టేకులపల్లి: ప్రతీఒక్కరు అప్రమత్తంగా ఉండడంతో పాటు కనీస జాగ్రత్తలు పాటిస్తే విద్యుత్ ప్రమాదాల బారిన పడకుండా కాపాడుకోవచ్చని విద్యుత్ శాఖ ఎస్‌ఈ మహేందర్ తెలిపారు. టేకులపల్లి మండలం బొమ్మనపల్లి సబ్ స్టేషన్ ఆవరణలో విద్యుత్ భద్రతా వారోత్సవాల్లో భాగంగా బుధవారం నిర్వహించిన సదస్సులో ఆయన మాట్లాడారు. విద్యుత్ సిబ్బంది నిరంతరం అప్రమత్తంగా ఉంటూ పొరపాట్లకు తావివ్వొద్దని సూచించారు. విధి నిర్వహణలో తప్పనిసరిగా రక్షణ పరికరాలు ఉపయోగించాలని స్పష్టం చేశారు.
సబ్‌స్టేషన్ల అనుసంధానం పూర్తి
మండలంలో వినియోగదారులకు నాణ్యమైన, అంతరాయం లేని విద్యుత్ సరఫరా అందించాలనే లక్ష్యంతో చేపట్టిన ఇంటర్ లింకింగ్(అనుసంధానం) పనులు పూర్తయ్యాయి. కోయగూడెం – బోడు సబ్‌స్టేషన్ల మధ్య 19 కి.మీ. మేర 33 కేవీ ఇంటర్ లింకింగ్ లైన్ పూర్తికావడంతో ఎస్‌ఈ మహేందర్ ప్రారంభించారు. ఇన్నాళ్లు కోయగూడెం సబ్‌స్టేషన్‌కు కొత్తగూడెం(ఆర్‌టీఎస్‌ఎస్ నుంచి, బోడు సబ్‌స్టేషన్‌కు ఇల్లెందు విద్యుత్ సరఫరా జరుగుతుండగా, సాంకేతిక లోపం తలెత్తినప్పుడు ఇబ్బంది రాకుండా ఈ ప్రత్యామ్నాయ లైన్ ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమాల్లో డీఈలు రంగస్వామి, నందయ్య, వెంకటేశ్వర్లు, ఏడీఈ రఘురామయ్య, ఏఈలు హెచ్.దేవా, శ్రీకాంత్, సబ్ ఇంజనీర్ ప్రసాద్, సిబ్బంది పాల్గొన్నారు.
భద్రతా వారోత్సవాల్లో ఎస్‌ఈ మహేందర్


