సీసీఐ.. మరో మెలిక
ఎకరాకు 7 క్వింటాళ్ల పత్తి మాత్రమే కొనుగోలు
గతేడాది 13 క్వింటాళ్ల వరకు అనుమతి
పరిమితి తగ్గించడంతో రైతుల్లో ఆందోళన
బూర్గంపాడు: పత్తి కొనుగోళ్లకు సీసీఐ మరో మెలిక పెట్టింది. ఈ ఏడాది పత్తి అమ్మే రైతులు కపాస్ కిసాన్ యాప్‌లో ముందుగా రిజిస్ట్రేషన్ చేసుకోవాలని ఇటీవల నిబంధన విధించగా.. తాజాగా మరో కొర్రీ విధించింది. ఎకరాకు గరిష్టంగా ఏడు క్వింటాళ్ల పత్తి మాత్రమే సీసీఐ కొనుగోలు చేస్తుందని ప్రకటించింది. దీంతో రైతులు సందిగ్ధంలో పడ్డారు. రైతులకు మద్దతు ధర దక్కేందుకు కేంద్రం సీసీఐని రంగంలోకి దింపితే, ఆ సంస్థ మాత్రం నిబంధనలతో రైతులను ఇబ్బందులు పెడుతోంది.
అధిక వర్షాలతో ఇప్పటికే నష్టం..
జిల్లాలో ఈ ఏడాది సుమారు 2.25 లక్షల ఎకరాల్లో రైతులు పత్తి సాగు చేశారు. నాలుగు నెలలుగా కురుస్తున్న అధిక వర్షాలతో పంట దిగుబడిపై తీవ్ర ప్రభావం పడింది. వానలతో పత్తి చేలు ఎర్రబడటం, పూత,కాత రాలిపోవడం, కాయలు వర్షానికి నల్లబడి పత్తి దెబ్బతినడం వంటివి రైతులను కుంగదీశాయి. ఇక వర్షాల కారణంగా పత్తితీతలు ఆలస్యమయ్యాయి. ప్రస్తుతం తీస్తున్న పత్తిని అమ్ముకునేందుకు రైతులు తీవ్రంగా ఇబ్బంది పడుతున్నారు. సీసీఐ కొనుగోలు కేంద్రాలు నామమాత్రంగా ప్రారంభించినా.. కొనుగోళ్లు మొదలే కాలేదు. పత్తిలో తేమశాతం ఎక్కువగా ఉందని, నాణ్యత సరిగా లేదని సీసీఐ బయ్యర్లు కొనుగోలు చేయడం లేదు. దీంతో రైతులు తమ అవసరాలకు తక్కువ ధరకు ప్రైవేటు వ్యాపారులకు అమ్ముకుంటున్నారు. కేంద్ర ప్రభుత్వం పత్తి క్వింటాకు రూ.8,110 మద్దతు ధర ప్రకటించగా, ప్రైవేటు వ్యాపారులు రూ.4 వేల నుంచి రూ. 5 వేల వరకే కొనుగోలు చేస్తున్నారు.
యాప్‌తో రైతులకు యాతన..
సీసీఐ కొనుగోలు కేంద్రాల్లో పత్తి విక్రయించాలంటే రైతులు తమ ఆండ్రాయిడ్ ఫోన్‌లో కపాస్ కిసాన్ యాప్ ఇన్‌స్టాల్ చేసుకోవాలి. భూమి వివరాలు, పేరు, ఫోన్ నంబర్‌తో ఈ యాప్‌లో రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. పత్తి అమ్మేటప్పుడు ఈ యాప్‌లోనే సీసీఐకి సమాచారం ఇవ్వాలి. ఏ సెంటర్‌లో, ఏరోజు విక్రయించుకోవాలో నిర్ణయించుకుని అందుకు అనుగుణంగా స్లాట్ బుక్ చేసుకోవాలి. అదే రోజున సీసీఐ సూచించిన సమయానికి పత్తి తీసుకురావాలి. ఈ ప్రక్రియ అంతా సాంకేతికంగా ఇబ్బంది అవుతోందని చాలామంది రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కొందరు రైతులు తమకు ఆండ్రాయిడ్ ఫోన్‌లు లేవని, తాము చదువుకోలేదని, ఈ నిబంధన ఎత్తివేయాలని కోరుతున్నారు. జిన్నింగ్ మిల్లుల నిర్వాహకులు సైతం ఈ నిబంధనను తొలగించాలని సీసీఐని కోరినా.. అధికారులు మాత్రం వెనక్కు తగ్గలేదు.
కొనుగోళ్లలోనూ ఆంక్షలు..
గతేడాది ఎకరాకు 13 క్వింటాళ్ల పత్తిని సీసీఐలో విక్రయించేందుకు అనుమతి ఉండేది. కానీ ఈ ఏడాది పత్తి కొనుగోళ్లు ప్రారంభం కాకముందే ఎకరాకు 7 క్వింటాళ్ల పత్తిని మాత్రమే కొనుగోలు చేస్తామని పరిమితి విధించింది. అయితే అంతకు మించి పండిన ఎలా విక్రయించాలని రైతులు ప్రశ్నిస్తున్నారు. కపాస్ కిసాన్ యాప్‌లో రిజిస్ట్రేషన్ చేసుకున్న సమయంలో ఎకరాకు 13 క్వింటాళ్ల వరకు అనుమతి ఉందని, సీసీఐ మాత్రం ఏడు క్వింటాళ్లకు తగ్గించడం ఏంటని రైతులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఈ పరిమితిని ఎత్తివేసి గతంలో మాదిరిగా ఎకరాకు 13 క్వింటాళ్ల పత్తిని కొనుగోలు చేసేలా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నిర్ణయం తీసుకోవాలని కోరుతున్నారు.


