ఈజీ మనీ పేరుతో మోసం
కారేపల్లి: ఈజీగా మనీ సంపాదించటంఎలా..? ఏటీఎం (ఎనీటైంమనీ) పేరుతో ఆన్‌లైన్‌లో 3 నెలల కోర్సు నేర్పిస్తా మని నమ్మబలికి, కోర్సు కోసం ఫీజు వసూలు చేసి తర్వాత తప్పించుకు తిరుగుతున్న ఓ యూట్యూబర్‌పై చర్యలు తీసుకోవాలని ఏపీ లోని పశ్చిమ గోదావరి జిల్లా భీమవరానికి చెందిన 9 మంది యువకులు ఆదివారం కారేపల్లి పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. అనంతరం కారేపల్లిలో నివాసం ఉంటున్న సదరు యూట్యూబర్ ఇంటి ఎదుట ఫ్లెక్సీ ఏర్పాటు చేసి, ఆందోళనకు దిగారు. ‘బిగ్గెస్ట్ స్కామర్ ఇన్ తెలంగాణ స్టేట్.. బానోత్ సాయినాథ్’అని ఫ్లెక్సీలో రాశారు. సమాచారం అందుకున్న కారేపల్లి పోలీసులు ఆందోళనకారులకు సర్దిజెప్పారు. ఎస్‌ఐ బి.గోపిని వివరణ కోరగా.. ఆంధ్ర నుంచి 9 మంది యువకులు పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేయలేదని, యూట్యూ బర్ వద్ద నుంచి తమ డబ్బులు ఇప్పిస్తేచాలని తెలిపారని చెప్పారు. బాధితులను ఆంధ్రలోని తమ పరిధిలో ఉన్న పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసుకోవాలని సూచించానని పేర్కొన్నారు.


