ఉత్తమ సేవలకు ‘ప్రగతిచక్ర’ అవార్డులు | - | Sakshi
Sakshi News home page

ఉత్తమ సేవలకు ‘ప్రగతిచక్ర’ అవార్డులు

May 6 2026 8:19 AM | Updated on May 6 2026 8:19 AM

భద్రాచలంటౌన్‌: ప్రయాణికులను సురక్షితంగా గమ్యస్థానాలకు చేర్చడమే కాక సంస్థ అభివృద్ధికి తోడ్పడుతున్న సిబ్బందిని ప్రోత్సహించేలా ‘ప్రగతి చక్ర’ అవార్డులు ఇస్తున్నట్లు ఆర్‌టీసీ ఖమ్మం రీజినల్‌ మేనేజర్‌ సరిరామ్‌ తెలిపారు. భద్రాచలం డిపోలో మంగళవారం జరిగిన సమావేశంలో రీజియన్‌ స్థాయిలో ఎంపికై న వారికి ఆయన అవార్డులు అందజేసి మాడ్లాడా రు. ప్రయాణికులను గమ్యస్థానాలకు క్షేమంగా చేర్చడం, సమయపాలన పాటించడమే కాక అత్యుత్తమ సేవలు అందిస్తున్న సిబ్బందిని ప్రోత్సహించేందుకే పురస్కారాలు అందజేస్తున్నామని తెలిపారు. అనంతరం రీజియన్‌ పరిధిలో 56 మంది డ్రైవర్లు, కండక్టర్లు, అద్దె బస్సు డ్రైవర్లకు ఆర్‌ఎం అవార్డులు అందజేశారు. డిప్యూటీ ఆర్‌ఎం మల్లయ్య, భద్రాచలం, మధిర, సత్తుపల్లి, ఖమ్మం డీఎంలు జంగయ్య, రామయ్య, లక్ష్మీనారాయణ, శివప్రసాద్‌తో పాటు ఉద్యోగులు పాల్గొన్నారు.

ఎస్‌ఐ చొరవతో

నలుగురికి కృత్రిమ కాళ్లు

వైరా: ఉమ్మడి జిల్లాలోని నలుగురు దివ్యాంగులకు వైరా ఎస్‌ఐ పుష్పాల రామారావు చొరవ తో హైదరాబాద్‌కు చెందిన నారాయణ సేవా సంస్థాన్‌ బాధ్యులు కృత్రిమ కాళ్లను సమకూర్చారు. వైరా మండలం సోమవరం గ్రామానికి చెందిన కొప్పుల రామకృష్ణారావు, గొల్లపూడికి చెందిన బంకా మల్లయ్య భద్రాద్రి జిల్లా ములకలపల్లి మండలం తిమ్మంపేటకు చెందిన తుర్రం శ్రీరాములుతో పాటు ఏపీలోని కృష్ణా జిల్లా తిరువూరుకు చెందిన మీసాల వెంకటసత్యనారాయణ పలు కారణాల వల్ల ఒక్కో కాలు కోల్పోయారు. వీరి సమస్యను ఎస్‌ఐ రామారావు దృష్టికి తీసుకెళ్లగా ఆయన నారాయణ సేవా సంస్థాన్‌ బాధ్యులకు వివరించా రు. దీంతో నలుగురికి కృత్రిమ కాళ్లను సమకూర్చారు. ఈ సందర్భంగా వారు మంగళవారం ఎస్‌ఐని కలిసి కృతజ్ఞతలు తెలిపారు.

బాలిక అదృశ్యం

దమ్మపేట: మండలంలోని నాచారం గ్రామానికి చెందిన బాలిక కనిపించకుండా పోయిన ఘటనపై పోలీసులు మంగళవారం కేసు నమోదు చేశారు. గ్రామానికి చెందిన బాలిక (17) ఇటీవల ఇంటర్‌ పూర్తి చేసి, ఇంటి వద్దనే ఉంటోంది. కాగా ఈ నెల 3న అర్ధరాత్రి ఇంటి నుంచి వెళ్లిపోయి తిరిగి రాలేదు. కుటుంబ సభ్యులు ఆమె కోసం పలుచోట్ల వెతికినా ఆచూకీ లభించలేదు. బాలిక తల్లి రమాదేవి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టామని ఎస్‌ఐ సాయికిశోర్‌రెడ్డి తెలిపారు.

Advertisement
 
Advertisement
Advertisement