కొత్తగూడెంఅర్బన్: ఇటీవల వెలువడిన పదో తరగతి పరీక్ష ఫలితాల్లో తక్కువ ఉత్తీర్ణత శాతం నమోదైన పాఠశాలల హెచ్‌ఎంలు, ఉపాధ్యాయుల నుంచి వివరణ తీసుకున్నామని జిల్లా విద్యా శాఖా ధికారి బి.నాగలక్ష్మి తెలిపారు. జిల్లా కేంద్రంలోని డీఈఓ కార్యాలయంలో మంగళవారం ఫలితాలపై నిర్వహించిన సమీక్షలో ఆమె మాట్లాడారు. జిల్లాలో 90.58 శాతం ఉత్తీర్ణత నమోదు కాగా, తక్కువ ఉత్తీర్ణత వచ్చిన పాఠశాలలపై దృష్టి సారించనున్నట్లు తెలిపారు. అంతేకాక ఫెయిల్ అయిన విద్యార్థులకు ప్రత్యేక తరగతులు నిర్వహిస్తూ జూన్‌లో జరిగే సప్లిమెంటరీ పరీక్షల్లో వంద శాతం ఉత్తీర్ణత నమోదయ్యేలా శ్రద్ధ వహించాలని సూచించారు. కాగా, ఈనెల 11 నుంచి పీఎంశ్రీ పాఠశాలల్లో సమ్మర్ క్యాంపులు, 12నుంచి పదో తరగతి రెమిడియల్ క్యాంపుల నిర్వహణతో పాటు జయశంకర్ బడిబాట, లైబ్రరీ డే, ఆర్ట్స్ క్రాఫ్ట్స్ అండ్ కల్చరర్ డే నిర్వహణపై సూచనలు చేశారు. అనంతరం పదో తరగతిలో అత్యధిక మార్కులు సాధించిన విద్యార్థులను డీఈఓ సన్మానించారు. ఈ సమావేశంలో అసిస్టెంట్ డైరెక్టర్ ఎస్.శంభుప్రసాద్, అసిస్టెంట్ కమిషనర్ మాధవరావు, ఎంఈఓలు, హెచ్‌ఎంలు తదితరులు పాల్గొన్నారు.
ఎస్సెస్సీ ఫలితాలపై సమీక్షలో డీఈఓ


