గిరిజన మాల్‌తో ఆదరణ
భద్రాచలం/దుమ్మగూడెం: గిరిజన ఉత్పత్తులకు ఆదరణ లభించేలా గిరిజన మాల్ ఏర్పాటు చేస్తున్నట్లు భద్రాచలం ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు, ఐటీడీఏ పీఓ బి.రాహుల్ తెలిపారు. భద్రాచలంలో ప్రస్తుతం ఉన్న గిరిజన బజార్‌కు అదనపు గదిగా రూ. 15 లక్షలతో నిర్మించనున్న గిరిజన మాల్‌కు గురువారం భూమి పూజ చేశారు. దుమ్ముగూడెం మండలం నర్సాపురం గ్రామంలోని సూదిరెడ్డి నాగిరెడ్డి, ఆదిలక్ష్మమ్మ మెమోరియల్ జిల్లా పరిషత్ స్కూల్ ఆవరణలో నీతి ఆయోగ్ అవార్డు నిధులతో 54 మంది బాలికలకు సైకిళ్లు పంపిణీ చేశారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ఇప్పపువ్వు, కరక్కాయలు , ఇతర తృణధాన్యాలు దళారులు చెంతకు చేరకుండా ఈ మాల్‌లు ఉపయోగపడతాయన్నారు. పట్టణాల్లోని మాల్స్‌కు పోటీగా గిరిజన మాల్ అభివృద్ధి కావాలని ఆకాంక్షించారు. ప్రతిభ చూపిన మారుమూల గిరిజన గ్రామాల విద్యార్థినులకు సైకిళ్లు పంపిణీ చేసినట్లు తెలిపారు. ఐటీడీఏ పీఓ మాట్లాడుతూ గిరిజనులు తయారు చేసే, పండించే ప్రతీ వస్తువు మాల్‌లో లభిస్తుందన్నారు. చదువు కోసం రవాణా సౌకర్యం లేని మారుమూల గిరిజన గ్రామాల విద్యార్థినులు పడుతున్న కష్టాలు, వారి సాధించిన ఉత్తమ ఫలితాలపై కలెక్టర్ జితేష్ వి.పాటిల్ చొరవ తీసుకుని డాక్యుమెంటరీని తయారు చేయించి, నీతి ఆయోగ్ వెబ్‌సైట్‌లో పొందుపరిచారని అన్నారు. దీంతో నీతి ఆయోగ్ అధికారులు కలెక్టర్‌ను అభినందిస్తూ రూ.3 లక్షల నగదు బహుమతిని ప్రకటించారని తెలిపారు. ఆ నగదుతో నర్సాపురం, పర్ణశాల హైస్కూళ్ల విద్యార్థినులకు సైకిళ్లు అందించామన్నారు.
పదో తరగతి ఫలితాల్లో నిర్లక్ష్యం వహించే హెచ్‌ఎంలపై కఠిన చర్యలు తీసుకుంటామని పీఓ రాహుల్ హెచ్చరించారు. గురువారం ఐటీడీఏ సమావేశ మందిరంలో హెచ్‌ఎంలు, వార్డెన్లతో నిర్వహించిన సమీక్షలో మాట్లాడారు. ఏటీడీవోలు రాత్రిపూట పాఠశాలలను సందర్శించి పర్యవేక్షించాలని ఆదేశించారు. జీపీఎస్ పాఠశాలలకు ఫర్నిచర్ కొనుగోలుకు నిధులు విడుదల చేసినట్లు తెలిపారు. ఈ కార్యక్రమాల్లో అధికారులు డేవిడ్‌రాజ్, అశోక్, సంజీవరావు నవనీత్, లక్ష్మీనారాయణ, ఉదయ్‌కుమార్, వేణు, వివేక్‌రామ్, సున్నం సమ్మయ్య, సమ్మయ్య, గన్యా, మధుకర్, అలివేలు మంగతాయారు, హరికృష్ణ, భద్రాచలం సర్పంచ్ పూనెం కృష్ణ, పూజారి రత్నకుమారి, హెచ్‌ఎం బెక్కంటి శ్రీనివాసరావు పాల్గొన్నారు.
ఎమ్మెల్యే వెంకట్రావు, పీఓ రాహుల్


