వైద్య సేవలపై కేంద్ర బృందం ఆరా
భద్రాచలంఅర్బన్ : భద్రాచలం ఏరియా ఆస్పత్రిలో అందుతున్న వైద్య సేవలపై కేంద్ర బృందం ఆరా తీసింది. డీఎంహెచ్‌ఓ జయలక్ష్మి ఆధ్వర్యంలో సీఆర్‌ఎం సభ్యులు మంగళవారం భద్రాచలం ఆస్పత్రిని పరిశీలించారు. ఆస్పత్రిలో జాతీయ ఆరోగ్య మిషన్ కార్యక్రమాలు ఎలా అమలవుతున్నాయని తనిఖీ చేశారు. మిడ్ వైఫ్ సేవలు ఎలా అమలవుతున్నాయి, గర్భిణులకు వాటిపై అవగాహన కల్పిస్తున్నారా, అందులో ఎంత మంది సిబ్బంది పని చేస్తున్నారనే వివరాలు సేకరించారు. ఆ తర్వాత బృందం సభ్యులు డాక్టర్ కల్పనా యాదవ్ పవాలియా, గురీందర్ బీర్ సింగ్, బి.వెంకటశివారెడ్డి, అజయ్‌పాండే, అంకిత కంకర్య, అనర్సింగ్ డాకర్ గర్భిణులు, బాలింతలతో మాట్లాడారు. వివిధ రకాల ఇన్‌ఫెక్షన్లకు ఉపయోగించే సిప్రోఫ్లాక్సాసిన్ మందు కాలపరిమితి ముగిసిందని(ఎక్స్‌పైరీ) గుర్తించారు. కార్యక్రమంలో ఏడీఎంహెచ్‌ఓ సైదులు, జిల్లా ఎన్‌సీడీ అధికారి మధువరణ్, డీఎంఓ స్పందన, టీవీపీ, నోడల్ అధికారి వీరబాబు, జిల్లా టీబీ అధికారి పుల్లారెడ్డి, భద్రాచలం ఏరియా ఆస్పత్రి సూపరింటెండెంట్ రామకృష్ణ, ఆర్‌ఎంఓ రాజశేఖర్ రెడ్డి తదితరులు, పాల్గొన్నారు.
చర్ల సీహెచ్‌సీలో..
చర్ల: చర్ల కమ్యూనిటీ హెల్త్ సెంటర్‌ను సీఆర్‌ఎం బృందం సభ్యులు మంగళవారం తనిఖీ చేశారు. పేషెంట్లకు అందుతున్న వైద్య సేవలు, వసతులు, ఆస్పత్రి పరిసరాలను పరిశీలించారు. వారు కూడా వివిధ రకాల పరీక్షలు చేయించుకున్నారు. పేదలందరికీ ప్రభుత్వ వైద్యం పక్కాగా అందేలా వైద్యాధికారులు, సిబ్బంది చొరవ తీసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో సీహెచ్‌సీ సూపరింటెండెంట్ డాక్టర్ సాయివర్దన్ తదితరులు పాల్గొన్నారు.
భద్రాచలం, చర్ల ఆస్పత్రుల సందర్శన


