మురసు నష్టాన్ని పరిశీలించిన కేంద్ర బృందం | - | Sakshi
Sakshi News home page

మురసు నష్టాన్ని పరిశీలించిన కేంద్ర బృందం

Nov 14 2026 3:28 AM | Updated on Nov 14 2026 3:28 AM

బాపట్ల: మురసు తుపాను ప్రభావంతో నష్టపోయిన ప్రాంతాలను క్షేత్రస్థాయిలో పరిశీలించేందుకు నియమితులైన కేంద్ర బృందం శుక్రవారం జిల్లాకు చేరుకుంది. జిల్లా కలెక్టర్‌ డాక్టర్‌ వి.వినోద్‌ కుమార్‌ బృందానికి ఆహ్వానం పలికారు. తుపానుతో జిల్లాలో అపార నష్టం వాటిల్లిన దృశ్యాలపై స్థానిక కలెక్టరేట్‌లో ఏర్పాటుచేసిన ఫొటో ఎగ్జిబిషన్‌ను కేంద్ర బృందం పరిశీలించింది. నష్టం అంచనాలను జిల్లా కలెక్టర్‌ వివరించారు. నష్టం అంచనాలపై రూపొందించిన నివేదికను అందజేశారు. వ్యవసాయ, ఆక్వా రంగాలకు, విద్యుత్తు, రహదారుల వ్యవస్థకు అపార నష్టం సంభవించడంతో ప్రజలు ఎంతో ఇబ్బందులు పడ్డారని అంతర్‌ మంత్రిత్వ శాఖల కేంద్ర బృందం నాయకులు చిత్తరంజన్‌ దాస్‌ అన్నారు. తుపాను జన జీవనాన్ని దెబ్బ తీసిందన్నారు. నష్టం అంచనాలను కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకు వెళ్తామని హామీ ఇచ్చారు. ఇక్కడ పరిశీలించిన అంశాలను కేంద్రానికి వివరిస్తామన్నారు. తుపాను నష్టంపై క్షేత్రస్థాయిలో వాస్తవాలను తెలుసుకోడానికి ప్రభుత్వ యంత్రాంగం పక్కాగా సర్వే నిర్వహించిందన్నారు.

9 మండలాలపై తీవ్ర ప్రభావం

మురసు తుపానుతో బాపట్ల జిల్లా అపార నష్టానికి గురైందని జిల్లా కలెక్టర్‌ డాక్టర్‌ వినోద్‌ కుమార్‌ తెలిపారు. 15 మండలాలు తుపాను ప్రభావానికి గురి కాగా, అందులో 9 మండలాలు బాగా దెబ్బతిన్నాయన్నారు. మార్టూరు మండలంలో అత్యధిక వర్షపాతం నమోదు కాగా, పర్చూరు, బాపట్ల, కారంచేడు మండలాలలో 21 గ్రామాలు నీట మునిగాయన్నారు. ముగ్గురు వ్యక్తులు మరణించగా, 28 జీవాలు మృతి చెందాయన్నారు. 1,470 గృహాలు నీట మునిగాయని తెలిపారు. 153 పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేశామన్నారు. నిరాశ్రయులైన 11,507 మందికి ఆశ్రయంతో పాటు భోజన వసతి కల్పించామని తెలిపారు. మురసు తుపానుతో బాపట్ల జిల్లాకు రూ.320.49 కోట్లు నష్టం వాటిల్లిందని కలెక్టర్‌ కేంద్ర బృందానికి వివరించారు. 4,129.42 హెక్టార్లలో వ్యవసాయ పంటలు దెబ్బతిన్నాయని, రైతులకు సంబంధించిన 6,251 ట్రాక్టర్లు దెబ్బతినగా వాటి విలువ మొత్తం రూ.9.89 కోట్లు ఉంటుందన్నారు. 140.608 హెక్టార్లలో ఉద్యాన పంటలు దెబ్బతినగా వాటి విలువ రూ.45.438 లక్షలుగా అంచనా వేశామన్నారు. 302 బోట్లు, వలలు దెబ్బతినగా రూ.28.10 లక్షలు నష్టం వాటిల్లిందన్నారు. జీవనోపాధి కోల్పోయిన 13,214 మందికి నిత్యవసర సరుకులు పంపిణీ చేశామన్నారు. ప్రధానంగా 331.92 కిలోమీటర్ల మేర 94 ఆర్‌అండ్‌బీ రహదారులు, 20 వంతెనలు దెబ్బతిన్నాయని, వాటి నష్టం రూ.204.86 కోట్లుగా గుర్తించామన్నారు. ప్రధానమైన నల్లమడ, ఓగేరు వాగు, నక్క వాగు, పర్చూరు వాగు, ఆలేరు కాల్వలతోపాటు, 259 కాల్వలు దెబ్బతిన్నాయని, వాటికి రూ.55.44 కోట్లు నష్టం వాటిల్లిందన్నారు. విద్యుత్‌ శాఖకు రూ.22.39 కోట్లు నష్టం వాటిల్లిందన్నారు. 6,647 గృహాలు దెబ్బతినగా వాటి విలువ రూ.7.98 కోట్లుగా అంచనా వేశామన్నారు. పంచాయతీరాజ్‌ రహదారులకు రూ.10.41 కోట్లు నష్టం వాటిల్లిందని పేర్కొన్నారు. బాపట్ల, రేపల్లె, చీరాల మున్సిపాలిటీలలో కాల్వలు, రహదారులు దెబ్బతినగా, విద్యుత్‌ సరఫరా వ్యవస్థకు రూ.3.11 కోట్లు నష్టం వాటిల్లిందన్నారు. కేంద్ర బృందం సభ్యులు వ్యవసాయం, రైతు సంక్షేమశాఖ అదనపు అభివృద్ధి కమిషనర్‌ ప్రశాంత్‌ ఆర్మోరికర్‌, కేంద్ర ఆర్థిక, వ్యయ మంత్రిత్వశాఖ సహాయ సంచాలకులు హిమాలయ గార్గ్‌, విద్యుత్‌ మంత్రిత్వశాఖ, కేంద్ర విద్యుత్‌ ప్రాధికార సంస్థ ఉప సంచాలకులు ప్రణయ్‌ గర్గ్‌, రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ డైరెక్టర్‌ ప్రఖర్‌ జైన్‌, జిల్లా రెవెన్యూ అధికారి లవన్న, వివిధ శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు.

ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తాం..

మురసు తుఫాను ప్రభావంతో నష్టంపోయిన వారిన్ని ఆదుకునేందుకు ప్రభుత్వం దృష్టికి తీసుకుపోతామని కేంద్ర హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ సంయుక్త కార్యదర్శి, బృందం నాయకుడు చిత్తరంజన్‌ దాస్‌ పేర్కొన్నారు. మురసు తుపాను కారణంగా జరిగిన నష్టాన్ని పరిశీలించేందుకు వచ్చిన కేంద్ర బృందం తొలుత బాపట్ల మండలం జమ్ములపాలెం గ్రామంలో శుక్రవారం పర్యటించింది. తుపాను ప్రభావంతో దెబ్బతిన్న వరి పంటలను పరిశీలించింది. నీట మునిగిన వరి పంట పొలాల రైతులతో మాట్లాడి వివరాలు అడిగి తెలుసుకుంది. వరి పంటకు ప్రధానమంత్రి ఫసల్‌ బీమా వర్తిస్తుందా, లేదా అని తెలుసుకున్నారు. చినగంజాం మండలం కడవకుదురు గ్రామంలో ఉద్యాన పంటలకు జరిగిన నష్టాలను, కారంచేడు మండలం కారంచేడు గ్రామంలో కొమ్మూరు కాలువ, రహదారులు, సాగునీటి వ్యవస్థలకు జరిగిన నష్టాలను కేంద్ర బృందం క్షేత్రస్థాయిలో పరిశీలించింది. కాలువ ఉధృత ప్రవాహానికి సంభవించిన నష్టాలను పర్చూరు శాసనసభ్యుడు ఏలూరు సాంబశివరావు కేంద్ర బృందం దృష్టికి తీసుకువచ్చారు. పర్చూరులోని ఇందిరా కాలనీలో నేలమట్టమైన గృహాలను కేంద్ర బృందం పరిశీలించి బాధిత కుటుంబాల పరిస్థితులను అడిగి తెలుసుకున్నారు. ప్రధానమంత్రి ఆవాసన యోజన పథకంలో ఇళ్ల నిర్మాణం చేపట్టాలని అధికారులకు సూచించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement