అశ్వారావుపేటరూరల్: పంట పొలాల్లో ఉన్న విద్యుత్ మోటార్లకు సంబంధించిన సర్వీస్ వైర్లను గుర్తు తెలియని దుండగులు శనివారం అర్ధరాత్రి అపహరించారు. బాధిత రైతుల కథనం ప్రకారం.. మండలంలోని తిరుమలకుంట, తిరుమలకుంట కాలనీ, రెడ్డిగూడెం, బండారిగుంపు, తోగ్గూడెం, పాకలగూడెం గ్రామాల్లో ప్రధాన రహదారుల పక్కనే ఉన్న రైతుల పొలాల్లో 30 మోటార్లకు సంబంధించిన సర్వీస్ వైర్లను చోరీ చేశారు. ఉదయం పొలాల వద్దకు వెళ్లిన రైతులు.. మోటార్ల వైర్లు కట్ చేసి ఉండటాన్ని గుర్తించారు. ఎవరో చోరీ చేశారని రైతులు తెలిపారు. ఎస్‌ఐ యయాతి రాజును వివరణ కోరగా.. చోరీ ఘటనలపై లిఖిత పూర్వకంగా ఫిర్యాదు అందలేదని తెలిపారు.
రెండు కార్లు ఢీ : పలువురికి గాయాలు
ములకలపల్లి: మండలంలోని కొత్తగంగారం అటవీ ప్రాంతంలో రెండు కార్లు ఎదురెదురుగా ఢీకొన్న ఘటనలో పలువురు గాయాలపాలయ్యారు. స్థానికుల కథనం మేరకు.. కాకినాడకు చెందిన భక్తుబృందం కారులో ఆదివారం భద్రాచలం సీతారామచంద్రస్వామి దర్శనం చేసుకొని తిరిగి బయలుదేరారు. వెంకటాపురానికి చెందిన కొందరు కారులో రాజమండ్రి వెళ్లి తిరిగి వస్తున్నారు. ఈ క్రమంలో గంగారం అటవీ ప్రాంతంలో ఈ రెండు కార్లు ఎదురెదురుగా ఢీ కొనగా.. రెండు కార్లలోని పలువురు గాయాలపాలైనట్లు తెలిసింది. ఎస్‌ఐ రాజశేఖర్‌ను వివరణ కోరగా.. ఘటనా స్థలాన్ని పరిశీలించామని, ఎలాంటి ఫిర్యాదు అందలేదని తెలిపారు.