
బోరు పూడ్చివేతపై ఆగ్రహం
చర్ల: చర్ల మండలంలోని పులిగుండాలలో పోడు సాగుదారులు వేసిన బోరును దుమ్ముగూడెం అటవీ రేంజ్ అధికారులు పూడ్చివేయగా.. వారి వైఖరిని నిరసిస్తూ రాళ్లగూడెంలో సోమవారం గిరిజన రైతులు ధర్నా చేశారు. ప్రధాన రహదారిపై రెండు గంటల పాటు బైఠాయించడంతో భారీగా ట్రాఫిక్ నిలి చిపోగా ప్రయాణికులు ఇబ్బందులకు గురయ్యారు. విషయం తెలుసుకున్న రాష్ట్ర అటవీ అభివృద్ది సంస్థ చైర్మన్ పొదెం వీరయ్య చేరుకొని రైతులతో మాట్లాడారు. డీఎఫ్‌ఓతో ఫోన్‌లో మాట్లాడి ఘటనపై వెంటనే విచారణ నిర్వహించాలని, బాధ్యులైన వారిపై చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. బోరు పూడ్చివేసిన ఘటనపై కేసు నమోదు చేయాలని స్థానిక పోలీసులకు సూచించారు. బాధ్యులపై చర్యలు తీసుకుంటామని, బాధిత రైతులకు న్యాయం చేస్తామని ఆయన హామీ ఇవ్వడంతో రైతులు ఆందోళన విరమించారు. కార్యక్రమంలో పులిగుండాల మాజీ సర్పంచ్, కాంగ్రెస్ పార్టీ ఎస్టీ సెల్ జిల్లా అధ్యక్షుడు సోడి చలపతిరావు తదితరులు పాల్గొన్నారు.