జింక పిల్ల స్వాధీనం
దమ్మపేట: అడవిలో దారి తప్పి, మేకల గుంపులోకి చేరిన మచ్చల జింక పిల్లను ఫారెస్టు అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఫారెస్ట్ రేంజర్ కరుణాకరచారి కథనం ప్రకారం.. శుక్రవారం మండలంలోని పెద్దగొల్లగూడెం గ్రామానికి చెందిన కొందరు వ్యక్తులు తమ మేకలను మేత కోసం గ్రామ శివారుకు తోలుకుని వెళ్లారు. ఈ క్రమంలో మచ్చల జింక పిల్ల తమ గొర్రెల గుంపులో కలవడం గమనించారు. ఈ విషయాన్ని ఫారెస్ట్ అధికారులకు తెలపగా.. రేంజర్, సిబ్బందితో కలసి ఘటనా స్థలానికి చేరుకుని జింక పిల్లను స్వాధీనం చేసుకుని, రేంజర్ కార్యాలయానికి తరలించారు. అనంతరం ఆ జింక పిల్లను కిన్నెరసాని అభయారణ్యానికి సురక్షితంగా తరలించామని రేంజర్ తెలిపారు. కార్యక్రమంలో ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్ కోటేశ్వరరావు, బీట్ ఆఫీసర్ రామారావు తదితరులు పాల్గొన్నారు.
కత్తితో ఇద్దరిపై దాడి
చర్ల: మండలంలోని పూసుగుప్పకు చెందిన ఓ వ్యక్తి ఆటో నడుపుతూ మద్యం మత్తులో ద్విచక్రవాహనం మీదకు పోనిచ్చాడు. ఆటోను ఇలా నడపటమేంటని ప్రశ్నించడంతో మద్యం మత్తులో ఉన్న ఆ వ్యక్తి ప్రశ్నించిన ఇద్దరిపై కత్తితో దాడి చేశాడు. ఈ ఘటన గురువారం రాత్రి చోటుచేసుకుంది. క్షతగాత్రుల కథనం ప్రకారం.. పూసుగుప్పకు చెందిన పండా కృష్ణమూర్తి గురువారం రాత్రి మద్యం సేవించి, ఆటో నడుపుతూ అదే గ్రామానికి చెందిన తాటి భూపతి, సోడే వినోద్‌పైకి పోనిచ్చాడు. తర్వాత వారిద్దరు పూసుగుప్పకు వెళ్లి ఓ షాపు వద్ద కూల్ డ్రింక్స్ తాగుతుండగా అక్కడ ఉన్న పండా కృష్ణమూర్తిని ప్రశ్నించారు. అప్పటికే మద్యం మత్తులో ఉన్న కృష్ణమూర్తి కత్తితో వీరిద్దరిపై దాడి చేశాడు. గాయపడిన ఇద్దరినీ స్థానికులు చర్ల ప్రభుత్వ వైద్యశాలకు తీసుకురాగా ప్రథమ చికిత్స అనంతరం 108లో భద్రాచలం ఏరియా వైద్యశాలకు తరలించారు. కాగా, కత్తితో దాడి చేసిన పండా కృష్ణమూర్తిని స్థానికులు పట్టుకునే ప్రయత్నం చేయగా పారిపోయాడు. ఈ ఘటనపై ఎలాంటి ఫిర్యాదు అందలేదని చర్ల పోలీసులు తెలిపారు.
జింక పిల్ల స్వాధీనం


