సైబర్‌ నేరాలపై ఈడీ నజర్‌! | - | Sakshi
Sakshi News home page

సైబర్‌ నేరాలపై ఈడీ నజర్‌!

Jan 12 2026 7:26 AM | Updated on Jan 12 2026 7:26 AM

సైబర్‌ నేరాలపై ఈడీ నజర్‌!

సైబర్‌ నేరాలపై ఈడీ నజర్‌!

● తవ్వేకొద్దీ రూ.వందల కోట్లలో బయటపడుతున్న లావాదేవీలు ● ‘సాక్షి’ వరుస కథనాలతో వెలుగులోకి

● తవ్వేకొద్దీ రూ.వందల కోట్లలో బయటపడుతున్న లావాదేవీలు ● ‘సాక్షి’ వరుస కథనాలతో వెలుగులోకి

సత్తుపల్లి: అంతర్జాతీయ స్థాయిలో హవాలా రూపంలో సైబర్‌ ఆర్థిక నేరాలు విస్తరించడంతో ఈడీ దృష్టి సారించే అవకాశం ఉంది. రూ.547 కోట్ల అక్రమ లావాదేవీలు జరిగినట్లు పోలీసుల విచారణలో వెల్లడి కావడం, హవాలా రూపంలో డబ్బు చేతులు మారడంతో కేంద్ర విచారణ సంస్థలైన ఈడీ, ఐటీలకు సమాచారం అందించనున్నట్లు సీపీ సునీల్‌దత్‌ వెల్లడించడంతో అక్రమార్కుల వెన్నులో వణుకు పుట్టినట్టయింది. సైబర్‌ మోసాలపై ‘సాక్షి’ పలు కథనాలు ప్రచురించిన విషయం తెలిసిందే. కాగా, ప్రధాన నిందితులైన పోట్రు మనోజ్‌కల్యాణ్‌, ఉడతనేని వికాస్‌చౌదరి, మోరంపూడి చెన్నకేశవరావు పరా రీలో ఉన్నా ఎంతో కాలం తప్పించుకోలేరని పోలీసులు ప్రకటించడంతో కేసులో ఒక్కొక్కరి చిక్కుముడి వీడుతున్నట్టయింది. నిందితుల బంధువులు, స్నేహితుల అకౌంట్లను పరిశీలి స్తుంటే బయటపడుతున్న నిజాలు పోలీస్‌ శాఖ ను విస్మయపరిచాయి. రూ.వందల కోట్ల లావా దేవీలు జరగడం, ఇందులో మహిళలను కూడా గుర్తించడం సంచలనంగా మారింది. పోట్రు మనోజ్‌కల్యాణ్‌ ఖాతాలో రూ.114.18 కోట్లు, ఆయన సతీమణి మేడా భానుప్రియ ఖాతాలో రూ.40.21 కోట్లు, బావమరిది మేడా సతీష్‌ ఖాతాలో రూ.135.48 కోట్లు, బొమ్మిడాల నాగలక్ష్మి ఖాతాలో రూ.81.72 కోట్లు, నర్సింహాకృష్ణ ఖాతాలో రూ.92.54 కోట్లు, ఉడతనేని వికాస్‌ చౌదరి ఖాతాలో రూ.80.41 కోట్లు.. మొత్తం రూ.547 కోట్ల సైబర్‌ క్రైం లావాదేవీలు జరిపినట్లు విచారణలో తేలిందని సీపీ వెల్లడించారు.

పోట్రు ప్రవీణ్‌ వ్యవహారంతో..

కల్లూరు మండలం ఎర్రబోయినపల్లికి చెందిన పోట్రు ప్రవీణ్‌ ముఠా ఆస్ట్రేలియా పౌరులను టార్గెట్‌ చేస్తూ రూ.10కోట్లు కొల్లగొట్టినట్లు గత నవంబర్‌ 29న స్పెషల్‌ ఆపరేషన్‌ టీమ్‌(ఎస్‌ఓటీ) బెంగుళూరు, సైబర్‌క్రైం సైబరాబాద్‌ పోలీసులు కేసులు నమోదు చేయడంతో అతి పెద్ద మోసం వెలుగుచూసింది. హైదరాబాద్‌ కేంద్రంగా రిడ్జ్‌ ఐటీ సొల్యూషన్స్‌ పేరుతో కాల్‌ సెంటర్‌ ఏర్పాటు చేసి ఆస్ట్రేలియా పౌరుల బ్యాంక్‌ ఖాతాలను కొల్లగొట్టి పోట్రు ప్రవీణ్‌తో పాటు పోట్రు ప్రకాష్‌, ఏపూరి గణేష్‌, మోరంపూడి చెన్నకేశవ సైబర్‌ నేరానికి పాల్పడ్డారని పోలీసులు కేసు నమోదు చేశారు.

డిసెంబర్‌ 24న మరో కేసులో..

గతేడాది డిసెంబర్‌ 24న సత్తుపల్లి మండలం తుంబూరు గ్రామానికి చెందిన మోదుగు సాయికిరణ్‌ వీఎం బంజరు పోలీస్‌స్టేషన్‌లో చేసిన ఫిర్యాదు మేరకు మరో కేసులో ఇంకొందరి పేర్లు తెరపైకి రావడం చర్చనీయాంశమైంది. పోట్రు ప్రవీణ్‌తో పాటు మనోజ్‌కల్యాణ్‌, ఆయన భార్య మేడా భానుప్రియ, మేడా సతీష్‌, ఉడతనేని వికాస్‌, మోరంపూడి చెన్నకేశవరావు ప్రధాన నిందితులుగా పేర్కొన్నారు. వారికి సహకరించిన జుంజునూరి శివకృష్ణ, వడ్లముడి నరేంద్రకుమార్‌, మల్లాడి శివ, సాధు పవన్‌, సాధు సంధ్య, సాధు శ్రీలేఖతో పాటు బ్యాంక్‌ అకౌంట్లు ఇచ్చి సహకరించిన జొన్నలగడ్డ తిరుమలసాయి, కందుకూరి మణికంఠ, తన్నీరు మహేష్‌, గోళ్లముడి నాగముకేష్‌, కంచపోగు శ్రీనివాస్‌, రాయల అజయ్‌కుమార్‌, రాయల గోపి, పాల గణేష్‌, రాయల గోపీచంద్‌, కందుకూరు జగదీష్‌, తాటికొండ రాజు(కరీంనగర్‌)ను అరెస్ట్‌ చేసినట్లు సీపీ తెలిపారు.

పెట్టుబడి ఆశ చూపించి..

సైబర్‌ నేరగాళ్లు అకౌంట్లలోని డబ్బులను కొల్లగొట్టేందుకు అనేక మార్గాల్లో మోసాలకు పాల్పడినట్లు పోలీసుల విచారణలో తేలింది. అంతర్జాతీయ సైబర్‌ నేరస్తులతో జతకట్టి విదేశాల్లో కాల్‌ సెంటర్లు నిర్వహిస్తూ దేశంలోని పౌరులను బురిడీ కొట్టించేందుకు పెట్టుబడి, మ్యాట్రిమొని, రివార్డు పాయింట్లు, గేమింగ్‌, బెట్టింగ్‌, షేర్‌మార్కెట్‌ పెట్టుబడులు, క్రిప్టోకరెన్సీ పేరుతో మోసగించి లింకుల ద్వారా వారి ఖాతాలను ఖాళీ చేస్తున్నట్లు వెల్లడైంది. కాగా, ఆస్తులను కొనుగోలు చేసిన వారిని గుర్తించి జప్తు చేస్తామని సీపీ వెల్లడించడంతో అక్రమార్కుల్లో టెన్షన్‌ మొదలైంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement