క్యూలైన్లు, ప్రసాదాల కౌంటర్ల పెంపు
● భక్తుల రద్దీకి తగ్గట్టుగా మార్పులు ● పరిశీలించిన రామాలయ ఈఓ
భద్రాచలం : శ్రీ సీతారామ చంద్రస్వామి వారి ఆలయంలో భక్తుల రద్దీకి తగ్గట్టుగా అధికారులు మార్పులు, చేర్పులు చేపట్టనున్నారు. నానాటికీ భక్తుల రాక పెరుగుతుండగా, సెలవులు, వారాంతపు రోజుల్లో ఆలయం కిటకిటలాడుతోంది. ఈ నేపథ్యంలో స్వామివారి అంతరాలయంలోకి వెళ్లే క్యూలైన్లు, ప్రసాదాల కౌంటర్ల వద్ద తోపులాట చోటుచేసుకుంటోంది. స్వామివారి దర్శనానికి కూడా జాప్యం జరుగుతుండడంతో అధికారులు ప్రత్యామ్నాయ ఏర్పాట్లను పరిశీలిస్తున్నారు. ప్రస్తుతం తూర్పు మెట్ల వద్ద ప్రసాదాల కౌంటర్లు ఉన్నాయి. దీనికి అదనంగా ఇటీవల మాఢ వీధుల విస్తరణలో ఖాళీ చేసిన స్థలంలో తాత్కాలికంగా ప్రసాదం కౌంటర్ ఏర్పాటుకు ఈఓ దామోదర్‌రావు మంగళవారం పరిశీలించారు. ఆలయంలో సైతం క్యూ లైన్ల విస్తరణ చేపట్టాల్సిన చర్యలపై ఈఈ రవీందర్, ఏఈఓ శ్రవణ్‌కుమార్‌తో చర్చించారు. ఈ సందర్భంగా ఈఓ మాట్లాడుతూ.. మాస్టర్ ప్లాన్ అమలయ్యే అవకాశాలు ఉండటంతో అప్పటి వరకు తాత్కాలికంగా ప్రసాదం కౌంటర్, క్యూ లైన్ల విస్తరణను చేపట్టనున్నట్లు తెలిపారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా త్వరలోనే చర్యలు చేపడతామని వెల్లడించారు.


