వడదెబ్బతో వ్యవసాయ కూలీ మృతి | - | Sakshi
Sakshi News home page

వడదెబ్బతో వ్యవసాయ కూలీ మృతి

May 6 2026 8:19 AM | Updated on May 6 2026 8:19 AM

టేకులపల్లి: సుజాతనగర్‌ మండలం స్టేషన్‌బేతంపూడికి చెందిన తేజావత్‌ టిల్లా (36) వడదెబ్బతో మంగళవారం మృతి చెందాడు. మండలంలోని వెంకట్యాతండాకు చెందిన సరోజతో టిల్లాకు వివాహం జరగగా ఇద్దరు పిల్లలు ఉన్నారు. వ్యవసాయ సీజన్‌లో సాగు పనులు, మిగతా సమయంలో కూలీకి వెళ్లే ఆయన మూడురోజుల క్రితం తండాలో మిర్చి ఏరే పనికి వచ్చాడు. మంగళవారం మధ్యాహ్నం వరకు ఎండలో పనిచేశాక స్వగ్రామానికి వెళ్తూ రోడ్డుపై కుప్పకూలాడు. స్థానికులు ఆయనను 108 అంబులెన్స్‌లో కొత్తగూడెం ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలోనే ప్రాణాలు కోల్పోయాడు.

సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయ డ్రైవర్‌ అరెస్ట్‌

బూర్గంపాడు: గతంలో బూర్గంపాడు సబ్‌ రిజిస్ట్రార్‌గా పనిచేసిన ఖదిర్‌ను పలు అవినీతి ఆరోపణలతో ఏసీబీ అధికారులు అరెస్ట్‌ చేశారు. విచారణలో భాగంగా ఖదిర్‌ కారుడ్రైవర్‌గా పనిచేసిన ఫహీమ్‌ను మంగళవారం ఏసీబీ అధికారులు అరెస్ట్‌ చేసి ఖమ్మం కోర్టులో హాజరుపరిచారు. ఏసీబీ డీఎస్పీ వై.రమేశ్‌ కథనం మేరకు.. బూర్గంపాడు సబ్‌రిజిస్ట్రార్‌గా పనిచేసిన ఖదిర్‌పై ఫిర్యాదుల మేరకు గత జూన్‌లో కార్యాలయంలో సోదాలు నిర్వహించి ఆధారాలు సేకరించారు. ఖదిర్‌ తన కారుడ్రైవర్‌ ఫహీమ్‌తో లావాదేవీలు నడిపించి, లంచాలను అతని ఫోన్‌పేతో బదిలీ చేయించుకున్నట్లు తేలడంతో ఫహీమ్‌ను అరెస్ట్‌ చేసినట్లు డీఎస్పీ వివరించారు.

చెరువులో పడి వ్యక్తి మృతి..

సుజాతనగర్‌: చెరువులో పడి వ్యక్తి మృతి చెందిన ఘటనపై స్థానిక పోలీసులు మంగళవారం కేసు నమోదు చేశారు. ఎస్‌ఐ రమాదేవి కథనం మేరకు.. కోమటిపల్లికి చెందిన బాదావత్‌ శ్రీను (45) గ్రామంలోని చెరువు వద్దకు సోమవారం వెళ్లాడు. ఇంటికి రాకపోయే సరికి కుంటుంబ సభ్యులు వెతికినా ఆచూకీ దొరకలేదు. మంగళవారం ఉదయం చెరువు వద్ద అతడి దుస్తులు కనిపించగా.. చెరువులో గాలించడంతో మృతదేహం దొరికింది. చేపల వేటకు వెళ్లి ప్రమాదవుశాత్తు మృతి చెందాడని కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశామని ఎస్‌ఐ వివరించారు.

Advertisement
 
Advertisement
Advertisement