సంక్షేమం, అభివృద్ధే లక్ష్యం
గిరిజనాభివృద్ధిపై సీఎం ప్రత్యేక దృష్టి
ప్రభుత్వాన్ని ప్రజలు విశ్వసించారు
కొత్త సర్పంచ్‌లంతా సుపరిపాలన అందించాలి
రెవెన్యూ, గృహ నిర్మాణ శాఖల మంత్రి పొంగులేటి
అశ్వారావుపేటరూరల్/దమ్మపేట : సంక్షేమం, అభివృద్ధి కార్యక్రమాలే తమ ప్రభుత్వ లక్ష్యమని రాష్ట్ర రెవెన్యూ, గృహ నిర్మాణ శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు. అశ్వారావుపేట, దమ్మపేట మండలాల్లో మంగళవారం ఆయన పర్యటించారు. అశ్వారావుపేట నియోజకవర్గంలో కాంగ్రెస్ మద్దతుతో ఇటీవల గెలుపొందిన 65 మంది సర్పంచ్‌లను సన్మానించి, జ్ఞాపికలు అందజేశారు. ఆ తర్వాత పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన, ప్రారంభోత్సవాలు చేశారు. ఈ సందర్భంగా జరిగిన సభల్లో ఆయన మాట్లాడుతూ.. ఏజెన్సీ ప్రాంతాల్లోని గిరిజనుల అభివృద్ధిపై సీఎం రేవంత్‌రెడ్డి ప్రత్యేక దృష్టి పెడుతున్నారని చెప్పారు. రాష్ట్ర ప్రజలు కాంగ్రెస్ పార్టీని విశ్వసించినందునే ఇటీవలి పంచాయతీ ఎన్నికల్లో 80 శాతానికి పైగా సర్పంచ్ స్థానాలను కై వసం చేసుకుందని తెలిపారు. రాష్ట్రంలో రేవంత్‌రెడ్డి నేతృత్వంలో సుపరిపాలన సాగుతోందని అన్నారు. నూతన సర్పంచ్‌లు సైతం గ్రామాల అభివృద్ధికి కృషి చేయాలని, సుపరిపాలన అందించాలని పిలుపునిచ్చారు. మేడారం సమ్మక్క – సారలమ్మ జాతరలో రెండు శతాబ్దాల పాటు మన్నికగా ఉండేలా రాతి కట్టడాలతో నిర్మాణాలు చేపడుతున్నామని వివరించారు. ఖమ్మం ఎంపీ రామసహాయం రఘురామిరెడ్డి మాట్లాడుతూ.. రాష్ట్రంలోని పది జిల్లాల్లో సర్పంచ్ అభ్యర్థుల విజయానికి మంత్రి పొంగులేటి కృషి చేశారని తెలిపారు. ఇక ఉమ్మడి జిల్లాలో అశ్వారావుపేట ఎమ్మెల్యే జారే ఆదినారాయణ ఒక్కరే నిధుల కోసం తన వెంట పడుతున్నారని చెప్పారు. ఐడీసీ చైర్మన్ మువ్వా విజయ్‌బాబు మాట్లాడుతూ మున్సిపల్ ఎన్నికల్లో పార్టీ శ్రేణులంతా సమన్వయంతో శ్రమించి అశ్వారావుపేట మున్సిపాలిటీలో జరిగే తొలి ఎన్నికల్లో కాంగ్రెస్ సత్తా చాటాలని కోరారు. ఎమ్మెల్యే జారే ఆదినారాయణ మాట్లాడుతూ.. అశ్వారావుపేట మున్సిపాలిటీగా ఆవిర్భవించడానికి మంత్రి పొంగులేటి చొరవే కారణమని చెప్పారు. ఈ మేరకు తాను మంత్రికి విన్నవించగా, ఆయన కేబినెట్‌లో చర్చించి అసెంబ్లీలో ఆమోదించేలా చేశారని వెల్లడించారు. మున్సిపాలిటీకి అదనంగా మరో రూ.10 కోట్లు కావాలని కోరగా, తక్షణమే ప్రతిపాదనలు ఇవ్వాలని సూచించారని తెలిపారు. ఆయా కార్యక్రమాల్లో కలెక్టర్ జితేష్ వి పాటిల్, మున్సిపల్ కమిషనర్ బి.నాగరాజు, దమ్మపేట ఎంపీడీఓ రవీంద్రారెడ్డి, ఐబీ ఈఈ కృష్ణ, డీఈఈ కృష్ణ, ఆత్మ కమిటీ చైర్మన్ వీరభద్రరావు, నాయకులు జూపల్లి రమేష్, సత్యనారాయణ, తుమ్మా రాంబాబు, జూపల్లి ప్రమోద్, రమాదేవి తదితరులు పాల్గొన్నారు.


