నకిలీ.. చెలామనీ ! | - | Sakshi
Sakshi News home page

నకిలీ.. చెలామనీ !

May 6 2026 8:25 AM | Updated on May 6 2026 8:25 AM

సరిహద్దు మండలాల్లో..

జిల్లాలో చాప కింద నీరులా

నకిలీ కరెన్సీ దందా

ఇతర జిల్లాల్లో నమోదైన

రెండు కేసుల్లో జిల్లా వాసులు

అప్రమత్తంగా లేకుండా

మోసపోయే అవకాశం

ఆశ.. దురాశ

రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా కరెన్సీ ముద్రణలో అనేక జాగ్రత్తలు తీసుకుంటుంది. ఫలితంగా అచ్చు ఇలాంటి నట్లను తయారుచేయడం అసాధ్యం. కానీ అచ్చమైన నోట్ల తరహాలోనే నకిలీ నోట్లు తయారు చేస్తామని, వాటిని సులువుగా చలామణిలోకి తీసుకుకురావడం అనతి కాలంలోనే డబ్బు సంపాదించొచ్చని కొన్ని ముఠాలు నమ్మబలుతుకున్నాయి. ఇలాంటి వారిని నమ్మి ఉచ్చులో చిక్కుకుంటున్న కొందరు సామాన్యులను మోసం చేస్తున్నారు. ఆపై పోలీసులకు పట్టుబడితే ఉన్నదంతా పోగొట్టుకుంటున్నారు.

జూదస్థావరాలే లక్ష్యం

నకిలీ నోట్ల దందా పేరుతో మోసాలకు పాల్పడే వ్యక్తులు నగదు లావాదేవీలు ఎక్కువగా జరిగే చోట, అసాంఘిక కార్యకలాపాలు కొనసాగే ప్రాంతాలను లక్ష్యంగా చేసుకుంటున్నారు. ముఖ్యంగా చట్ట వ్యతిరేక పనుల్లో నిమగ్నమై త్వరగా ధనవంతులు కావాలనే దురాశ కలిగిన వారు, జూదం, తాగుడు వంటి వ్యక్తిగత బలహీనతలు ఉన్నవారిని ఎంచుకుంటున్నట్లు తెలుస్తోంది. ఒకటికి నాలుగింతల నకిలీ కరెన్సీ ఇస్తామని నమ్మబలికి చలామణిలోకి తీసుకొస్తన్నట్లు సమాచారం. అక్కడ మోసం జరిగినట్టు తెలిసినా.. ఎవరూ బయటకు చెప్పలేరనే ధైర్యంతో నకిలీ కరెన్సీ ఇచ్చే వారు, చెలామణి చేసే వారు అడుగు ముందుకేస్తున్నట్లు తెలుస్తోంది. మరికొందరు నకిలీ కరెన్సీ అప్పగింతలు జరిగే సమయంలో ఆయా బృందాల్లోని వారినే పోలీసుల రూపంలో ప్రవేశపెట్టి మరింత డబ్బు గుంజుతున్నారనే గుసగుసలు వినిపిస్తున్నాయి.

పోలీసులకు చెప్పండి

ఇతరులను మోసం చేద్దామనే ఉద్దేశంతో దొంగనోట్ల ముఠాతో చేతులు కలిపే వ్యక్తులే ఎక్కువగా నష్టపోతున్నారు. అయినా ఇవి చట్టవ్యతిరేకమైన చర్యలు కావడంతో బయటకు చెప్పుకోలేకపోతున్నారు. దీనిని అదనుగా చేసుకుని నకిలీ నోట్ల గ్యాంగులు ఒకరి తర్వాత ఒకరిపై వల వేస్తూ తమ పని కానిస్తున్నారనే అనుమానాలు ఉన్నాయి. మోసపోయామని తెలుసుకున్న వ్యక్తులు సైతం తమ దగ్గరి దొంగనోట్లను చలామణిలోకి తెచ్చే సాహసం చేయకుండా గుమ్మున ఉండిపోతున్నారు. ఆ నకిలీ కరెన్సీని కాల్చేయడమో లేదా చించేయడమో చేస్తున్నారు. ఎవరైనా నకిలీ నోట్లు ఇస్తామంటూ సంప్రదింపులు జరిపితే వెంటనే ఆ విషయాన్ని పోలీసులకు చేరవేయడం ఉత్తమమని.. తద్వారా వారే కాక మరికొందరు మోసపోకుండా కాపాడినట్లవుతుందని అధికారులు సూచిస్తున్నారు.

ఇటీవల అశ్వారావుపేటలో ఓ వ్యక్తి భారీ స్థాయిలో ఫర్నిచర్‌ కొనుగోలు చేసి నగదు రూపంలో బిల్లు చెల్లించాడు. ఫర్నీచర్‌ షాపు యజమాని ఆ నగదును బ్యాంకులో జమ చేసేందుకు వెళ్లగా నకిలీ నోట్లుగా తేలింది. దీంతో పోలీసులు లోతుగా విచారిస్తే నకిలీ నోట్ల దందా గుట్టు రట్టయింది. ఇందులో సంబంధం ఉన్న వ్యక్తులు ఆంధ్ర, తెలంగాణ సరిహద్దు ప్రాంతాలను లక్ష్యంగా చేసుకుని దందా కొనసాగిస్తున్నట్టుగా తేలింది. ఇది జరిగిన కొద్దిరోజులకే వరంగల్‌లో మరో ముఠా పోలీసులకు పట్టుబడింది. ఈ ముఠా సభ్యులు రసాయన చర్యల ద్వారా అసలు నోట్లను పోలిన నకిలీ నోట్లను తయారు చేయవచ్చంటూ ప్రజలను బురిడీ కొట్టించేందుకు ప్రయత్నించినట్టు తేలింది. ఈ ముఠాకు సంబంధించి ఎనిమిది మందిని పోలీసులు అరెస్ట్‌ చేయగా అందులో ఒకరు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కరకగూడెం వాసి, మరొకరు ఖమ్మం జిల్లా వేంసూరు మండలానికి చెందిన వ్యక్తిగా తేలింది. ఈ రెండు మండలాలు రాష్ట్ర సరిహద్దులకు దగ్గరగా ఉండడం విశేషం. నకిలీ కరెన్సీ దందాపై పోలీసు శాఖ మరింత లోతైన విచారణ ఇప్పటికే మొదలుపెట్టింది. త్వరలోనే మరిన్ని వివరాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది.

ఇప్పటికే సైబర్‌ నేరాలు జిల్లా వాసులను ఇబ్బంది పెడుతుంటే చాపకింద

నీరులా నకిలీ కరెన్సీ రాకెట్‌ కూడా కొనసాగుతుందా.. అంటే

ఔననే సమాధానమే

వస్తోంది. నకిలీ నోట్లకు

సంబంధించి వివిధ

జిల్లాల్లో ఇటీవల నమోదైన కేసుల్లో జిల్లా వాసుల పాత్ర బయటపడడం ఈ అనుమానాలకు బలం చేకూరుస్తోంది. దీంతో నకిలీ నోట్ల దందాపై జిల్లా

వాసులు అప్రమత్తంగా

ఉండాల్సిన అవసరాన్ని

చాటుతోంది.

– సాక్షి ప్రతినిధి, భద్రాద్రి కొత్తగూడెం

Advertisement
 
Advertisement
Advertisement