కొత్తగూడెంవాసికి సేవారత్న పురస్కారం
కొత్తగూడెంఅర్బన్: సంక్రాంతి సంబరాల సాహిత్య సాంస్కృతిక కార్యక్రమాల సందర్భంగా భద్రాచలంలో తెలుగు కళారత్నాలు, ఉషోదయ ఫౌండేషన్ ఆధ్వర్యంలో జరిగిన పురస్కారంలో కొత్తగూడేనికి చెందిన ప్రముఖ కవి రాజేష్‌కు విశిష్ట సాహిత్య సేవారత్న పురస్కారం లభించింది. దీన్ని ప్రముఖ సాహితీవేత్త, తాళ్లూరి చారిటబుల్ ట్రస్ట్ అధ్యక్షుడు తాళ్లూరి పంచాక్షరయ్య, విద్యావేత్త సిద్దులు చేతుల మీదుగా అందుకున్నట్లు ఆదివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఈమేరకు నిర్వాహకులకు రాజేష్ కృతజ్ఞతలు తెలిపారు.
మంత్రి తుమ్మలను కలిసిన ఖమ్మం డీసీసీ అధ్యక్షుడు
దమ్మపేట: రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావును కాంగ్రెస్ ఖమ్మం జిల్లా అధ్యక్షుడు నూతి సత్యనారాయణ ఆదివారం మర్యాదపూర్వకంగా కలిసి, శాలువాతో సత్కరించారు. మండలంలోని గండుగులపల్లిలో ఉన్న మంత్రి స్వగృహంలో కలిశారు. ఈ సందర్భంగా తుమ్మల మాట్లాడుతూ త్వరలో జరగనున్న మున్సిపల్ ఎన్నికల్లో ఖమ్మం జిల్లా పరిధిలోని అన్ని స్థానాల్లోను కాంగ్రెస్ పార్టీ గెలిచేలా ప్రణాళికలు రూపొందించాలని, నాయకులు, కార్యకర్తలను సమన్వయం చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో నాయకులు రంగా జనార్ధన్ రావు, మురళీకృష్ణ, ముళ్లపాటి సీతారాములు తదితరులు పాల్గొన్నారు.
నేడు గిరిజన దర్బార్
భద్రాచలంటౌన్: భద్రాచలం ఐటీడీఏ కార్యాలయంలో సోమవారం నిర్వహించనున్న గిరిజన దర్బార్ కార్యక్రమానికి అన్ని శాఖల అధికారులు సకాలంలో హాజరుకావాలని ఐటీడీఏ పీఓ బి.రాహుల్ ఆదివారం ఒక ప్రకటనలో ఆదేశించారు. ఉదయం 10.30 గంటలకు ప్రారంభమయ్యే గిరిజన దర్బార్‌లో ఆదివాసీ గిరిజనులు తమ సమస్యలకు సంబంధించిన అంశాలపై లిఖితపూర్వకంగా ఫిర్యాదు అందజేయాలని పేర్కొన్నారు.
చలిమంటలో పడి మహిళ మృతి
గుండాల: చలి తీవ్రతను తట్టుకోలేక ఓ మహిళ నెగడి వద్ద చలికాగుతూ ప్రమాదవశాత్తు ఆ మంటలో పడి మృతి చెందింది. ఆదివారం మండలంలో చోటు చేసుకున్న ఈ సంఘటన వివరాలను ఆళ్లపల్లి ఎస్సై సోమేశ్వర్ ఇలా తెలిపారు. మండలంలోని బాటన్ననగర్(ఆళ్లపల్లి పోలీస్ స్టేషన్ పరిధి)కు చెందిన మాడే పిర్యా(30) శనివారం ఉదయం గేదెలు, మేకలను మేతకు తీసుకెళ్లి సాయంత్రం తిరిగి ఇంటికి వచ్చింది. ఈక్రమంలో రాత్రి 9 గంటలకు చలి తీవ్రతను తట్టుకోలేక చలిమంట(నెగడి) వేసుకుని పడుకుంది. ఈక్రమాన అర్ధరాత్రి 12 గంటల సమయంలో నిద్రమత్తులో ఉండగా.. ప్రమాదవశాత్తు మంటలో పడిపోయింది. దీంతో ఒక్కసారిగా కేకలు వేయడంతో ఇంట్లో ఉన్న తన కుమారుడు లేచి హుటాహుటిన వెంటనే 108కు సమాచారం అందించాడు. ఆతర్వాత ఖమ్మం ప్రభుత్వాస్పత్రికి తరలిచి చికిత్స అందిస్తుండగా.. ఆదివారం తెల్లవారుజామున మృతి చెందింది. ఈమేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు.
ట్రాక్టర్ బోల్తా పడి
యువకుడు..
చర్ల: పొలంలో దమ్ము చేసి తిరిగి వస్తుండగా.. ప్రమాదవశాత్తు ట్రాక్టర్ బోల్తా పడి ఓ యువకుడు మృతి చెందాడు. వివరాలిలా.. మండలంలోని ఆర్‌కొత్తగూడెం గ్రామ పంచాయతీ దానవాయిపేటకు చెందిన సోయం సాయి(29)ఆదివారం గ్రామంలోని వరి పొలంలో దమ్ము చేసేందుకు ట్రాక్టర్ నడుపుకుంటూ వెళ్లాడు. దమ్ము చేసి రాత్రి ఇంటికి తిరిగి వస్తుండగా.. ఆ చక్రాలు పొలంలో ఉన్న గట్టు ఎక్కి దిగుతుండగా ఒక్కసారిగా బోల్తాపడింది. దీంతో సాయిపై ట్రాక్టర్ పడి అక్కడిక్కడే మృతి చెందగా.. యువకుడి బంధువులు, కుటుంబీకులు, స్నేహితులు గుండెలవిసేలా రోదించారు. దీంతో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.
కొత్తగూడెంవాసికి సేవారత్న పురస్కారం
కొత్తగూడెంవాసికి సేవారత్న పురస్కారం
కొత్తగూడెంవాసికి సేవారత్న పురస్కారం


