వన్యప్రాణి సంరక్షణపై దృష్టి | - | Sakshi
Sakshi News home page

వన్యప్రాణి సంరక్షణపై దృష్టి

Feb 20 2026 6:53 AM | Updated on Feb 20 2026 6:53 AM

వన్యప్రాణి సంరక్షణపై దృష్టి

వన్యప్రాణి సంరక్షణపై దృష్టి

అభయారణ్యంలో అలజడి లేకుండా వైల్డ్‌లైఫ్‌ విభాగం చర్యలు

గొత్తికోయలను మైదాన ప్రాంతాలకు తరలించే ప్రయత్నాలు

దట్టమైన అటవీలో 25 గొత్తికోయల గుంపుల గుర్తింపు

ఇప్పటికే రెండు దఫాలుగా నోటీసులు జారీచేసిన అటవీ అధికారులు

అడవిలో అలజడి లేకుండా..

పాల్వంచరూరల్‌: వన్యప్రాణుల సంరక్షణపై అటవీశాఖ అధికారులు దృష్టి సారించారు. 63,465 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణం కలిగిన కిన్నెరసాని అభయారణ్యంలో వివిధ రకాల అటవీ జంతువులు ఉన్నాయి. అటవీ సంరక్షణకు వైల్డ్‌లైఫ్‌ డివిజన్‌ ప్రత్యేక విభాగం నాలుగు రేంజ్‌లు, 77 బీట్లతో కొనసాగుతోంది. ఇక్కడ అడవి దున్నలు, ఎలుగుబంట్లు, నక్కలు, జింకలు, సాంబర్లు, కొండగొర్రెలు, చిరుతలు, తోడేళ్లు, కుందేళ్లు వంటి వన్యప్రాణుల సంతతి వృద్ధిని ఇటీవల జరిగిన జంతుగణనలో వైల్డ్‌లైఫ్‌ శాఖ అధికారులు గుర్తించారు. వాటి సంరక్షణకు ప్రత్యేకంగా ట్రాప్‌ కెమెరాలు, నీటి కుంటలు, సాసర్‌ పిట్లు, గడ్డి క్షేత్రాలు ఏర్పాటు చేశారు.

గొత్తికోయ గుంపులను

ఖాళీ చేయించే ప్రయత్నం..

గొత్తికోయ గ్రామాలతో వన్యప్రాణులకు ముప్పు వాటిల్లుతోందని అధికారులు భావిస్తున్నారు. దట్టమైన అటవీ ప్రాంతం నుంచి ఖాళీ చేయాలని వారికి నోటీసులు ఇస్తున్నారు. 2002, 2003లలో ఛత్తీస్‌గఢ్‌ నుంచి వలస వచ్చిన గొత్తికోయ గిరిజనులు అభయారణ్యంలోని దట్టమైన అటవీప్రాంతంలో 25 గుంపులు ఉన్నట్లు గుర్తించారు. వీటిల్లో సుమారు 5,500 మంది నివాసం ఉంటున్నారు. వీరు అవసరాలకు మించి పోడు భూమి సాగు చేస్తున్నారని అధికారులు పేర్కొంటున్నారు. ఒక్కొక్కరు 10 నుంచి 15 ఎకరాల పోడు భూమిని ఆక్రమించారని చెబుతున్నారు. ఆర్‌ఎఫ్‌ఆర్‌ పట్టాలు కలిగిన భూములను మినహాయించి, మిగతా భూమి సుమారు 5 వేల ఎకరాలు స్వాధీనం చేసుకున్నట్లు ఎఫ్‌డీఓ బాబు తెలిపారు. ఇంకా కొందరి వద్ద ఆక్రమించుకున్న భూమి ఉందని పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో అభయారణ్యంలో అటవీ భూమితోపాటు వన్యప్రాణుల పరిరక్షణపై దృష్టి పెట్టామని తెలిపారు.

దట్టమైన అటవీలో ఉన్నవారికి నోటీసులు

అభయారణ్యంలోని దట్టమైన అటవీ ప్రాంతంలో ఉంటున్న బూసురాయి, రాళ్లచెలక, చిరుతానిపాడు, ఒంటిగుడిసె తదితర గుంపుల గిరిజనులకు నివాస ఆధారాలు చూపాలని, లేని పక్షంలో ఉన్న ప్రదేశాన్ని ఖాళీచేసి మైదాన ప్రాంతాలకు వెళ్లాలని వైల్డ్‌లైఫ్‌ యాక్టు–20 కింద రెండు దఫాలుగా నోటీసులు జారీ చేసినట్లు ఎఫ్‌డీఓ తెలిపారు.

అభయారణ్యంలో వనప్రాణి, వృక్షసంపద, అటవీభూమి సంరక్షణకు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నాం. అభయారణ్యంలో అలజడి ఉన్నా, మనుషుల సంచారం అధికమైనా వన్యప్రాణి స్వేచ్ఛగా సంచరించదు. సంతానం వృద్ధి చెందదు. అందుకోసం ముందుగా దట్టమైన అటవీ ప్రాంతంలో ఉన్న గొత్తికోయ గుంపుల గిరిజనులు ఆ ప్రాంతాన్ని వదిలిపెట్టాలని నోటీసులు ఇచ్చాం. గతంలో జంతువుల వేటాడిన కేసులో ఇద్దరు గొత్తికోయలు జైలు శిక్ష కూడా అనుభవిస్తున్నారు. వన్యప్రాణుల సంరక్షణ అందరి బాధ్యత. అటవీశాఖకు సహకరించాలి. –బాబు, వైల్డ్‌లైఫ్‌ ఎఫ్‌డీఓ

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement