పోటెత్తిన భక్తులు.. వెంటాడిన అసౌకర్యాలు
● తెలంగాణతోపాటు పొరుగు రాష్ట్రాల నుంచి తరలివచ్చిన భక్తులు ● భద్రాచలంలో ఎప్పటిలాగే సామాన్య భక్తులకు తప్పనిపాట్లు ● కౌంటర్ల సమాచారం లేక తలంబ్రాల కోసం అవస్థలు ● మూడుసార్లు ట్రాఫిక్ నిలిపివేతతో ఎండలో అల్లాడిపోయారు.. ● షామియానాలు లేక చెట్ల కిందనే సేదదీరాల్సిన పరిస్థితి ● కరకట్ట సమీపంలో తాగునీరు దొరకలేదని పలువురి ఆవేదన ● కల్యాణానికి గతంకంటే భక్తులు పెరగగా..ఆ స్థాయిలోలేని వసతులు
తాగునీరు దొరకలేదు
30 ఏళ్లుగా కల్యాణానికి వస్తున్నాం. ప్రతీసారి మా గ్రామం నుంచి సుమారు 50 కుటుంబాల వారం ఏలూరు నుంచి భద్రాచలానికి మూడు రోజులపాటు కాలినడకన చేరుకుని ఇక్కడ కల్యాణం, పట్టాభిషేకం చూసి తిరిగి వెళ్తాం. ఈ సారి కూడా వచ్చాం. కానీ వంటా వార్పు చేసుకునేందుకు కరకట్ట ప్రాంతంలో తాగునీరు దొరకలేదు. – పెద్దింటి రమ, కై కలూరు
చెట్ల కిందే సేదదీరాం..
రెండు రోజులపాటు ఇక్కడే ఉండి రామయ్య కల్యాణం, పట్టాభిషేకం చూడాలని 20 కుటుంబాల వారం ట్రాలీ తీసుకుని వచ్చాం. తలదాచుకునేందుకు రామాలయ ప్రాంతంలో షామియానాలు కూడా ఏర్పాటు చేయలేదు. దీంతో కరకట్ట కింద రోడ్డుకు ఇరువైపులా చెట్ల కిందనే సేదదీరాం.
– రాము, ఆకివీడు
ఎల్‌ఈడీ స్క్రీన్లు లేవు..
కల్యాణాన్ని తిలకించేందుకు మిథిలా స్టేడియంలో మాత్రమే ఎల్‌ఈడీ స్క్రీన్లు ఏర్పాటు చేశా రు. రాజమండ్రి నుంచి వచ్చిన మాకు మిథిలా స్టేడియంలోకి వెళ్లే అవకాశం దొరకలేదు. స్టేడియం బయట కూడా ఎల్‌ఈడీ స్క్రీన్లు ఏర్పాటు చేస్తే బాగుండేది. కల్యాణాన్ని తంతును మైకులో మాత్రమే వినాల్సి వచ్చింది. ప్రత్యక్షంగా చూడలేక పోయాం. – ఈశ్వర్‌రావు, రాజమండ్రి
దర్శనం కష్టంగా మారింది...
వ్యయ ప్రయాసలకోర్చి రామ య్య కల్యాణానికి వస్తే.. స్వా మివారిని దర్శించుకోవడం కష్టతరంగా మారింది. క్యూలై న్లు లేకపోవడంతో భక్తుల మధ్య తోపులాట జరిగింది. మహిళలు, పిల్లలు, వృద్ధులను వెనుకకు నెట్టివేశారు. క్యూ లైన్‌లు ఏర్పాటు చేస్తే రామయ్య దర్శనంగా సులువుగా జరిగిదే. – దుర్గా, పోతులూరు
ఇరవై ఏళ్లుగా వస్తున్నా...
రామయ కల్యాణం కనులారా వీక్షించేందుకు 20 ఏళ్లుగా భద్రాచలం వస్తున్నాను. ఎండలు మస్తుగా ఉన్నాయి. టీవీలో వస్తాది కల్యాణం చూడు నాన్న అని నా బిడ్డలు చెప్పినా.. వినకుండా నా భార్య, నేను వచ్చాం. టీవీలో కంటే రామయ్య కల్యాణం దగ్గరుండి చూస్తేనే మనస్సు నెమ్మదిస్తుంది.
– కేశవరావు, నల్లగొండ
ఏర్పాట్లు బాగున్నాయి..
రామయ్య కల్యాణం చూసేందుకు వచ్చే భక్తుల కోసం అధికారులు చేసిన ఏర్పాట్లు చాలా బాగున్నాయి. ఐదేళ్లుగా భద్రాచలం రామయ్య కల్యాణం చూసేందుకు వస్తున్నాను. ఆలయ అధికారులు గతంలో కంటే మెరుగైన ఏర్పాట్లు చేశారు. చలువ పందిళ్లు ఇంకా ఎక్కువ వేస్తే బాగుండేది.
– నాగేశ్వరరావు, జంగారెడ్డిగూడెం, ఏపీ
తలంబ్రాల కోసం ఇబ్బంది..
కల్యాణం అనంతరం ఒక్కసారిగా జనం స్టేడియం నుంచి బయటకు రావడంతో తలంబ్రాల ఎక్కడ దొరుకుతాయే తెలియక ఇబ్బంది పడ్డాం. మొదటిసారి రామయ్య కల్యాణం చూసేందుకు భద్రాచలం వచ్చాం. తలంబ్రాల కోసం ప్రచారం తక్కువగా చేస్తుండడంతో భక్తులు ఇబ్బంది పడుతున్నారు.
– వెంకటరమణ, మంగళగిరి, ఏపీ
శ్రీ సీతారామ చంద్రస్వామివారి కల్యాణానికి భక్తులు పోటెత్తారు. రాష్ట్రంలోని వివిధ ప్రాంతాలు, ఆంధ్రప్రదేశ్, ఛత్తీస్‌గఢ్, ఒడిశాతోపాటు పలు రాష్ట్రాల నుంచి భద్రాచలం తరలివచ్చారు. చాలామంది శనివారమే చేరుకోగా, ఆదివారం ఉదయం పవిత్ర గోదావరిలో పుణ్యస్నాణాలు ఆచరించి స్వామివారిని దర్శించుకున్నారు. అనంతరం మిథిలా స్టేడియానికి చేరుకుని కల్యాణం వీక్షించారు. గతేడాది కంటే ఈసారి భక్తులు అధిక సంఖ్యలో వచ్చారు. అయితే భక్తుల సంఖ్య తగినట్లు అధికారులు ఏర్పాట్లు చేయలేదు. తాగునీరు దొరకక ఇబ్బందులు పడ్డారు. షామియానాలు ఏర్పాటు చేయకపోవడంతో కరకట్ట పక్కన చెట్ల కిందనే సేదదీరారు. ఆలయ పరిసరాల్లో ఎల్‌ఈడీ స్క్రీన్లు ఏర్పాటు చేయకపోవడంతో పలువురు కల్యాణం వీక్షించలేకపోయారు. ఇక ఎప్పటిలాగే ట్రాఫిక్ సమస్యలు ఎదుర్కొన్నారు. ప్రతీసారి విమర్శలు ఎదుర్కొంటున్నా పోలీసు శాఖ తీరు ఈ సారి కూడా మారలేదు. బారికేడ్ల వద్ద సామాన్య భక్తులను నిలిపివేసి, తమశాఖ వారిని మాత్రం అనుమతించారని పలువురు ఆరోపించారు.
–భద్రాచలం అర్బన్/భద్రాచలంటౌన్/చర్ల
వీవీఐపీ, వీఐపీలు..
శ్రీరామనవమి వేడుకలకు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు, కొండా సురేఖ, తెలంగాణ హైకోర్డు న్యాయమూర్తి జస్టిస్ నందా, ఏపీ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ కృష్ణమోహన్ తదితరులు హాజరయ్యారు. తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి, మధ్యప్రదేశ్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నరహరి, దేవాదాయ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ శైలజా రామయ్యర్, కమిషనర్ శ్రీధర్, ఇంటెలిజెన్స్ డీజీపీ బత్తుల శివధర్‌రెడ్డి, హైదరాబాద్ ఎండోమెంట్ ట్రిబ్యునల్ జడ్జి వెంకట్, హైదరాబాద్ సిటీ సివిల్ జడ్జి భవాని, ఉమ్మడి ఖమ్మం జిల్లా ప్రధాన న్యాయమూర్తులు రాజగోపాల్, వసంత్‌పాటిల్, కొత్తగూడెం న్యాయమూర్తి భానుమతి, భద్రాచలం న్యాయమూర్తి శివనాయక్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం పార్వతీపురం జిల్లా కలెక్టర్ శ్యాంప్రసాద్, ఎంపీలు పోరిక బలరాం నాయక్, చామల కిరణ్‌కుమార్ రెడ్డి, టీటీడీ చైర్మన్ బీ.ఆర్.నాయుడు, ఎమ్మెల్యేలు తెల్లం వెంకట్రావు, పాయం వెంకటేశ్వర్లు, కోరం కనకయ్య, జారే ఆదినారాయణ, కూనంనేని సాంబశివరావు, మట్టారాగమయి, కార్పొరేషన్ చైర్మన్లు పొదెం వీరయ్య, మువ్వా విజయ్‌బాబు, మాజీ ఎమ్మెల్సీ బాలసాని లక్ష్మీనారాయణ, సినీతారలు కొణిదల నిహారిక, వితిక షేరు వేడుకల్లో పాల్గొన్నారు.
బస్టాండ్‌లోకి రాని ఏపీ బస్సులు
వేడుకలకు ఏపీ నుంచి భక్తులకు అధిక సంఖ్యలో వచ్చారు. అక్కడి నుంచి ప్రత్యేకంగా నడిపిన బస్సులను బస్టాండ్‌లోకి అధికారులు అనుమతించలేదు. ప్రభుత్వ జూనియర్ కళాశాల క్రీడా మైదానంలో నిలిపివేయగా, రామాలయం నుంచి కిలోమీటర్ మేర కాలినడకన వెళ్లాల్సి వచ్చింది. చాలామంది భక్తులకు విషయం తెలియక బస్టాండ్‌కు చేరుకుని ఆందోళన చెందారు. మండుటెండలో నడుస్తూ మైదానానికి చేరుకున్నారు.
25 మంది కుటుంబాలకు అప్పగింత
శ్రీసీతారామ చంద్రస్వామివారి కల్యాణం తిలకించేందుకు వచ్చి 25 మంది వృద్ధులు తప్పిపోయి మిథిలా స్టేడియం వద్ద అధికారులు ఏర్పాటు చేసిన బాలల సంరక్షణ కేంద్రం వద్ద ఉండిపోయారు. దీంతో అధికారుల పలు మార్లు మైక్ ద్వారా ప్రచారం చేసి వారిని కటుంబ సభ్యులకు అప్పగించారు.
కనిపించని తలంబ్రాల కౌంటర్లు
కల్యాణం అనంతరం తలంబ్రాల కోసం భక్తులు కొంత ఇబ్బంది పడ్డారు. వీవీఐపీలు వెళ్తుండటంతో పోలీసుల హడావుడి నడుమ ప్రధాన రహదారికి చేరుకున్న భక్తులు తలంబ్రాల కోసం వెతుక్కోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. 80 కౌంటర్లు ఏర్పాటు చేసినట్లు అధికారులు ప్రకటించినా.. అన్నీ ఆలయ చుట్టుపక్కలే ఉన్నాయి. సరైన సూచికలు లేకపోవడంతో పలువురు గందరగోళానికి గురయ్యారు. ఆర్టీసీ బస్టాండ్ ఆవరణలో రెండు కౌంటర్లు ఉన్నా తోపులాట జరిగింది. ఇక భక్తులను నియంత్రించాలని పోలీసులు బందోబస్తు విధులు మాని తలంబ్రాల కోసం ఎగబడ్డారు. ఒకేట కాకుండా ప్రధాన కేంద్రాల్లో ఇంకా ఎక్కువ సంఖ్యలో కౌంటర్లు ఏర్పాటు చేస్తే బాగుండేదనే అభిప్రాయం వ్యక్తమైంది.
చెట్ల కిందే సేద
రామయ్య కల్యాణానికి వచ్చిన భక్తులను అసౌకర్యాలు వెంటాడాయి. సుదూర ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. తాగునీరు, షామియానాలు వంటి సౌకర్యాలు సరిపడా ఏర్పాటు చేయలేదు. గతంలో కరకట్టకు వెళ్లే ప్రాంతంలో, రామాలయం ఎదురుగా పెద్ద ఎత్తున షామియానాలు ఏర్పాటు చేసేవారు. ఈసారి ఏర్పాటు చేయకపోవడతో రెండు రోజులుగా కరకట్ట సమీపంలో ఉన్న చెట్ల కిందనే సేదదీరారు. ఇక రెండు రోజులపాటు ఇక్కడే ఉండి కల్యాణం, పట్టాభిషేకం తిలకించేందుకు పిల్లాపాపలతో ఊర్లకు ఊర్లుగా పలువురు కదిలిరాగా.. వారికి వంటా వార్పు చేసుకునేందుకు కనీసం నీళ్లు కూడా దొరకలేదు. రామాలయ పరిసర ప్రాంతాల్లో ఎల్‌ఈడీ స్క్రీన్లు ఏర్పాటు చేయలేదు. దీంతో మిథిలా స్టేడియంలోకి వెళ్లలేని భక్తులు కల్యాణం వీక్షించలేకపోయారు. రామయ్య కల్యాణ క్రతువును మైకుల్లోనే వినాల్సి వచ్చిందని పలువురు పేర్కొన్నారు.
తీరు మారని పోలీస్
వీఐపీల తాకిడి పెరగడంతో సామాన్య భక్తులు ఇబ్బంది పడ్డారు. రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, పలువురు మంత్రుల, ఎంపీలు, ఎమ్మెల్యేలు తదితరులు హాజరుకాగా, ఎస్పీ రోహిత్ రాజు పర్యవేక్షణలో 1800 మంది పోలీసులతో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. వీరిలో కొందరు కేవలం మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలకు సేవలు చేయడమే సరిపోయింది. ట్రాఫిక్ ఆంక్షలు విధించడంతో సామాన్యులు ఇబ్బందులు పడ్డారు. ఎప్పటిలాగే పోలీసు వాహనాలను, పోలీసు సిబ్బందిని నిబంధనలకు విరుద్ధంగా అనుమతించడంతో సామాన్య భక్తులు అసహనం వ్యక్తం చేశారు. పలుచోట్ల వాదనలకు దిగారు. పోలీసులు వ్యవహరిస్తున్న తీరులో మాత్రం మార్పు రావడం లేదని పలువురు పేర్కొన్నారు.
ట్రాఫిక్ ఆంక్షలతో అవస్థ..
భద్రాచలంలో మూడుసార్లు ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. సీఎం రేవంత్ కల్యాణంలో పాల్గొనేందుకు వచ్చేటప్పుడు, వెళ్లేటప్పుడు 30, 25 నిమిషాల పాటు ట్రాఫిక్ నిలిపివేశారు. దీంతో ద్విచక్రవాహనదారులు మండుటెండల్లోనే ఉండాల్సి వచ్చింది. ఎండ వేడిమిని తట్టుకోలేక కొందరు అసహనం వ్యక్తం చేస్తూ బైక్‌ల హారన్ మోగించారు. ఆ తర్వాత బ్రిడ్జి సెంటర్ నుంచి సారపాక వెళ్తన్న వాహనాలను పంపించే క్రమంలో ప్రతి 15 నిమిషాలకు వాహనాలను నిలిపివేయడంతో ట్రాఫిక్ సమస్య తీవ్రంగా ఏర్పడింది. ట్రాఫిక్ సమస్యను పోలీసులు చక్కదిద్దలేకపోయారు. ఫలితంగా 3, 4 గంటలపాటు రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. ఇక భద్రాచలం ఆర్టీసీ బస్టాండ్ ప్రయాణికులతో కిటకిటలాడింది. కొందరు స్టాల్స్ నిర్వాహకులు ప్రయాణికుల వద్ద నుంచి ప్రతి వస్తువుపూ అధిక ధరలు వసూలు చేసి జేబులు నింపుకున్నారు.
25 ఏళ్లుగా సైకిల్ పైనే..
భద్రాచలంటౌన్: శ్రీసీతారామచంద్ర స్వామి వారి కల్యాణ మహోత్సవానికి ఓ భక్తుడు 25 ఏళ్లుగా సైకిల్‌పై వస్తున్నాడు. ఏపీలోని పశ్చిమ గోదావరి జిల్లా మొగల్తూరు మండలం పెద్దపల్లవపాలేనికి చెందిన కొల్లాటి రాధాకృష్ణ స్వామికి రాముడంటే ఎనలేని భక్తి. ఏటా కల్యాణానికి సైకిల్‌పై వస్తూ, స్వామివారిని దర్శించుకుని తిరుగు పయనమవుతున్నాడు. ఆదివారం కూడా సైకిల్‌పైనే వచ్చాడు. కాగా, గత నెలలో ఉత్తర్‌ప్రదేశ్‌లో జరిగిన కుంభమేళాకు సైకిల్‌పైనే వెళ్లి వచ్చిన్నట్లు రాధాకృష్ణ స్వామి తెలిపాడు.
అడ్డుగా గొడుగులు..
భద్రాచలం: శ్రీ సీతారాముల కల్యాణం కనులారా వీక్షించేందుకు టికెట్లు కొని స్టేడియానికి భక్తులకు ఇబ్బందులు తప్పలేదు. టికెట్ల కోతతో పాటు వీవీఐపీ, వీఐపీల తాకిడి పెరగటంతో కొందరు నిలబడే వీక్షించాల్సి వచ్చింది. దీనికితోడు స్టేడియానికి ఎదురుగా ఉన్న సెక్టార్లలో లైవ్ టెలికాస్టింగ్ సిబ్బంది ఏర్పాటు చేసుకున్న గొడుగులతో వెనుక వైపు ఉన్న భక్తులు తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. రూ. వేలు ఖర్చు పెట్టి టికెట్లు కొనుగోలు చేసినా స్వామివారి కల్యాణం ప్రశాంతంగా చూడలేకపోయామని విచారం వ్యక్తం చేశారు. అధికారులు సరైన ఏర్పాట్లు చేయలేదన్నారు.
పోటెత్తిన భక్తులు.. వెంటాడిన అసౌకర్యాలు
పోటెత్తిన భక్తులు.. వెంటాడిన అసౌకర్యాలు
పోటెత్తిన భక్తులు.. వెంటాడిన అసౌకర్యాలు
పోటెత్తిన భక్తులు.. వెంటాడిన అసౌకర్యాలు
పోటెత్తిన భక్తులు.. వెంటాడిన అసౌకర్యాలు
పోటెత్తిన భక్తులు.. వెంటాడిన అసౌకర్యాలు
పోటెత్తిన భక్తులు.. వెంటాడిన అసౌకర్యాలు
పోటెత్తిన భక్తులు.. వెంటాడిన అసౌకర్యాలు
పోటెత్తిన భక్తులు.. వెంటాడిన అసౌకర్యాలు
పోటెత్తిన భక్తులు.. వెంటాడిన అసౌకర్యాలు
పోటెత్తిన భక్తులు.. వెంటాడిన అసౌకర్యాలు
పోటెత్తిన భక్తులు.. వెంటాడిన అసౌకర్యాలు
పోటెత్తిన భక్తులు.. వెంటాడిన అసౌకర్యాలు
పోటెత్తిన భక్తులు.. వెంటాడిన అసౌకర్యాలు
పోటెత్తిన భక్తులు.. వెంటాడిన అసౌకర్యాలు
పోటెత్తిన భక్తులు.. వెంటాడిన అసౌకర్యాలు
పోటెత్తిన భక్తులు.. వెంటాడిన అసౌకర్యాలు
పోటెత్తిన భక్తులు.. వెంటాడిన అసౌకర్యాలు


