మేడారానికి పోటెత్తారు..
పిల్లాపాపలతో తల్లుల సన్నిధికి పయనం
ఆర్టీసీకి ప్రయాణికుల తాకిడి
జాతర బస్సుల్లో మహిళలే అధికం
చుంచుపల్లి: మేడారంలో నాలుగు రోజుల పాటు అంగరంగ వైభవంగా జరిగే సమ్మక్క సారలమ్మ మహా జాతర బుధవారం ప్రారంభం అవుతుండగా జిల్లా నుంచి భారీ సంఖ్యలో భక్తులు పయనమయ్యారు. జాతర నేపథ్యంలో సోమవారం నుంచే అన్ని డిపోల నుంచి ఆర్టీసీ అధికారులు మేడారానికి ప్రత్యేక బస్సులు నడుపుతుండగా.. మంగళవారం ఉదయం నుంచి అన్ని ప్రాంతాల్లో భక్తుల రద్దీ పెరిగింది.
కిటకిటలాడిన బస్టాండ్లు..
జిల్లా నలుమూలల నుంచి పిల్లా పాపలతో భారీ సంఖ్యలో మేడారం జాతరకు బయలుదేరారు. దీంతో కొత్తగూడెం, ఇల్లెందు, పాల్వంచ, భద్రాచలం, మణుగూరు ఆర్టీసీ బస్టాండ్లలో ప్రయాణికుల రద్దీ కనిపించింది. బుధ, గురువారాల్లోనూ భక్తులు తండోపతండాలుగా తరలివెళ్లే అవకాశం ఉంది. జారత సందర్భంగా తమకు కావల్సిన ఆహార పదార్థాలతో పాటు మొక్కులు చెల్లించేందుకు బంగారం(బెల్లం), మేకలు, కోళ్లతో సహా తరలివెళ్లారు. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం ఉండడంతో ఎక్కువ మంది ఆర్టీసీ బస్సులను ఆశ్రయిస్తుండగా, కొందరు ప్రైవేటు వాహనాల్లోనూ వెళ్తున్నారు. దీంతో ప్రైవేట్ వాహనాల వారు చార్జీలు భారీగా పెంచారు. గత జాతరతో పోలిస్తే ఇప్పుడు సుమారు 30 శాతం అదనంగా వసూలు చేస్తున్నారు. టాటా ఎస్ వాహనానికి రూ.6 వేల నుంచి రూ.7 వేలు, 12 సీట్ల వాహనాలకు రూ.9 వేలు, మినీ బస్సుకు రూ.12 వేలు, ఇంకాస్త పెద్ద వాహనమైతే రూ.16 వేలు చొప్పున తీసుకుంటున్నారు.
మేడారం వెళ్లే భక్తుల రద్దీ మంగళవారం ఉదయం నుంచి భారీగా పెరిగింది. ప్రయాణీకులకు అనుగుణంగా వివిధ పాయింట్ల నుంచి ప్రత్యేకంగా ఆర్టీసీ బస్సులు నడుస్తున్నాయి. భక్తులకు అన్ని రకాల సమాచారాన్ని సిబ్బంది దగ్గరుండి చూసుకుంటున్నారు. మేడారం వెళ్లే భక్తులు సురక్షితంగా చేరుకోవాలంటే ఆర్టీసీ బస్సుల్లోనే ప్రయాణం చేయాలి.
– రాజ్యలక్ష్మి, కొత్తగూడెం డీఎం
మేడారానికి పోటెత్తారు..
మేడారానికి పోటెత్తారు..


