పరిశ్రమలు స్థాపించాలి
సంపద
పెంచే
కలెక్టర్ జితేష్ వి పాటిల్
సూపర్‌బజార్(కొత్తగూడెం): వ్యవసాయ భూముల్లో ఫామ్‌పాండ్‌ల నిర్మాణంతో రైతులు ఆర్థికాభివృద్ధి చెందే అవకాశం ఉంటుందని కలెక్టర్ జితేష్ వి పాటిల్ అన్నారు. రాజీవ్ యువ వికాసం పథకం ద్వారా సంపద పెరిగే పరిశ్రమలు స్థాపించేలా రైతులు, యువతను ప్రోత్సహించాలని అధికారులకు సూచించారు. గురువారం ఆయన కలెక్టరేట్ నుంచి వివిధ శాఖల అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడారు. ఉపాధి హామీ పథకం ద్వారా రైతులు తమ భూముల్లో ఫాంపాండ్‌ల నిర్మాణాలు చేపట్టేలా అవగాహన కల్పించాలని అన్నారు. జిల్లాలో వ్యవసాయ భూముల్లో సుమారు 52వేల బోర్లు ఉన్నాయని, కనీసం 50వేల ఫామ్ పాండ్‌లు ఉండాలని అన్నారు. తద్వారా చేపలు, అజొల్లా పెంపకం వంటి వాటి ద్వారా రైతులు ఆర్థికంగా అభివృద్ధి చెందవచ్చని చెప్పారు. ఉపాధిహామీ కూలీలందరికీ జీవనజ్యోతి, జీవన సురక్ష పథకంపై అవగాహన కల్పించాలని ఆదేశించారు. కాన్ఫరెన్స్‌లో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ విద్యాచందన, జెడ్పీ సీఈఓ నాగలక్ష్మి, సీపీఓ సంజీవరావు, హౌసింగ్ పీడీ శంకర్, డీపీఓ చంద్రమౌళి, మిషన్ భగీరథ ఈఈలు నళిని, తిరుమలేష్, ఎస్సీ సంక్షేమాధికారి అనసూయ, బీసీ సంక్షేమాధికారి ఇందిర పాల్గొన్నారు.
దొడ్డి కొమరయ్య జీవితం ఆదర్శం..
తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట యోధుడు దొడ్డి కొమరయ్య చూపిన స్పూర్తి నేటి తరాలకు ఆదర్శమని కలెక్టర్ జితేష్ వి పాటిల్ అన్నారు. కలెక్టర్ కార్యాలయంలో గురువారం నిర్వహించిన దొడ్డి కొమరయ్య జయంతి వేడుకల్లో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ తెలంగాణ రైతాగ సాయుధ పోరాటంలో మొదట గుర్తుకొచ్చే వ్యక్తి దొడ్డి కొమరయ్య అని అన్నారు. 1927లో ఉమ్మడి వరంగల్ జిల్లా కడివెండిలో జన్మించిన ఆయన మహోన్నత ఉద్యమానికి ఆద్యుడవడం తెలంగాణ ప్రజలకు గర్వకారణం అన్నారు. అంతకుముందు కొమరయ్య చిత్ర పటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్లు డి.వేణుగోపాల్, విద్యాచందన, బీసీ సంక్షేమాధికారి ఇందిర, కలెక్టరేట్ ఏఓ రమాదేవి తదితరులు పాల్గొన్నారు.


