నేత్రపర్వంగా రామయ్య నిత్యకల్యాణం
ముగిసిన రామదాసు జయంత్యుత్సవాలు
భద్రాచలం : భద్రాచలం శ్రీ సీతారామచంద్రస్వామి వారి నిత్యకల్యాణ వేడుక మంగళవారం నేత్రపర్వంగా సాగింది. తెల్లవారుజామున గర్భగుడిలో స్వామి వారికి సుప్రభాత సేవ, సేవా కాలం, ఆరాధన తదితర పూజలుచేశారు. అనంతరం బేడా మండపంలో కొలువుదీర్చి విశ్వక్సేన పూజ, పుణ్యావాచనం చేశారు. స్వామివారికి కంకణధారణ, యజ్ఞోపవీత ధారణ, అమ్మవారికి కంకణధారణ, యోక్త్రధారణ గావించి నిత్యకల్యాణ ఘట్టాన్ని అర్చకులు శాస్త్రోక్తంగా నిర్వహించారు. కాగా, మంగళవారాన్ని పురస్కరించుకుని ఆంజనేయస్వామి వారికి అభిషేకం, ప్రత్యేక పూజలు చేశారు. ఆలయంలో ఐదు రోజులుగా నిర్వహిస్తున్న భక్త రామదాసు జయంత్యుత్సవాలు మంగళవారం ముగిశాయి.
రెండు రోజులు నిత్యకల్యాణాలు
నిలిపివేత
సహస్ర కలశాభిషేక ఉత్సవాలను పురస్కరించుకుని ఈనెల 31, ఫిబ్రవరి 1 తేదీల్లో స్వామివారి నిత్యకల్యాణాలను నిలిపి వేస్తున్నట్లు ఆలయ ఈఓ దామోదర్‌రావు తెలిపారు. తిరిగి 2వ తేదీ నుంచి యథావిధిగా జరుగుతాయని పేర్కొన్నారు.
వన్యప్రాణుల సంరక్షణపై అవగాహన పెంచాలి
సూపర్‌బజార్(కొత్తగూడెం): వన్యప్రాణులను వేటాడకుండా ప్రజల్లో అవగాహన కల్పించాల్సిన అవసరం ఉందని అదనపు కలెక్టర్ డి.వేణుగోపాల్, జిల్లా అటవీ శాఖాధికారి కృష్ణాగౌడ్ అన్నారు. ‘మానవ – వన్యప్రాణి సంఘర్షణ’ అంశంపై కలెక్టరేట్ కాన్ఫరెన్స్ హాలులో మంగళవారం నిర్వహించిన సదస్సులో వారు మాట్లాడారు. అటవీ ప్రాంతాల పక్కన ఉండే గ్రామాల్లో ఇలాంటి ఘటనలు ఎక్కువగా జరుగుతున్నాయని, నివారణకు చర్యలు చేపట్టాలని అన్నారు. ఇందుకోసం అటవీశాఖతో పాటు రెవెన్యూ, పోలీస్, వ్యవసాయ, విద్యుత్, పంచాయతీ శాఖలు సమన్వయంతో పనిచేయాలని సూచించారు. సమావేశంలో డీపీఓ సుధీర్, పాల్వంచ డీఎస్పీ సతీష్, విద్యుత్ శాఖ ఎస్‌ఈ మహేందర్ తదితరులు పాల్గొన్నారు.
ఐదు రోజుల పని విధానం అమలు చేయాలి
కొత్తగూడెంఅర్బన్: బ్యాంకుల్లో ఐదు రోజుల పని విధానాన్ని అమలు చేయాలనే డిమాండ్‌తో మంగళవారం అన్ని బ్యాంకుల సిబ్బంది సమ్మె చేశారు. ఈ సందర్భంగా భారీ ర్యాలీ నిర్వహించారు. అనంతరం ఉద్యోగ సంఘాల నాయకులు మాట్లాడుతూ.. సిబ్బందిపై పెరుగుతున్న పని భారాన్ని తగ్గించాలని అన్నారు. ఇలా చేయడం వల్ల ఉద్యోగులకే కాక ప్రజలకు కూడా మేలు జరుగుతుందని చెప్పారు. కార్యక్రమంలో బ్యాంక్ ఆఫీసర్స్ అసోసియేషన్ ప్రాంతీయ కార్యదర్శి కె.శ్రీకాంత్, కార్యదర్శి భవానీశంకర్, ఆర్గనైజింగ్ సెక్రటరీ శాంతి, డీసీసీబీ కార్యదర్శి కృష్ణారావు, యూనియన్ బ్యాంక్ కార్యదర్శి శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు.
జాతీయస్థాయి
రగ్బీ పోటీలకు ఎంపిక
ఇల్లెందురూరల్: మండలంలోని సుదిమళ్ల గిరిజన సంక్షేమ బాలికల గురుకుల పాఠశాల విద్యార్థిని ప్రవళిక జాతీయ స్థాయి రగ్బీ పోటీలకు ఎంపికై ంది. ఈ నెల 25న హైదరబాద్‌లో నిర్వహించిన రాష్ట్ర స్థాయి క్రీడల్లో ఉత్తమ ప్రతిభ చూపింది. ఈ నెల 30వ తేదీ నుంచి ఫిబ్రవరి 3వ తేదీ వరకు న్యూఢిల్లీలో నిర్వహించే జాతీయ పాఠశాలల స్థాయి క్రీడల్లో ఆమె పాల్గొననుంది. మంగళవారం పాఠశాలలో విద్యార్థిని హెచ్‌ఎం మాధవి, ఉపాధ్యాయులు అభినందించారు. శాలువాతో ఘనంగా సన్మానించారు.
నేత్రపర్వంగా రామయ్య నిత్యకల్యాణం
నేత్రపర్వంగా రామయ్య నిత్యకల్యాణం


