పరుగులు తీస్తూ..
ప్రమాదం చెప్పిరాదు..
జిల్లా మీదుగా నిత్యం వందలాది వాహనాల్లో రవాణా ఓవర్‌లోడ్, అపరిమిత వేగంతో వెళ్తున్న లారీలు రోడ్ల నాణ్యత, రహదారి భద్రతపై పట్టింపు శూన్యం
రంకెలు
వేస్తూ..
సాక్షి ప్రతినిధి, భద్రాద్రి కొత్తగూడెం: తాండూరు బస్సు ప్రమాద తీరు, జరిగిన నష్టాన్ని చూసి జిల్లా వాసులు ఆందోళన చెందుతున్నారు. ‘తాండూరు’ తరహాలోనే నిత్యం వందల సంఖ్యలో భారీ వాహనాలు ఓవర్‌లోడ్‌తో జిల్లా మీదుగా రయ్‌రయ్ మంటూ రంకెలు వేస్తూ పరుగులు తీస్తున్నాయి.
వందల్లో ఇసుక లారీలు..
గోదావరి నుంచి పూడిక తీత పేరుతో 2.20 కోట్ల క్యూబిక్ మీటర్ల ఇసుకను తవ్వి తీసేందుకు తెలంగాణ మినరల్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ (టీజీఎండీసీ) అనుమతులు జారీ చేసింది. ఈ ఇసుకను తరలించేందుకు చర్ల, అశ్వాపురం, మణుగూరు, పినపాక, దుమ్ముగూడెం మండలాల పరిధిలో 20 రీచ్‌లు ఏర్పాటయ్యాయి. ఇసుక అమ్మడం ద్వారా రాష్ట్ర ఖజానాకు రూ. 2,000 కోట్ల వరకు ఆదాయం సమకూరుతుందని అంచనా. కోట్ల టన్నుల ఇసుక రవాణా చేస్తూ, రూ.వేల కోట్లు ఆర్జించడంపై టీజీఎండీసీకి ఉన్న శ్రద్ధ సదరు ఇసుకను తరలించే ప్రణాళికపై లేకపోవడం గమనార్హం. టీజీఎండీసీ నిర్లక్ష్యంతో జిల్లాలోని పంచాయతీరాజ్, ఆర్‌అండ్‌బీ మొదలుకుని నేషనల్ హైవే వరకు అన్ని రహదారులూ ఛిద్రమైపోతున్నాయి. ఈ రోడ్లపై చినుకుపడితే బురదతో, వర్షం లేకుంటే ఎగిసిపడే దుమ్ముతో ప్రయాణం నరకప్రాయంగా, ప్రమాదభరితంగా మారిందని వాహనదారులు వాపోతున్నారు.
వేగంగా పరుగులు..
ఇసుక రీచ్‌లు అవినీతికి కేరాఫ్‌గా మారాయి. ఓవర్‌లోడ్‌తో లారీలు తిరగడం అనేది నిత్యకృత్యమైతే ఇప్పుడు నకిలీ పర్మిట్ల దందా కూడా పడగ విప్పింది. ఒక పర్మిట్ ఆధారంగా నకిలీ పర్మిట్లు సృష్టించి ఇసుక రవాణా చేస్తున్నారు. ఇలా నకిలీ పర్మిట్లతో నడిచే లారీలు తక్కువ సమయంలో ఎక్కువగా సొమ్ము చేసుకోవాలనే దురాశతో పరిమితికి మించిన వేగంతో వెళ్తున్నాయి. 50 టన్నులకు మించిన బరువు గల లారీలు గంటకు 80 కి.మీ. మించిన స్పీడ్‌తో ప్రయాణం చేస్తున్నాయి. మరోవైపు అనుమతి లేకుండా కిన్నెరసానితో పాటు ఇతర వాగుల నుంచి ఇసుక తరలించే మాఫియా సైతం ఎవరి కంట పడకుండా తమ పని కానిచ్చేందుకు రోడ్లపై విపరీతమైన వేగంతో వాహనాలను నడిపిస్తున్నాయి. దీంతో జిల్లాలో రోడ్ల మీదకు ఎక్కాలంటే భయపడే పరిస్థితి నెలకొంది.
తూతూ మంత్రంగా చర్యలు..
ఇసుక రీచ్‌లతో ఎదురువుతున్న సమస్యలపై బాధితులు ఆందోళన చేస్తే తప్ప ప్రభుత్వం వైపు నుంచి చర్యలు ఉండటం లేదు. మణుగూరు మండలంలో ఇసుక లారీలతో కనీసం స్కూలు బస్సులు కూడా తమ గ్రామానికి రావడం లేదని ప్రజలు ఆందోళన చేయడంతో ఇసుక లారీల రాకపోకలు నిలిపేశారు. కానీ ఆ రోడ్డును భారీ వాహనాలకు అనుగుణంగా అప్‌గ్రేడ్ చేయడంపై ఇప్పటికీ దృష్టి పెట్టడం లేదు. ఇక చర్ల, దుమ్ముగూడెం మండలాల్లో స్థానికులు చేపట్టిన ఆందోళనలకు స్పందించి రోడ్లపై ఏర్పడిన గుంతల్లో వెట్ మిక్స్ (కంకర, సిమెంట్ మిశ్రమం) వేసి చేతులు దులుపుకున్నారు. మరమ్మతులు చేశామనే పేరుతో తిరిగి లారీలు నడిపిస్తున్నారు. ఇలా ఓవర్ లోడ్ లారీలు రెండు రోజులు తిరగగానే సమస్య మళ్లీ మొదటికొచ్చింది. దీంతో చర్ల, దుమ్ముగూడెం మండలాల ప్రజలు మరోసారి తిరుగుబాటుకు సిద్ధం అవుతున్నారు.
ఇసుక లారీల సమస్యకు శాశ్వత పరిష్కారం చూపే దిశగా ఇంతవరకూ ఎలాంటి కార్యాచరణ లేదు. ప్రస్తుతం జిల్లాలో గోదావరి తీర ప్రాంత వాసులు ఎదుర్కొంటున్న సమస్యే పొరుగున ఉన్న ములుగు జిల్లా ప్రజలకు ఎదురైంది. అక్కడి ప్రజలు ఆందోళనలు తీవ్రం చేయడంతో ఆ జిల్లా మీదుగా ఇసుక లారీల రాకపోకలపై పోలీసు శాఖ నియంత్రణ విధించింది. కానీ ఈ జిల్లాలో ఇటు మరమ్మతులూ లేవు.. అటు ఇసుక లారీలపై నియంత్రణా లేదు. ఫలితంగా ప్రజలు ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని రోడ్డెక్కాల్సి వస్తోంది. ‘ప్రమాదం చెప్పి రాదు.. జరిగిన తర్వాత ఏం చేసినా ప్రయోజనం ఉండదు’ అని పలువురు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రోడ్డు నాణ్యత, రహదారుల భద్రత విషయంలో చర్యలు చేపట్టాలని కోరుతున్నారు.
ఇసుక లారీలతో పొంచి ఉన్న ప్రమాదం
పరుగులు తీస్తూ..


