● మార్క్‌ఫెడ్ ద్వారా రెండు జిల్లాల్లో కేంద్రాల ఏర్పాటు ● వచ్చేనెల రెండో వారం నుంచి కొనుగోళ్లకు సిద్ధం ● ఉమ్మడి జిల్లాలో 1.27లక్షల ఎకరాల్లో మొక్కజొన్న సాగు
ఖమ్మంవ్యవసాయం: యాసంగిలో సాగు చేసిన మొక్కజొన్న పంట కొనుగోళ్లకు ప్రభుత్వం సమాయత్తమవుతోంది. రాష్ట్ర వ్యాప్తంగా మార్క్‌ఫెడ్ ద్వారా మక్కల కొనుగోళ్లకు ప్రభుత్వం నిర్ణయించగా.. సీజన్ సమీపించడంతో మార్క్‌ఫెడ్ రాష్ట్ర అధికారులు ఇటీవల జిల్లాల అధికారులకు దిశానిర్దేశం చేశారు. పంట సాగు చేసిన ప్రాంతాల్లో కొనుగోలు కేంద్రాల గుర్తింపు, రవాణా తదితర అంశాలపై చర్యలు తీసుకోవాలని సూచించారు. ఇదే సమయాన కొనుగోలు చేసిన పంట రవాణాకు సంబంధించి గత విధానం కాకుండా ఆన్‌లైన్ టెండర్ విధానాన్ని అమలు చేయాలని పేర్కొన్నారు.
అత్యధికంగా జిల్లాలో...
రాష్ట్రంలో మొక్కజొన్న యాసంగి పంట సాగు విస్తీర్ణం అధికంగా ఉన్న జిల్లాల్లో ఉమ్మడి ఖమ్మం కూడా ఒకటి. మొక్కజొన్నలను ప్రధానంగా కోళ్ల పరిశ్రమల్లో దాణాగా వినియోగిస్తుంటారు. అయితే, ఇటీవల కోళ్లకు వైరస్ వ్యాపిస్తోందని పరిశ్రమల యజమానులు వాటి ఉత్పత్తిని తగ్గించడంతో ప్రైవేట్ మార్కెట్‌లో మక్కల ధరపై సందిగ్ధత నెలకొంది. కాగా, ఈ ఏడాది కేంద్ర ప్రభుత్వం మక్కలకు క్వింటాకు రూ. 2,225గా మద్దతు ధర నిర్ణయించింది. కానీ ప్రైవేట్ మార్కెట్‌లో క్వింటా ధర రూ.2,150 మించకపోగా, భవిష్యత్ పరిస్థితి ఏమిటో తెలియడం లేదు. దీంతో రైతులకు మద్దతు ధర దక్కేలా ప్రభుత్వ కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలని నిర్ణయించారు.
గత ఏడాదితో పోలిస్తే ఎక్కువే..
ప్రస్తుత యాసంగి సీజన్‌లో ఉమ్మడి ఖమ్మం జిల్లాలో 1.27 లక్షల ఎకరాల్లో మొక్కజొన్న పంట సాగు చేశారు. నీటి వనరుల ఆధారంగా ఖమ్మం జిల్లాలో 94 వేల ఎకరాల్లో, భద్రాద్రి జిల్లాలో 33 వేల ఎకరాల్లో పంట వేశారు. గత ఏడాది ఉమ్మడి జిల్లాలో 80 వేల ఎకరాల్లో పంట సాగైతే ఈ ఏడాది మరో 50 వేల ఎకరాల్లో సాగవడం విశేషం. వానాకాలం కురిసిన వర్షాలతో జలాశయాల్లో నీరు ఉండడం, జిల్లాకు ప్రధాన నీటి వనరైన నాగార్జునసాగర్ నుంచి యాసంగి పంటలకు నీరు విడుదల కావడంతో వరి, మొక్కజొన్న పెద్దమొత్తంలో సాగు చేశారు. ఖమ్మం జిల్లాలోని కొణిజర్ల, చింతకాని, బోనకల్, వైరా, ముదిగొండ, మధిర, ఎర్రుపాలెం, తిరుమలాయపాలెం, ఏన్కూరు, ఖమ్మం రూరల్, నేలకొండపల్లి, కూసుమంచి తదితర మండలాల్లో. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో టేకులపల్లి, ఇల్లెందు, గుండాల, పాల్వంచ, చంద్రుగొండ, సుజాతనగర్, జూలూరుపాడు, బూర్గంపాడు తదితర మండలాల్లో మక్క పంటను వేశారు. ఏప్రిల్ మొదటి, రెండో వారం నుంచి పంట చేతికందే అవకాశం ఉంది.
రైతులకు అందుబాటులో ఉండేలా...
ఉమ్మడి జిల్లాలో పంట సాగైన ప్రాంతాల ఆధారంగా రైతులకు సౌకర్యంగా ఉండేలా మక్కల కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయనున్నారు. గత ఏడాది ఖమ్మం జిల్లాలో 34 కేంద్రాలు ఏర్పాటు చేసి 64,413 మెట్రిక్ టన్నులు, భద్రాద్రి జిల్లాలో ఐదు కేంద్రాల ద్వారా 3,344 మెట్రిక్ టన్నుల మక్కలను కొనుగోలు చేశారు. ఈ ఏడాది పంట సాగు విస్తీర్ణం పెరగడతో ఖమ్మం జిల్లాలో 45 – 50 వరకు, భద్రాద్రి జిల్లాలో 15 కేంద్రాల వరకు ఏర్పాటు చేసే అవకాశం ఉంది.
సన్నాహాలు చేస్తున్నాం...
యాసంగిలో సాగు చేసిన మొక్కజొన్న పంట కొనుగోళ్లకు సమాయత్తమవుతున్నాం. ఉన్నతాధికారుల ఆదేశాలతో పంట రవాణాకు ఆన్‌లైన్ టెండరింగ్ విధానంపై దృష్టి సారించాం. పంట సాగు ఆధారంగా అక్కడ కేంద్రాల ఏర్పాటుకు ప్రాధాన్యత ఇస్తాం.
– సునీత, మార్క్‌ఫెడ్ మేనేజర్,
ఉమ్మడి ఖమ్మం జిల్లా
మక్కల కొనుగోళ్లకు రెడీ..
మక్కల కొనుగోళ్లకు రెడీ..