నేత్రపర్వంగా రామయ్య నిత్యకల్యాణం
భద్రాచలం: భద్రాచలం శ్రీ సీతారామచంద్ర స్వామి వారి నిత్యకల్యాణ వేడుక మంగళవారం నేత్రపర్వంగా సాగింది. తెల్లవారుజామున గర్భగుడిలో స్వామివారికి సుప్రభాత సేవ, సేవా కాలం, ఆరాధన తదితర పూజలు చేశారు. అనంతరం బేడా మండపంలో కొలువుదీర్చి విశ్వక్సేన పూజ, పుణ్యావాచనం చేశారు. స్వామి వారికి కంకణధారణ, యజ్ఞోపవీత ధారణ, అమ్మవారికి కంకణధారణ, యోక్త్రధారణ గావించి నిత్యకల్యాణ ఘట్టాన్ని అర్చకులు శాస్త్రోక్తంగా నిర్వహించారు. కాగా, మంగళవారాన్ని పురస్కరించుకుని ఆంజనేయస్వామి వారికి అభిషేకం, ప్రత్యేక పూజలు చేశారు.
పెద్దమ్మతల్లి ఆలయంలో నేడు చండీహోమం
పాల్వంచరూరల్ : కార్తీక పౌర్ణమిని పురస్కరించుకుని పెద్దమ్మతల్లి ఆలయంలో బుధవారం చండీహోమం నిర్వహించనున్నట్లు ఈఓ ఎన్.రజనీకుమారి మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. పాల్గొనే భక్తులు రూ.2,516 చెల్లించి గోత్రనామాలు నమోదు చేసుకోవాలని కోరారు. వివరాలకు 63034 08458 నంబర్‌లో సంప్రదించాలని సూచించారు.
పారిశుద్ధ్య పనులు చేపట్టాలి
డీపీఓ అనూష
పినపాక: మండలంలో నిరంతరం పారిశుద్ధ్య పనులు చేపట్టాలని, నిత్యం చెత్త సేకరించాలని డీపీఓ అనూష అధికారులను ఆదేశించారు. మంగళవారం ఆమె మండలంలో పర్యటించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ప్రధాన కూడళ్లలో దోమలు ప్రబలకుండా బ్లీచింగ్ చల్లేలా చర్యలు చేపట్టాలన్నారు. అనంతరం ఉన్నత పాఠశాలలో నిర్వహిస్తున్న రాష్ట్ర స్థాయి కబడ్డీ పోటీలకు ప్రత్యేక ఏర్పాట్లు చేయాలని అధికారులకు సూచించారు. మూడు రోజులపాటు స్కూలు, వసతి, ప్రాంగణాన్ని శుభ్రం చేయాలన్నారు. చెత్త సేకరణతో పాటు బ్లీచింగ్, దోమల మందు పిచికారీ చేయాలని చెప్పారు. కార్యక్రమంలో డీఎల్పీఓ సుధీర్‌కుమార్, తహసీల్దార్ గోపాలకృష్ణ, ఎంపీఓ వెంకటేశ్వరరావు, ఎంఈఓ నాగయ్య, పీడీ వీరన్న పాల్గొన్నారు.
డీఎంహెచ్‌ఓగా
రాథోడ్ తుకారామ్
చుంచుపల్లి: జిల్లా వైద్యారోగ్య శాఖ అధికారిగా నిజామాబాద్‌లో మలేరియా ప్రోగ్రామ్ అధికారిగా పని చేస్తున్న రాథోడ్ తుకారామ్ రానున్నారు. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది. ప్రస్తుతం ఇక్కడ డీఎంహెచ్‌ఓగా బాధ్యతలు నిర్వర్తిస్తున్న డాక్టర్ ఎస్.జయలక్ష్మి డిప్యూటీ డీఎంహెచ్‌ఓగా తన పాత స్థానంలో కొనసాగనున్నారు.
వయోజనులను
అక్షరాస్యులుగా తీర్చిదిద్దాలి
ఇల్లెందురూరల్: వయోజనులందరినీ అక్షరాస్యులుగా తీర్చిదిద్దాలని పొదుపు సంఘాల మహిళలకు వయోజన విద్య ఉమ్మడి జిల్లా డీడీ అనిల్ సూచించారు. స్థానిక మండల పరిషత్ కార్యాలయంలో గ్రామ సమాఖ్యల పదాధికారులతో మంగళవారం నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. గ్రామాల్లో అక్షరజ్ఞానం లేని మహిళలను ఇప్పటికే గుర్తించామని, వారికి అక్షరజ్ఞానం కల్పించేలా పొదుపు సంఘాల సభ్యులు సహకరించాలని కోరారు. సంఘాల్లో లావాదేవీల నిర్వహణ, ప్రభుత్వ సంక్షేమ పథకాలపై అవగాహన పెంచుకునేలా చైతన్యం చేయాలన్నారు. సమావేశంలో ఏపీఎం రామకృష్ణ, సీఆర్పీలు నాగేంద్ర, దేవేంద్రమ్మ, అకౌంటెంట్ నందకుమారి తదితరులు పాల్గొన్నారు.
నేత్రపర్వంగా రామయ్య నిత్యకల్యాణం
నేత్రపర్వంగా రామయ్య నిత్యకల్యాణం


