మెరుగైన వైద్యం అందించాలి
● విధి నిర్వహణలో నిర్లక్ష్యం వహించొద్దు ● ఐటీడీఏ పీఓ రాహుల్
మణుగూరు రూరల్/అశ్వాపురం : ఏజెన్సీ ప్రాంతమైన మణుగూరు సబ్ డివిజన్ ప్రజలకు మెరుగైన వైద్యం అందించాలని ఐటీడీఏ పీఓ బి.రాహుల్ వైద్య సిబ్బందికి సూచించారు. మణుగూరు ప్రభుత్వ ఏరియా ఆస్పత్రిని, అశ్వాపురం పీహెచ్‌సీని బుధవారం ఆయన తనిఖీ చేశారు. పేషెంట్లకు అందుతున్న వైద్యసేవలు, సిబ్బంది పని తీరు, భోజన సౌకర్యంపై సూపరింటెండెంట్ డాక్టర్ సునీల్‌ను అడిగి తెలుసుకున్నారు. వైద్యసేవలు సక్రమంగా అందుతున్నాయా, భోజనం ఎలా ఉంది అని పేషెంట్లను అడిగి తెలుసుకున్నారు. అనంతరం వైద్యులతో మాట్లాడుతూ.. ఆస్పత్రికి వచ్చే వారిని ఆప్యాయంగా పలకరించాలని, మెరుగైన వైద్యసేవలు అందించాలని సూచించారు. వ్యాఽధితో వచ్చిన వారు పూర్తిగా కోలుకునే వరకు ఎలాంటి లోటుపాట్లకు తావివ్వకుండా ఉత్తమ సేవలు అందించాలన్నారు. సకాలంలో విధులకు హాజరుకావాలని, నిర్లక్ష్యం వహించే వారిపై చర్య తప్పదని హెచ్చరించారు. ఆస్పత్రి పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని సూచించారు. గర్భిణుల పట్ల ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలని, అన్ని రకాల మందులతో పాటు వేసవికాలం దృష్ట్యా ఓఆర్‌ఎస్ ప్యాకెట్లు అందుబాటులో ఉంచుకోవాలని సూచించారు. అనంతరం అశ్వాపురం తహసీల్దార్, మండల పరిషత్ కార్యాలయాలను తనిఖీ చేశారు. కొత్త ఓటరు నమోదు, చేర్పులు, మార్పుల దరఖాస్తులు పెండింగ్‌లో ఉండగా వెంటనే పరిష్కరించాలని సూచించారు. ఎంపీడీఓ కార్యాలయంలో రాజీవ్ యువవికాసం దరఖాస్తులను పరిశీలించారు. ఈనెల 14వరకు గడువు ఉన్నందన ఎక్కువ మంది నిరుద్యోగులు దరఖాస్తు చేసుకునేలా ప్రచారం కల్పించాలని సూచించారు. తహసీల్దార్ కార్యాలయంలో సిబ్బంది కొరత ఉందని పీఓ దృష్టికి తేగా.. సమస్య పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. ఆయా కార్యక్రమాల్లో మణుగూరు ఆస్పత్రి ఆర్‌ఎంఓ డాక్టర్ గౌరీప్రసాద్, అశ్వాపురం, మణుగూరు తహసీల్దార్లు స్వర్ణలత, రాఘవరెడ్డి, మణుగూరు ఎంపీడీఓ టి.శ్రీనివాసరావు, ఏడీఎంహెచ్‌ఓ చైతన్య, యూడీసీ పద్మావతి తదితరులు పాల్గొన్నారు.


