Bhadradri: నాడు పొగడ చెట్టు నీడలో..రామయ్య పెళ్లి పెద్దలు వీరే! సీతమ్మవారి మూడు సూత్రాల ముచ్చట

శ్రీ సీతారాముల కల్యాణానికి ముస్తాబైన మండపం - Sakshi

తొలినాళ్లలో రామయ్య కల్యాణం అక్కడే..

ఆ తర్వాత చిత్రకూట మండపంలో..

ప్రస్తుతం మిథిలా స్టేడియంలో వేడుకలు..

సాక్షి ప్రతినిధి, భద్రాద్రి కొత్తగూడెం : శ్రీరామదాసు కాలంలో భద్రాచలం ఆలయ ప్రాంగణంలో ఉన్న పొగడ చెట్టు నీడన సీతారాముల కల్యాణం నిర్వహించేవారని అర్చకులు చెబుతున్నారు. ఆ తర్వాత కాలంలో భక్తుల సంఖ్య పెరగడంతో పెళ్లి వేదికను చిత్రకూట మండపంలోకి మార్చారు. గోదావరిపై వంతెన నిర్మాణం పూర్తయ్యాక భద్రాచలం వచ్చే భక్తుల సంఖ్య వేలల్లోకి చేరుకుంది.

చిత్రకూట మండపంలో అంతమంది పెళ్లి చూడటం కష్టం కావడంతో కల్యాణ వేడుకను బయట జరిపించాలని నిర్ణయించారు. దీంతో 1964లో ఉత్తర ద్వారానికి ఎదురుగా ప్రత్యేకంగా కల్యాణ మండపం నిర్మించారు. 1998లో ఎన్టీఆర్‌ హయాంలో కల్యాణ మండపం చుట్టూ భక్తులు కూర్చుని చూసేందుకు వీలుగా గ్యాలరీ నిర్మించారు. అప్పటి నుంచి కల్యాణ వేడుక జరిగే ప్రదేశాన్ని మిథిలా స్టేడియంగా పిలుస్తున్నారు. ఆ తర్వాత స్టేడియంలో గ్యాలరీపై ఎండా, వానల నుంచి రక్షణ కోసం షెడ్డు నిర్మించారు.

పెళ్లి పెద్దలు వీరే..
శ్రీరామదాసు కాలం నుంచి భద్రాచలంలో నిత్య పూజలు, శ్రీరామనవమి, పట్టాభిషేకం తదితర వేడుకలు నిర్వహించేందుకు కోటి, అమరవాది, పొడిచేటి, గొట్టుపుళ్ల, తూరుబోటి కుటంబాలకు చెందిన అర్చకులను నియమించారు. వంశపారంపర్యంగా వీళ్లే ఈ బాధ్యతలు నిర్వర్తిస్తూ వస్తున్నారు. ఇందులో నవమి వేడుకల బాధ్యతలను వంతుల వారీగా ఈ కుటుంబాలు నిర్వహిస్తుంటారు.

శ్రీరామ నవమికి మిథిలా స్టేడియంలో జరిగే శ్రీ సీతారాముల కల్యాణం, పట్టాభిషేక మహోత్సవాల్లో కీలక పాత్ర పోషించేది ఆచార్య. ఇతని చేతుల మీదుగానే కల్యాణం మొత్తం జరుగుతుంది. ఆయనకు సూచనలు అందించే వ్యక్తిని బ్రహ్మగా పేర్కొంటారు. వీరిద్దరికీ సహాయకులుగా ఇద్దరు చొప్పున నలుగురు రుత్విక్‌లు ఉంటారు. వీరికి పూజా సామగ్రి అందించేందుకు ఇద్దరు చొప్పున నలుగురు పరిచారకులు ఉంటారు.

ప్రస్తుతం ఆలయంలో ప్రధాన అర్చకులైన ఇద్దరు వీరందరికీ అధ్వర్యులుగా వ్యవహరిస్తారు. మొత్తంగా 12 మంది సీతారాముల పెళ్లి వేడుకలో కీలకంగా వ్యవహరిస్తారు. వీరందరినీ ఉత్సవాల్లో భాగస్వామ్యం చేస్తూ, కల్యాణతంతు శాస్త్రోక్తంగా, సంప్రదాయబద్ధంగా పూర్తి చేసేలా స్థానాచార్యులు స్థలశాయి ‘పెద్ద పాత్ర’ను నిర్వర్తిస్తారు.

సీతమ్మ వారి మంగళసూత్రాలు ప్రత్యేకం.. మూడు సూత్రాల ముచ్చట
భద్రాచలం దివ్యక్షేత్రంలో సీతమ్మ వారి మంగళసూత్రాలకు ఎంతో విశిష్టత, ప్రత్యేకత ఉన్నాయి. నూతన వధువుకు మాంగళ్యధారణ సమయంలో రెండు మంగళసూత్రాలు మాత్రమే ఉంటాయి. ఒకటి పుట్టింటి వారు, రెండోది మెట్టింటి వారు చేయిస్తారు. అయితే, భద్రాచలంలో సీతమ్మ వారికి రామచంద్ర స్వామి మూడు సూత్రాలతో మాంగళ్యధారణ చేస్తారు.

సీతమ్మ వారికి పుట్టింటి, మెట్టింటి వారితో పాటు భక్త రామదాసు కూడా సీతమ్మ తల్లిని కుమార్తెగా భావించి మరో సూత్రాన్ని చేయించాడు. ఈ మంగళసూత్రాన్ని పార్వతీదేవి, లక్ష్మీదేవి, సరస్వతీ దేవి ముందుంచి ప్రత్యేక పూజలు చేస్తారు, ఒక్క సీతమ్మ వారికే ఇలా మూడు సూత్రాలతో మంగళధారణ జరిగే శుభ సన్నివేశాన్ని చూసిన భక్తులు పునీతులవుతారు.

Read latest Bhadradri News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top