గిరిజనాభివృద్ధికి సహకరించాలి
సీఎస్‌ఆర్ సమ్మిట్‌లో కలెక్టర్ పాటిల్,
పీఓ రాహుల్
భద్రాచలం: జిల్లాలోని గిరిజన ప్రాంతాల అభివృద్ధికి కార్పొరేట్ సంస్థలు సహకరించాలని కలెక్టర్ జితేష్ వి పాటిల్, ఐటీడీఏ పీఓ బి.రాహుల్ కోరారు. ఐటీడీఏ ప్రాంగణంలో మంగళవారం నిర్వహించిన సీఎస్సార్ సమ్మిట్‌లో వారు మాట్లాడారు. నాలుగు రాష్ట్రాలకు కూడలిగా ఉన్న జిల్లాలో స్థానిక గిరిజనులతో పాటు వలస ఆదివాసీలు కూడా అధికంగా ఉన్నారని, వారి అభివృద్ధికి ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలు అమలు చేస్తోందని చెప్పారు. వారి జీవన ప్రమాణాలు మరింతగా మెరుగు పడాలంటే సీఎస్‌ఆర్ తరఫున కార్పొరేట్ సంస్థలు చేయూత అందించాలని అన్నారు. విద్య, వైద్యం, గ్రామాల్లో మౌలిక వసతుల కల్పన, సన్న, చిన్నకారు రైతులకు వ్యవసాయంలో మెళకువలు, నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు, చిన్నారులకు పోషకాహారం తదితర అవసరాలు తీర్చేందుకు ప్రభుత్వంతో కలిసి రావాలని సూచించారు. మారూమూల ప్రాంతాలకు సీఎస్‌ఆర్ సేవలు చేరడం ద్వారా అభివృద్ధి సులభం అవుతుందని అన్నారు. అనంతరం ఇన్ఫోసిస్, బోస్, సింగరేణి, ఐడీఓ, యుఎస్టీ గ్లోబల్, హోప్ ఫర్ స్పందన, సిస్కో, మెరిటేటివ్, దేవకి ఫౌండేషన్ తదితర సంస్థల ప్రతినిధులు సీఎస్సార్ కింద తాము అందించిన సేవలను వివరించారు. గిరిజనాభివృద్ధికి తమ వంతు సహకారం అందిస్తామని వెల్లడించారు. కార్యక్రమంలో సబ్ కలెక్టర్ మ్రిణాల్ శ్రేష్ఠ, ఐటీడీఏ ఏపీఓ జనరల్ డేవిడ్ రాజ్, డీఆర్డీఓ విద్యాచందన, సీపీఓ సంజీవరావు, ఏఓ సున్నం రాంబాబు, సీఎస్సార్ లైసెన్సీ యూనియన్ రెడ్డి, వంశీ ముత్యపు రెడ్డి, ఎగ్జిబిటర్ డైరెక్టర్ సుమంత్ వల్లాల తదితరులు పాల్గొన్నారు.


