తప్పులు సరిచేసుకునేలా..
పొరపాట్లకు తావులేకుండా..
● తల్లిదండ్రుల సెల్‌ఫోన్‌లకు ప్రీ హాల్ టికెట్లు ● ఇంటర్ బోర్డు సరికొత్త నిర్ణయం
పాల్వంచరూరల్: ప్రభుత్వ, ప్రైవేట్ జూనియర్ కళాశాలల్లో చదువుతున్న విద్యార్థులకు ప్రీ హాల్ టికెట్లు పంపిణీ చేయాలని ఇంటర్మీడిఝెట్ బోర్డు నిర్ణయించింది. తల్లిదండ్రుల సెల్‌ఫోన్ వాట్సాప్‌లకు ముందుస్తుగా హాల్ టికెట్లు పంపించడం ద్వారా అందులో ఏమైనా తప్పులు దొర్లితే సరిచేసుకునేందుకు వీలుగా చర్యలు చేపట్టింది. ఫిబ్రవరి 2 నుంచి ప్రాక్టికల్స్, 25వ తేదీ నుంచి వార్షిక పరీక్షలు నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. దీంతో విద్యార్థులు అడ్మిషన్ సమయంలో రిజిస్టర్ చేసుకున్న సెల్‌ఫోన్ నంబర్‌కు ఇటీవల హాల్‌టికెట్లు పంపించింది. పేర్లు, చిరునామాల్లో ఏమైనా అచ్చు తప్పులుంటే కళాశాల ప్రిన్సిపాల్ దృష్టికి తేవాలని విద్యార్థులకు సూచించింది. ఇక హాల్‌టికెట్లు డౌన్ లోడ్ చేసుకోవాలంటే ఇంటర్ ప్రథమ సంవత్సర విద్యార్థులు ఎస్సెస్సీ రూల్ నంబర్, పుట్టిన తేదీ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ద్వితీయ సంవత్సర విద్యార్థులైతే ఫస్టియర్ హాల్‌టికెట్ నంబర్, పుట్టిన తేదీ ఎంటర్ చేయాలి.
ఇంటర్ విద్యార్థుల హాల్ టికెట్లలో ఏమైనా తప్పులు దొర్లితే సరిచేసుకునేలా ముందుగానే తల్లిదండ్రుల సెల్‌ఫోన్లకు వాట్సాప్ ద్వారా పంపించాం. వాట్సాప్ సౌకర్యం లేని వారు ప్రథమ సంవత్సర విద్యార్థులైతే ఎస్సెస్సీ రూల్ నంబర్, విద్యార్థి పుట్టిన తేదీ ఎంటర్ చేసి డౌన్‌లోడ్ చేసుకునే అవకాశం ఉంది. ద్వితీయ సంవత్సరం వారైతే ఫస్టియర్ హాల్‌టికెట్ నంబర్, పుట్టిన తేదీ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఇక హాల్‌టికెట్లలో తప్పులు దొర్లాయని ఇప్పటివరకు ఎవరూ ఫిర్యాదు చేయలేదు. – వెంకటేశ్వరరావు, డీఐఈఓ
పరీక్షల సమయంలో హాల్‌టికెట్ల జారీలో పేర్లు, చిరునామాల్లో తప్పులు దొర్లడం, అవి సరిచేసుకోలేక కొందరు విద్యార్థులు పరీక్షలు రాయలేక గతంలో ఇబ్బంది పడ్డారు. ఈసారి అలాంటి పొరపాట్లకు తావులేకుండా ఇంటర్ బోర్డు తీసుకున్న ఈ నిర్ణయం ఎంతో ఉపశమనం కలిగిస్తుందని చెప్పవచ్చు.
తప్పులు సరిచేసుకునేలా..


