7,383 ఎకరాలలో వాణిజ్య పంటలకు.. 4,725 ఎకరాలలో వరికి దక్కని
పంట నష్ట పరిహారం
మోంథా తుఫాన్ పంట నష్ట పరిహారం చెల్లింపులో చంద్రబాబు ప్రభుత్వం మొండిచేయి
రగులుతున్న అన్నదాతలు
ఓటుతో గుణపాఠం చెప్పేందుకు సిద్ధం
కొల్లూరు: ప్రకృతి విపత్తుల రూపంలో పంటలు కోల్పోయిన అన్నదాల ఆక్రందనలు పట్టని ప్రభుత్వంపై ఎన్నికల వేళ రైతన్నలు కన్నెర చేస్తున్నారు. కృష్ణా నది వరదలు పొట్టన పెట్టుకున్న పంటలకు తోడు.. మోంథా తుఫాన్ దాటికి నష్టపోయిన పంటకు పరిహారం చెల్లించకుండా రైతుల కష్టాన్ని గాలికొదిలేసి మొండి చేయి చూపిన చంద్రబాబు ప్రభుత్వంపై అన్నదాతలలో ఆక్రోశం వ్యక్తమవుతుంది. పంట నష్ట పరిహారం చెల్లించకుండా రైతులను చిన్న చూపు చూసిన చంద్రబాబు ప్రభుత్వం స్థానిక సంస్థల ఎన్నికలలో ఓట్ల పంట పండించుకోవాలని పన్నాగాలు పన్నడంపై రైతాంగంలో అసంతృప్తి జ్వాలలు రగులుతున్నాయి. పంట నష్టంతో అప్పులపాలై కర్షకులు కడుపు తరక్కుపోతున్నా విపత్తుల పరిహారం ఊసే ఎత్తని చంద్రబాబు కేంద్రం నుంచి డిసెంబర్‌లోపు నిధులు తెచ్చుకొని పబ్బం గడుపుకొనేందుకు ఎన్నికల పేరుతో మరో మారు ప్రజలను.. రైతులను మోసం చేయడానికి సిద్ధమైపోవడం రైతుల గుండెల్ని రగిలుస్తుంది.
వరదలతో అపార నష్టం
చంద్రబాబు ప్రభుత్వంలో 2025లో కృష్ణా నదికి సంభవించిన వరదల కారణంగా వేలాది ఎకరాల్లో వాణిజ్య పంటలు ముంపు బారిన పడి రైతులు అపార నష్టం మూటగట్టుకున్నారు. వరదలు తగ్గుముఖం పట్టిన వెంటనే పంట నష్ట పరిహారం పేరుతో నష్ట నమోదు ప్రక్రియతో హడావిడి చేసిన ప్రభుత్వం అనంతరం పరిహారం ఊసెత్తకపోవడంతో రైతులకు రూ. వందల కోట్ల నష్టం వాటిల్లింది. పంట నష్టం కారణంగా అప్పులపాలై మండలంలోని దోనేపూడి, పోతార్లంకలలో ఇరువురు రైతులు సైతం బలవన్మరణాలకు పాల్పడ్డారు. రైతుల ఆత్మహత్యలు చేసుకుంటున్నా కనువిప్పు కలగని ప్రభుత్వం మోంథ తుపాను వల్ల నష్ట పోయిన పంటలకు సైతం పరిహారం చెల్లించకుండా దాటవేత ధోరణితో అన్నదాతలను చిన్నచూపు చూడటంతో రైతులు అప్పుల ఊబిలో కూరుకుపోయారు. వరదల కారణంగా కొల్లూరు, భట్టిప్రోలు మండలాల పరిధిలో 5, 458 ఎకరాలలో పసుపు, కంద, అరటి, కూరగాయల పంటలు పనికిరాకుండా పోయి 4, 427 మంది రైతులు దెబ్బతిన్నట్లు అప్పట్లో నష్ట పరిహార బృందాలు పంట నష్టం నమోదు చేసి ప్రభుత్వానికి నివేదించాయి. వరద తాకిడికి తట్టుకొని నిలబడిన అరటి తోటలపై మోంథా తుపాను విరుచుకుపడటంతో రెండు మండలాలలో 1,925 ఎకరాల్లో అరటి పంట దెబ్బతిని 1,394 మంది రైతులు నష్టాల పాలయ్యారు. ఖరీప్‌లో సాగైన వరి పంటపై మోంథా తుఫాన్ ప్రభావం తీవ్రంగా పడటంతో ఒక్క కొల్లూరు మండలంలోనే సుమారు 4,725 ఎకరాలలో వరి పంట పనికిరాకుండా పోయి, ఇంచుమించు 2, 300 మంది రైతులు కోలుకోలేని నష్టాలకు గురయ్యారు.
మోంథాకే దిక్కులేదు.. ఇక అర్నబ్, మురసులకా..?
పంట నష్ట పరిహారం చెల్లించకుండా రైతుల గోడు పట్టించుకోని చంద్రబాబు ప్రభుత్వానికి అర్నబ్.. మురసు తుఫాన్‌ల కారణంగా తాజాగా పంట నష్టపోయిన రైతుల గోడు చెవికెక్కుతుందా అన్న సందేహం రైతులను పట్టి పీడిస్తుంది. 2025లో సంభవించిన కృష్ణా నది వరదలు, మొంథా తుపాను నష్టాల నుంచి కోలుకోని రైతులపై అర్నబ్.. మురసు విరుచుకుపడటంతో తీవ్ర పంట నష్టానికి గురై నిరాశ, నిశృహలకు గురవుతున్నారు. ఎన్నికలకు ముందు సంభవించిన నష్టాల మాటే ఎత్తని చంద్రబాబుకు, ఎన్నికల అవరసం తీరిపోయాక రైతుల కష్టాలు కనిపిస్తాయా అన్న సందేహం రైతులకు నిద్ర పట్టకుండా చేస్తుంది. కేవలం కేంద్ర ప్రభుత్వం జనాభ ప్రాతిపధికన కేటాయించే నిధుల కోసమే ఎన్నికలకు వెళ్లిన చంద్రబాబు రైతుల గోడు పట్టకపోవడం.. గెలుపు కోసం రైతుల ముందు ఓట్లు వేయమని చేతులు జాస్తున్న నేతలకు రైతు కనిపిస్తాయా అన్న అంతర్మథనంలో సతమతమవుతున్నారు.


