నేత్రపర్వంగా రామయ్య నిత్యకల్యాణం
భద్రాచలంటౌన్: భద్రాచలం శ్రీ సీతారామచంద్రస్వామి వారి నిత్యకల్యాణ వేడుక మంగళవారం నేత్రపర్వంగా సాగింది. తెల్లవారుజామున గర్భగుడిలో స్వామివారికి సుప్రభాత సేవ, సేవాకాలం, ఆరాధన తదితర పూజలు చేశారు. అనంతరం చిత్రకూట మండపంలో కొలువుదీర్చి విశ్వక్సేన పూజ, పుణ్యావాచనం చేశారు. స్వామివారికి కంకణధారణ, యజ్ఞోపవీత ధారణ, అమ్మవారికి కంకణధారణ, యోక్త్రధారణ గావించి నిత్యకల్యాణ ఘట్టాన్ని అర్చకులు శాస్త్రోక్తంగా నిర్వహించారు. కాగా, మంగళవారాన్ని పురస్కరించుకుని శ్రీ అభయాంజనేయ స్వామి వారికి ప్రత్యేక పూజలు చేశారు.
మందులు అందుబాటులో ఉంచండి
దుమ్ముగూడెం : ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో అన్ని రకాల మందులు అందుబాటులో ఉంచాలని డీఎంహెచ్‌ఓ డాక్టర్ తుకారాం రాథోడ్ సిబ్బందికి సూచించారు. మంగళవారం ఆయన పర్ణశాల, దుమ్ముగూడెం పీహెచ్‌సీలను తనిఖీ చేశారు. ఆస్పత్రుల్లోని రికార్డులు, ల్యాబ్‌లు, ప్రసూతి, మందుల గదులను పరిశీలించారు. రిజిస్టర్ల నిర్వహణపై సంతృప్తి వ్యక్తం చేశారు. అనంతరం మాట్లాడుతూ.. అన్ని రకాల ఔషధాలు, అత్యవసరమైన పాముకాటు, కుక్క కాటు ఇంజెక్షన్లు నిత్యం అందుబాటులో ఉండేలా చూసుకోవాలని అన్నారు. గర్భిణుల కాన్పు తేదీలు తెలియపరిచే (ఎక్స్‌పెక్టెడ్ డేట్ ఆఫ్ డెలివరీ) విధానం బాగుందని అభినందించారు. కార్యక్రమంలో డాక్టర్లు రేణుకారెడ్డి, రుక్మాకర్‌రెడ్డి, హోమియో డాక్టర్ రాజేష్, యూడీసీ శ్రీనివాసరావు, వైద్య సిబ్బంది కృష్ణయ్య, నాగేశ్వరావు, సురేష్, ఫార్మసిస్ట్ కృపారాణి, సుజాత, సంధ్యారాణి, హరితేజ తదితరులు పాల్గొన్నారు.
గిరిజన సంస్కృతికి
అద్దం పడుతోంది
భద్రాచలంటౌన్ : భద్రాచలం ఐటీడీఏ ప్రాంగణంలో ఏర్పాటుచేసిన మ్యూజియం గిరిజనుల జీవనశైలి, ఆచార వ్యవహారాలకు అద్దం పడుతోందని ఆస్ట్రేలియా పర్యాటకురాలు రాబిన్ జెపరి ప్రశంసించారు. హైదరాబాద్‌కు చెందిన తన మిత్రులతో కలిసి మంగళవారం ఆమె శ్రీ సీతారామచంద్రస్వామి వారిని దర్శించుకున్నారు. అనంతరం మ్యూజియాన్ని తిలకించాక మాట్లాడుతూ.. అంతరించిపోతున్న గిరిజన సంస్కృతిని నేటి తరానికి తెలిసేలా కళాఖండాలను ప్రదర్శించడం అభినందనీయమన్నారు. ముఖ్యంగా గిరిజన పూర్వీకుల పనిముట్లు, చరిత్రను తెలుగు, ఇంగ్లిష్ భాషల్లో వివరించడం పర్యాటకులకు ఎంతో ఉపయోగకరంగా ఉందన్నారు. గిరిజన మహిళలు తయారు చేసిన మిల్లెట్ బిస్కెట్లు రుచికరంగా ఉన్నాయని మెచ్చుకున్నారు. అద్భుతమైన రీతిలో మ్యూజియాన్ని తీర్చిదిద్దిన పీఓ బి.రాహుల్‌కు అభినందనలు తెలిపారు. కార్యక్రమంలో మ్యూజియం నిర్వాహకుడు వీరస్వామి, మాధవి తదితరులు పాల్గొన్నారు.
అలుగు నిర్మాణ పనుల పరిశీలన
చండ్రుగొండ: మండలంలోని భారీ సాగునీటి వనరైన సీతాయిగూడెంలోని వెంగళరాయసాగర్ అలుగు నిర్మాణ పనులను క్వాలిటీ కంట్రోల్ అధికారులు మంగళవారం పరిశీలించారు. అలుగుకు గండిని పూడ్చేందుకు ఇప్పటికే ప్రభుత్వం రూ.33 కోట్లు మంజూరు చేయగా, ఇటీవలే పనులు చేపట్టారు. ఆయా పనులను క్వాలిటీ కంట్రోల్ డీఈ రమేష్, ఏఈ నరేష్ తనిఖీ చేశారు. పనుల్లో నాణ్యతా ప్రమాణాలు పాటించాలని నీటి పారుదల శాఖ డీఈ కృష్ణ, ఏఈ నర్సింహారావుకు సూచించారు.
నేత్రపర్వంగా రామయ్య నిత్యకల్యాణం
నేత్రపర్వంగా రామయ్య నిత్యకల్యాణం


