను యాజమాన్యమే చెల్లించాలి,
● కొత్తగనులు ప్రారంభించి, స్థానిక యువతకు ఉద్యోగాలు కల్పించాలి.
● సింగరేణికి రావాల్సిన రూ.54 వేల కోట్లను వెంటనే చెల్లించాలి.
● వీకే–7 ఓసీతో పాటు త్వరలో రాబోయే కొత్త గనుల్లో సింగరేణి పర్మనెంట్ కార్మికులతోనే చేయించాలి.
● యాజమాన్యం కార్మికులు సర్‌ప్లస్ ఉన్నారని చెబుతూ మెడికల్ అన్‌ఫిట్ అయిన కార్మికుల పిల్లలకు పోస్టింగ్ ఆర్డర్లు ఇవ్వకుండా నిలిపివేసిన వారికి వెంటనే ఉద్యోగ అవకాశం కల్పించాలి.
● సింగరేణి హెడ్డాఫీస్‌లో డైరెక్టర్ పా వారంలో నాలుగు రోజులు ఉండాలి. (డైరెక్టర్ పా అందుబాటులో లేని కారణంగా సంస్థలో అనేక సమస్యలు పెండింగ్‌లో ఉన్నాయి)
● సంస్థలో గతంలో నిర్వహించిన గ్రీవెన్స్ గత సంవత్సర కాలంగా నిర్వహించకపోవడంతో వేలాది సమస్యలు పెండింగ్‌లో ఉన్నాయి. ఇకనైనా గ్రీవెన్స్‌ను యథావిధిగా నిర్వహించాలి.
● గతంలో డైరెక్టర్ పా సింగరేణి వ్యాప్త కాలనీల్లో పర్యటించి సమస్యలు తెలుసుకునేవారు, గత పన్నెండేళ్లుగా ఈ పక్రియ నిలిచిపోయింది.
● సంస్థలో గతంలో 1.16 వేల మంది కార్మికులు ఉన్నప్పుడు 2,400 మంది అధికారు లు ఉన్నారు. 40 వేల మంది కార్మికులు ఉన్నప్పుడు 2,400 మంది ఉన్నారు. వీరిలో సుమారు 100 మంది అధికారులు అధికంగా ఉన్నారని ఐఈడీ లెక్కలు చెబుతున్నాయి కానీ అధికారుల సంఖ్య తగ్గించకుండా కేవలం కార్మికులను టార్గెట్ చేయడం సరికాదని, అధికంగా ఉన్న అధికారులను తగ్గించాలని డిమాండ్ చేస్తున్నారు.
ఈనెల 15 తర్వాత నోటీసు ఇవ్వనున్న కార్మిక సంఘాలు


