ఎక్కడి చెత్త అక్కడే..
భద్రాచలంటౌన్: భద్రాచలం శ్రీసీతారామచంద్ర స్వామివారి దేవస్థానంలో శ్రీరామనవమి వేడుకలు వైభవంగా జరిగాయి. భక్తులు అధిక సంఖ్యలో రావడంలో రెండు రోజుల పాటు పారిశుద్ధ్య పనులకు ఆటంకం కలిగింది. దీంతో దేవస్థానం చుట్టూ ఎక్కడి చెత్త అక్కడే పేరుకుపోయింది. అపరిశుభ్రత తాండవిస్తోంది. క్యూలైన్లు, పురవీధుల్లో చెత్తాచెదారం కుప్పలుగా పడి ఉంది. దీంతో ఆలయానికి వచ్చే భక్తులు దుర్గంధం భరించలేకపోతున్నారు. భక్తులకు అందజేసేందుకు ఏర్పాటు చేసిన వాటర్ ప్యాకెట్ల బస్తాలను అలాగే వదిలేయడంతో చెల్లాచెదురుగా పడి ఉన్నాయి. వీధుల్లో చెత్త వేయడానికి తాత్కాలికంగా ఏర్పాటు చేసిన డ్రమ్ములను తరలించకపోవడంతో అందులో నుంచి దుర్వాసన వెదజల్లుతోంది. కరకట్టపైన, చెట్ల కింద చెత్త అలాగే పేరుకుపోయింది.


