రైతులకు ఇబ్బంది లేకుండా
ధాన్యం కొనుగోళ్లు
చర్ల మండల పర్యటనలో
కలెక్టర్ అంకిత్
చర్ల: ఇందిరమ్మ నిర్మాణాలు వేగంగా పూర్తయ్యేలా పర్యవేక్షించడంతో పాటు నాణ్యత లోపించకుండా చూడాలని కలెక్టర్ అంకిత్ ఆదేశించారు. చర్ల మండలంలో మంగళవారం ఆయన పర్యటించారు. ఈ సందర్భంగా ధాన్యం కొనుగోలు కేంద్రం, ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలు, సామాజిక ఆరోగ్య కేంద్రాన్ని తనిఖీ చేశారు. తొలుత సత్యనారాయణపురంలోని ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని పరిశీలించిన కలెక్టర్ ఇప్పటివరకు జరిగిన కొనుగోళ్లపై ఆరా తీశారు. అలాగే, కేంద్రంలో టార్పాలిన్లు, తాగునీటి వసతులపై సూచనలు చేశారు. అంతేకాక రైతులతో మాట్లాడి సమస్యలను తెలుసుకున్నారు. ధాన్యం తీసుకొచ్చిన రైతులు ఇబ్బంది పడకుండా ఎప్పటికప్పుడు కాంటా వేయడమే కాక మిల్లులకు తరలించాలని అధికారులకు సూచించారు. అనంతరం సత్యనారాయణపురంలో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలను పరిశీలించిన కలెక్టర్... ప్రతీ దశలో నాణ్యతపై దృష్టి సారించాలని తెలిపారు. అలాగే, త్వరగా నిర్మాణాలు పూర్తయ్యేలా లబ్ధిదారులకు అవగాహన కల్పించాలని చెప్పారు. ఆపై చర్ల సామాజిక ఆరోగ్య కేంద్రాన్ని తనిఖీ చేసిన కలెక్టర్... మెటర్నిటీ వార్డు, డయాలసిస్ కేంద్రం, మందుల నిల్వ గది, ఔట్ పేషెంట్ విభాగాల్లో పరిశీలించారు. ఆస్పత్రిలో త్రాగునీటి కొరత ఉన్నట్లు తెలియడంతో సంబంధిత అధికారులతో సమన్వయం చేసుకోవా లని సూచించారు. తహసీల్దార్ శ్రీనివాసరావు, ఎంపీడీఓ ఈదయ్య, ఆస్పత్రి సూపరింటెండెంట్ సాయివర్ధన్, వైద్యులు రాంప్రసాద్, రవికుమార్, తిరుపతిరావుతో పాటు వివిధ శాఖల ఉద్యోగులు ముకేశ్, లావణ్య, అరుణ్, రాము పాల్గొన్నారు.
ఫెయిల్ అయిన విద్యార్థులకు ప్రత్యేక తరగతులు
సూపర్‌బజార్(కొత్తగూడెం): ఇంటర్మీడియట్, పదో తరగతి ఫెయిల్ అయిన విద్యార్థుల కోసం ప్రత్యేక తరగతులు కొనసాగించాలని కలెక్టర్ అంకిత్ సూచించారు. పలు అంశాలపై అధికారులతో మంగళవారం ఆయన టెలీ కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించారు. మండలాల వారీగా ఫెయిల్ అయిన విద్యార్థుల వివరాలను సేకరించాలని తెలిపారు. భద్రాచలం, పాల్వంచ, చండ్రుగొండలో నిర్వహిస్తున్న సప్లమెంటరీ క్యాంపుల్లో విద్యార్థులపై శ్రద్ధ కనబర్చాలని.. తద్వారా సప్లమెంటరీ పరీక్షల్లో వంద శాతం ఉత్తీర్ణత నమోదయ్యేలా చూడాలని చెప్పారు. ఇక పాఠశాలల్లో అభివృద్ధి పనులను పునఃప్రారంభం నాటికి పూర్తిచేయాలని కలెక్టర్ సూచించారు.


