జిన్నింగ్ మిల్లుల బంద్ పాటించొద్దు
మాస్టర్ ప్లాన్ రూపకల్పన చేపట్టాలి
సూపర్‌బజార్(కొత్తగూడెం): జిన్నింగ్ మిల్లులు యథావిధిగా కొనసాగించాలని కలెక్టర్ జితేష్ వి పాటిల్ అన్నారు. మంగళవారం కలెక్టరేట్‌లో జిల్లాలోని జిన్నింగ్ మిల్లుల యాజమాన్య ప్రతినిధులు, మార్కెటింగ్ శాఖ అధికారులు, సీసీఐ ప్రతినిధులతో ఆయన సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. గురువారం నుంచి రాష్ట్రవ్యాప్తంగా జిన్నింగ్ మిల్లుల అసోసియేషన్ బంద్‌కు పిలుపునిచ్చిన నేపథ్యంలో జిల్లా రైతుల ప్రయోజనాల దృష్ట్యా యథాతథంగా కొనసాగించాలనే నిర్ణయం తీసుకున్నామని తెలిపారు. జిల్లాలో ఎల్ –1, ఎల్ –2, ఎల్ –3 రకాల సమస్యలు లేనందున బంద్ చేయాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు. వర్షాలతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నందున పత్తి కొనుగోలు, ప్రాసెసింగ్ ప్రక్రియలో అంతరాయం లేకుండా అన్ని మిల్లులు నిరాటంకంగా పనిచేయాలని ఆదేశించారు. పత్తిలో తేమ 12 శాతానికి మించకుండా తగిన చర్యలు తీసుకోవాలని రైతులకు సూచించారు. ఈ మేరకు మార్కెటింగ్ శాఖ అధికారులు అవగాహన కల్పించి, పత్తి నాణ్యత కాపాడేలా సూచనలు చేయాలని ఆదేశించారు. పత్తి ఆరబెట్టేందుకు మార్కెట్లలో సౌకర్యాలు కల్పించాలన్నారు. సమావేశంలో డీఎంఓ నరేందర్, సీసీఐ బయ్యర్లు, మార్కెట్ కార్యదర్శులు పాల్గొన్నారు.
ఫర్నిచర్ అసిస్టెంట్ కోర్సులో
మూడు నెలల శిక్షణ
ఫర్నిచర్ అసిస్టెంట్‌గా ఆసక్తి ఉన్న వారికి రెసిడెన్షియల్ విధానంలో మూడు నెలల శిక్షణ ఇవ్వనున్నట్లు కలెక్టర్ ఒక ప్రకటనలో తెలిపారు. అభ్యర్థులు ఈనెల 5 వరకు దరఖాస్తు చేసుకుంటే, 6న కలెక్టరేట్‌లో పరీక్ష నిర్వహిస్తామని వెల్లడించారు. కోర్సు పూర్తిచేయడం ద్వారా ఫర్నిచర్ ప్రొడక్షన్, ఇన్‌స్టాలేషన్, మెషిన్ ఆపరేషన్ రంగాల్లో స్థిరమైన ఉపాధి ఉంటుందని తెలిపారు. ఎంపికై న వారికి హైదరాబాద్‌లోని ఎన్‌ఎస్‌టీఐ–ఎఫ్‌ఎఫ్‌ఎస్‌సీ ఆధ్వర్యాన శిక్షణ ఉంటుందని, ఉచిత వసతి, భోజన సదుపాయాలను సీఎస్‌ఆర్ సహకారంతో జిల్లా యంత్రాంగం సమకూరుస్తుందని తెలిపారు. ఆసక్తి ఉన్నవారు https:// tinyurl. com/4zv2bn67 గూగుల్ ఫాం ద్వారా రిజిస్ట్రేషన్ చేసుకోవాలని, వివరాలకు 79958 06182, 77994 70817 నంబర్లలో సంప్రదించాలని సూచించారు.
అమృత్ 2.0 పథకం కింద జీఎస్‌ఐ ఆధారిత మాస్టర్ ప్లాన్ రూపకల్పనను సమర్థవంతంగా చేపట్టాలని కలెక్టర్ జితేష్ వి పాటిల్ సూచించారు. కలెక్టరేట్‌లో మంగళవారం నిర్వహించిన అవగాహన సమావేశంలో ఆయన మాట్లాడారు. భవిష్యత్ పట్టణాభివృద్ధికి ఈ మాస్టర్ ప్లానే మార్గదర్శకమని, అన్ని శాఖల అధికారులు కచ్చితమైన, తాజా సమాచారం అందించాలని సూచించారు. పట్టణ ప్రస్తుత పరిస్థితిని అర్థం చేసుకోవడమే కాకుండా, వచ్చే 20 ఏళ్ల అవసరాలను దృష్టిలో ఉంచుకుని ప్రాదేశిక వివరాలు సేకరించాలన్నారు. డ్రోన్ టెక్నాలజీ ద్వారా డిజిటల్ మ్యాపింగ్ నిర్వహించి భూ వినియోగ మ్యాప్‌లు రూపొందించాలని, తాజా డేటా ఆధారంగా ప్లాన్లను నవీకరించాలని సూచించారు. ఈ ప్రక్రియను ఆర్‌డీఓలు, తహసీల్దార్లు పర్యవేక్షించాలని ఆదేశించారు. సమగ్ర సమాచారం ఆధారంగా డ్రాఫ్ట్ మాస్టర్ ప్లాన్ రూపొందించనున్నట్లు తెలిపారు. సమావేశంలో ట్రెయినీ కలెక్టర్ సౌరభ్ శర్మ, స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ విద్యాచందన, కొత్తగూడెం డీఎస్పీ రెహమాన్, ఆర్‌డీఓ మధు, సీపీఓ సంజీవరావు, కార్పొరేషన్ కమిషనర్ సుజాత తదితరులు పాల్గొన్నారు. ఆ తర్వాత జరిగిన మరో సమావేశంలో కలెక్టర్ మాట్లాడుతూ.. పర్యావరణ పరిరక్షణ, భూగర్భ జలాల పెరుగుదల, పర్యాటక అభివృద్ధి దృష్ట్యా చిత్తడి నేలల సంరక్షణ అత్యంత కీలకమని అన్నారు.


