రిజర్వేషన్లు పెంచాకే ఎన్నికలు నిర్వహించాలి
● లేదంటే రాష్ట్రాన్ని అగ్నిగుండగా మారుస్తాం ● బీసీల ఆత్మీయ సమ్మేళనంలో జాతీయ అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్‌గౌడ్
సూపర్‌బజార్(కొత్తగూడెం): కామారెడ్డి డిక్లరేషన్ ప్రకారం బీసీలకు రిజర్వేషన్లు 42 శాతంగా పెంచాకే ఎంపీటీసీ, జెడ్పీటీసీ, మున్సిపల్ ఎన్నికలు నిర్వహించాలని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షులు జాజుల శ్రీనివాస్ గౌడ్ డిమాండ్ చేశారు. దీన్ని రాష్ట్ర ప్రభుత్వం విస్మరిస్తే తెలంగాణ అగ్నిగుండంగా మారుతుందని ఆయన హెచ్చరించారు. కొత్తగూడెంలో మంగళవారం నిర్వహించిన బీసీల ఆత్మీయ సమ్మేళనానికి శ్రీనివాస్‌గౌడ్ ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. రిజర్వేషన్లు పెంచకుండా ఎన్నికలు పెడితే బీసీ సమాజం అడ్డుకొని తీరుతుందని స్పష్టం చేశారు. చట్టబద్ధంగా, రాజ్యాంగబద్ధంగా బీసీల రిజర్వేషన్లు పెంచేలా ఈనెల 28వ తేదీ నుంచి ఢిల్లీలో జరిగే పార్లమెంట్ సమావేశాల్లో కేంద్రప్రభుత్వంపై ఒత్తిడి పెంచి చట్టం చేశాకే ఎన్నికలు నిర్వహించాలని కోరారు. బీసీ రిజర్వేషన్ల చట్టాన్ని ఆమోదించకుండా కేంద్రప్రభుత్వం అడుగడుగునా అడ్డుకుంటోందని, 50 శాతం పరిమితితో రాజకీయంగా అణచివేస్తుందని ఆరోపించారు. గ్రామపంచాయతీ ఎన్నికల సందర్భంగా బీసీలకు 17 శాతం రిజర్వేషన్లు కల్పించి అన్యాయం చేసిన కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు బీసీలను మళ్లీ మోసం చేయడానికి ప్రయత్నిస్తే సహించేది లేదని తెలిపారు. సంక్రాంతి తర్వాత రాష్ట్రవ్యాప్తంగా బీసీ ఉద్యమాన్ని ఉధృతం చేసి 42 శాతం రిజర్వేషన్లు సాధించేవరకు కొనసాగిస్తామని వెల్లడించారు. సంఘం జిల్లా అధ్యక్షుడు అకినీడు ప్రసాద్ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో డీసీసీ అధ్యక్షురాలు తోట దేవీప్రసన్న, జిల్లా గ్రంథాలయ చైర్మన్ పి.వీరబాబు, బీసీ జేఏసీ రాష్ట్ర కన్వీనర్ మడత వెంకట్‌గౌడ్, నాయకులు మిట్టపల్లి సాంబయ్య, సోమేశ్వర్ గౌడ్, శ్రీనివాస్ యాదవ్, మీనాక్షి, మాద శ్రీరాములు, రంగారావు, భిక్షపతి, వేముల నరేష్, వేణు, మహేష్‌గౌడ్, పల్లపు లక్ష్మణ్ తదితరులు పాల్గొన్నారు.


