మత్స్యకారులు వేటకు వెళ్లొద్దు
చేప పడదు.. పూట గడవదు
● కష్టాల సుడిగుండంలో మత్స్యకారులు ● వరుస తుఫాన్లు, వర్షాలతో తప్పని శోకం
చీరాల టౌన్: ఉత్సాహంగా చేపల వేటకు వెళ్లే గంగపుత్రులు నేడు నిరాశలో మునిగిపోతున్నారు. వరుస వాయుగుండాలు, తుఫాన్ల కారణంగా కురుస్తున్న వర్షాలతో సముద్రంలో వేట సాగక మత్స్యకారుల బతుకులు భారంగా మారాయి. వేట తప్ప మరో పని తెలియని గంగపుత్రులు కష్టాల సుడిగుండంలో చిక్కుకుని విలవిల్లాడుతున్నారు. బాపట్ల జిల్లాలోని చీరాల, బాపట్ల, రేపల్లె, పర్చూరు నియోజకవర్గాల్లో సముద్ర తీరం ఉంది. సుమారు 50 వేల మంది మత్స్యకారులు ఉన్నారు. తీరప్రాంత గ్రామాల్లో 1,549 ఇంజిన్ బోట్లు, 2,283 సంప్రదాయ బోట్లు ఉన్నాయి. తీర ప్రాంతాల్లోని 20 వేల మత్స్యకార కుటుంబాలకు కడలే ఆధారం. కానీ నెలన్నర నుంచి వాతావరణం అనుకూలించడం లేదు. ఫలితంగా తీరం ఒడ్డున బోట్లు, వలలను నిలిపివేసి అర్ధాకలితో అలమటిస్తున్నారు.
వరుస విపత్తులు
ప్రతి ఏటా అక్టోబర్, నవంబర్, డిసెంబర్ నెలల్లో సముద్రంలో మత్స్య సంపద అధికంగా లభిస్తుంటుంది. అయితే గత నెల రోజుల నుంచి అర్నబ్, మురసు తుఫాన్లు మత్స్యకారుల జీవనానికి అడ్డంకిగా మారాయి. తీర ప్రాంతమైన వాడరేవు నుంచి మత్స్య సంపదను బెంగళూరు, కోల్‌కతా, చైన్నె, విజయవాడ, కేరళ, ఈరోడ్, ఒడిశా ప్రాంతాలకు ఎగుమతి చేస్తుంటారు. గత నెల నుంచి సముద్రంలో వేట సరిగా లేకపోవడంతో మత్స్య ఉత్పత్తుల ఎగుమతులు నిలిచిపోయాయి. ఒక్కో బోటుకు ఆరుగురు చొప్పున మత్స్యకారులు డీజిల్ పోయించుకుని వేటకు వెళ్లినా కనీసం డీజిల్ ఖర్చులు కూడా రావడం లేదని మత్స్యకారులు వాపోతున్నారు.
ప్రభుత్వం ఆదుకోవాలని వేడుకోలు
వేట తప్ప మరో పని తెలియని గంగపుత్రులు గత రెండు నెలలుగా తుఫాన్ల కారణంగా వేట సాగక పూట గడవక ఇబ్బందులు పడుతున్నారు. ప్రభుత్వం స్పందించి గంగపుత్రులను ఆదుకోవాలని వేడుకుంటున్నారు. వేట సక్రమంగా సాగకపోవడంతో కుటుంబ పోషణకు ఇబ్బందులు పడుతున్నామని, తుఫాన్ల సమయంలో మత్స్యకారుల సంక్షేమానికి ప్రత్యేక చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.
చీరాల మత్స్యకారులు ఎవరూ సముద్రంలోకి వేటకు వెళ్లకూడదు. పర్యాటకుల ప్రవేశాలను నిలిపివేశాం. వర్షాలు తగ్గి సాధారణ పరిస్థితులు నెలకొనేంత వరకు తీర ప్రాంత గ్రామాల్లో రెవెన్యూ, పోలీసు సిబ్బందితో ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నాం.
– కుర్రా గోపికృష్ణ, తహసీల్దార్
సాధారణంగా వాడరేవు మత్స్యకారులు కృష్ణా జిల్లా మచిలీపట్నం, నెల్లూరు జిల్లా రామాయపట్నం వరకు వేటకు వెళ్లి గురక, పాములు, బొంత, కూనాము, వంజరం, పండుగప్పలు వంటి చేపలను పట్టుకొస్తుంటారు. కానీ రెండు నెలల నుంచి వర్షాలు, తుఫాన్ల కారణంగా సముద్రంలో వేట సాగడం లేదు. ప్రస్తుతం మత్స్యకారులు తమ బోట్లు, వలలను తీరం ఒడ్డున నిలిపివేసి, వేట లేక కుటుంబ పోషణ కోసం ఇబ్బందులు పడుతున్నారు.


