అమ్మగారికీ దండం పెట్టు..!
గంగిరెద్దులు ఆడిస్తేనే జీవనం
● సంస్కృతిని కాపాడుతున్న కుటుంబాలు ● చిన్నప్పటి నుంచే శిక్షణ.. కుటుంబమంతా ఆధారం ● పూర్వంతో పోలిస్తే ఆదరణ లేదని ఆవేదన
ముగ్గులు, గొబ్బెమ్మలు, గాలిపటాలు, పిండి వంటలే కాక ఇంటి ముందుకు గంగిరెద్దులు వస్తేనే సంక్రాంతి పండుగ పరిపూర్ణమైనట్లు భావిస్తారు. వేకువజామున గంగిరెద్దు వాకిట్లోకి వస్తే శుభం కలుగుతుందని ప్రజల నమ్మిక. అయితే, గంగిరెద్దులను ఆడించే కుటుంబాలు పొట్టకూటి కోసం ఇతర వృత్తులు ఎంచుకుంటుండగా కొందరు మాత్రం ఇదే వృత్తిగా జీవనం సాగిస్తుండడంతో సంస్కృతి కొనసాగుతోంది. – పాల్వంచరూరల్
సంక్రాంతి వస్తుందనగానే గంగిరెద్దుల వాళ్లు డూడూ బసవన్నలను ముస్తాబు చేసి పల్లె, పట్నం తేడా లేకుండా వస్తుంటారు. ఇంటి ముందుకు వచ్చి ‘అయ్యగారికి దణ్ణం పెట్టు, అమ్మగారికి సలాం చేయ్’ అంటూ వారు చేసే సూచనలతో బసవన్నలు తలాడిస్తుండడం ఆకట్టుకుంటుంది.
గంగిరెద్దులను ఆడించే వారి జీవన శైలి విచిత్రంగా ఉంటుంది. తాత, ముత్తాతల నుంచి ఇదే వృత్తిలో కొనసాగుతున్న కొందరికి సొంత ఇళ్లు లేకపోగా, ఊరి చివర డేరాలు వేసుకుని జీవిస్తుంటారు. సంక్రాంతి సందర్భంగా ఇంటింటికీ వెళ్లి వచ్చే కొద్దోగొప్పో సంపాదనతో పొట్టపోసుకుంటారు. వీరి నెత్తిన తలపాగ, కోరమీసాలు, చెవులకు కమ్మల జోడు, చేతులు, కాళ్లకు కడియాలకు తోడు రంగురంగుల దుస్తులు ధరించి బుర్ర డోలు, శంఖు, సన్నాయి వాయిస్తూ వినూత్నంగా కనిపిస్తారు.
గంగిరెద్దుల వారి జీవితాలకు కొన్నేళ్లుగా ఆదరణ కరువైంది. అయినా వృత్తి వీడని పలువురు పండుగ వేళ వేకువజామున చలిలో గంగిరెద్దులతో ఇంటింటికీ వస్తున్నారు. పండుగ సందర్భంగా ఊరూరా తిరిగి ప్రదర్శనలు ఇచ్చే వీరు కొద్దిపాటి ఆదాయంతో కొన్నినెలలు కుటుంబంతో ఆనందంగా గడుపుతారు. ఆ తర్వాత కూలీ పనులకు వెళ్తూ జీవనం సాగిస్తుంటారు. ఇంకొందరు గ్రామాల్లో ఎవరైనా చనిపోతే దశదిన కర్మ వంటి కార్యక్రమాలకు కూడా వెళ్తున్నారు.
గంగిరెద్దులను నమ్ముకున్న వారు ఉమ్మడి జిల్లాలోని పాల్వంచ, కొత్తగూడెం, సుజాతనగర్ తదితర మండలాల్లో జీవనం సాగిస్తున్నారు. ఈమేరకు గంగిరెద్దులు విన్యాసాలు చేసేలా చిరుప్రాయం నుంచే ప్రత్యేక శిక్షణ ఇస్తారు. పరుగులు పెట్టించడంతో పాటు సూచన ఇవ్వగానే తల ఊపేలా తర్ఫీదు ఇస్తారు. అంతేకాక కొందరు కింద పడుకుని తమపై గంగిరెద్దు నిలుచునేలా శిక్షణ ఇస్తుండగా.. ఈ విన్యాసాలు గగుర్పాటును కలిగిస్తాయి.
గంగిరెద్దులతోనే సంక్రాంతి కళ
తాత ముత్తాతల నుంచి ఆచారంగా గంగిరెద్దులు ఆడిస్తూ జీవనం సాగిస్తున్నాం. సంక్రాంతి సమయంలో కొద్దోగొప్ప ఆదాయం వస్తుంది. మిగిలిన రోజుల్లో సాయం దక్కదు. ఇతర పనులు చేయలేక ఇందులోనే కొనసాగుతున్నాం.
– వెంకన్న, రాజాపురం
అమ్మగారికీ దండం పెట్టు..!


