టేకులపల్లి: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న కార్పొరేట్ అనుకూల, రైతు వ్యతిరేక విధానాలతో అన్నదాతలు సంక్షోభంలో కూరుకుపోయారని మాజీ ఎమ్మెల్యే, ఏఐయూకేఎస్ గౌరవ అధ్యక్షుడు గుమ్మడి నర్సయ్య పేర్కొన్నారు. రైతు హక్కుల సాధన కోసం ఐక్యంగా పోరాడాల్సిన సమయం ఆసన్నమైందని తెలిపారు. టేకులపల్లిలో బుధవారం ఆయన మాట్లాడారు. రైతుల సమస్యలపై చర్చించి భవిష్యత్ కార్యాచరణ రూపొందించేలా ఈ నెల 11, 12, 13వ తేదీల్లో ఇల్లెందులో అఖిల భారత ఐక్య రైతు సంఘం(ఏఐయూకేఎస్) ప్రథమ జాతీయ మహాసభలు నిర్వహిస్తున్నట్లు చెప్పారు. సభల వేదికగా రైతుల సమస్యలపై ఉద్యమ కార్యాచరణ ప్రకటించనున్నందున విజయవంతం చేయాలని కోరారు. ఈ నెల 11న సాయంత్రం 4 గంటలకు ఫారెస్ట్ మైదానం నుంచి సింగరేణి మైదానం వరకు భారీ ప్రదర్శన, ఆ తర్వాత జరిగే బహిరంగ సభలో జాతీయ నాయకులు ప్రదీప్‌సింగ్‌ఠాగూర్, విమల్ త్రివేది, కృష్ణ గొగోయ్ తదితరులు పాల్గొంటారని పేర్కొన్నారు. ఇక 12, 13వ తేదీల్లో ప్రతినిధుల సభలు జరుగుతాయని నర్సయ్య వివరించారు. అనంతరం జాతీయ మహాసభల వాల్‌పోస్టర్లను ఆవిష్కరించారు. సమావేశంలో మాస్‌లైన్ జిల్లా కార్యదర్శి ముద్దా భిక్షం, నాయకులు నాయిని రాజు, ధర్మపురి వీరబ్రహ్మచారి, జరుపుల సుందర్, పాయం వెంకన్న, బానోతు లింగా, బుర్ర వెంకన్న పాల్గొన్నారు.
ఈ నెల 11 నుంచి ఏఐయూకేఎస్ జాతీయ మహాసభలు : గుమ్మడి నర్సయ్య


