నాలుగు వందల ఏళ్ల చరిత్ర గల చీరాల 1919లోనే చీరాల పురపాలక సంఘం ఏర్పాటు
మున్సిపాలిటీ ప్రొఫైల్..
చీరాల: బ్రిటిషు పాలకులకు వ్యతిరేకంగా పోరాడిన పురిటిగడ్డ.. చైతన్యానికి, నాగరికతకు మారుపేరు స్వాతంత్రోద్యమంలో చీరాల ప్రాంత పాత్ర మరువలేం. గాంధీ ఈ ప్రాంత ప్రజల పోరాటాన్ని మెచ్చుకుని స్వయంగా వచ్చారు. స్వాతంత్రోద్యమంలో దేశం కోసం జైలుకు వెళ్లిన మొదటి మహిళ అలివేలు మంగతాయారు చీరాల వాసి. 400 సంవత్సరాల చరిత్ర గల చీరాల పట్టణం నిత్య చైతన్యంతో ముందుకు సాగుతోంది. పాడిపంటలకు ప్రసిద్ధిగాంచిన చీరాలను క్షీరాల అనే పదంతో పుట్టిన క్షీరపురి అనేవారు. కాలక్రమేణ చీరాలగా రూపాంతరం చెందింది. చీరాల–పేరాల రెండు పంచాయతీలుగా ఉండేది. 1918లో ప్లేగు వ్యాధి వ్యాపించడంతో అనేక మంది చనిపోయారు. ఈ విషయాన్ని అప్పటి యూనియన్ చైర్మన్‌గా ఉన్న రావూరి సుబ్బారావు బ్రిటిష్ ప్రభుత్వానికి నివేదించారు. మరణాలపై విచారణకు వచ్చిన కమిటీ పారిశుద్ధ్య సమస్య తీవ్రంగా ఉండడం వలనే వ్యాధి వచ్చిందని నిర్ధారించి, దీనిని నివారించాలంటే 2 పంచాయతీలను కలిపి మున్సిపాలిటీగా చేయాలని 1919లో నిర్ణయించారు. 1920 ఏప్రిల్‌లో సబ్‌కలెక్టర్ చైర్మన్‌గా నామినేటెడ్ సభ్యులతో పురపాలక సంఘాన్ని ఏర్పాటు చేశారు. ఈ నిర్ణయాన్ని పట్టణ ప్రజలు వ్యతిరేకించి నామినేటెడ్ సభ్యులతో రాజీనామా చేయించి పురపాలక రద్దుకు ఉద్యమించారు. అప్పటి తహసీల్దార్‌ను వైస్‌చైర్మన్‌గా నియమించి బ్రిటిష్ ప్రభుత్వం ప్రజలపై మరింత పన్ను భారాన్ని మోపింది. 1921లో దుగ్గిరాల గోపాల కృష్ణయ్య పిలుపు మేరకు పన్నులకు వ్యతిరేకంగా చీరాల–పేరాల పేరుతో ఉద్యమం జరిగింది. పట్టణ ప్రజలంతా పురబహిష్కరణ చేసి రామనగర్‌లో గుడిసెలు వేసి కొద్దిరోజులు నివాసమున్నారు. బ్రిటిష్ ప్రభుత్వం శ్రీకాకుళం సుబ్రహ్మణ్యాన్ని చైర్మన్‌గా, మరికొందరు సభ్యులతో పురపాలక సంఘాన్ని ఏర్పాటు చేయగా.. తర్వాత రావుల సుబ్బారావు, మద్ది రంగనాయకులు, నూనె పానకాలు, వూటుకూరి రామయ్య శేష్ట్రి పురపాలక చైర్మన్లుగా నియమితులయ్యారు. ఉమ్మడి మద్రాసు రాష్ట్రానికి మంత్రి అయిన బెజవాడ గోపాలరెడ్డి ఉద్యమ సమయంలో ఇచ్చిన హామీని నెరవేరుస్తూ పురపాలక సంఘాన్ని రద్దు చేశారు. మరలా చీరాల–పేరాలలు పంచాయతీగా ఏర్పడ్డాయి. చీరాలకు ఊటుకూరి ఉపేంద్ర గుప్తా, పేరాలకు రావుల దేవేంద్రనాథం పంతులు అధ్యక్షులుగా నియమితులయ్యారు. 1948లో చీరాల పేరాలను కలిపి పురపాలక సంఘంగా ఏర్పాటు చేశారు.
చిన ముంబయి
చీరాలకు వస్త్ర వ్యాపారంలో ముంబయి తర్వాత అంత పేరుంది. చిన ముంబయిగా పిలుస్తుంటారు. హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్నం తదితరల ప్రాంతాల నుంచి వస్త్రాలను కొనుగోలు చేసేందుకు వస్తుంటారు. వెయ్యికి పైగా వస్త్ర దుకాణాలున్నాయి. ముఖ్యంగా ఇక్కడ తక్కువ ధరకు నాణ్యమైన చీరలు దొరుకుతాయని ప్రసిద్ధి. నిత్యం వేల మంది ఇతర ప్రాంతాల నుంచి వచ్చి కొనుగోలు చేస్తుంటారు.
పురపాలకులు వీరే...
1948లో చీరాల పేరాలను కలిపి పురపాలక సంఘంగా ఏర్పాటు అయిన తర్వాత అనేక మంది ప్రముఖులు చీరాలను పరిపాలించారు. తొలి చైర్మన్ అన్నదాత నాగేంద్రుడు 1948–1951, వడ్డే నాగేశ్వరరావు సుదీర్ఘకాలంపాటు చైర్మన్‌గా వ్యవహరించారు. 1953–1954, రెండోసారి 1959–1964 వరకు, తిరిగి 1967–1972 వరకు మూడుసార్లు మున్సిపల్ చైర్మన్‌గా పనిచేశారు. అనంతరం ఆయన మున్సిపల్ శాఖామంత్రిగా పనిచేశారు. రావుల హరిప్రసాదరావు 1954 –1956, తులాబందుల వెంకటప్పయ్య 1981 –1986, తిరువీధుల దశరథ రామయ్య 1987 –1992, బొనిగల అశోక్‌కుమార్ 1995–1999, అందె కస్తూరిబాయి 2000–2005, తిరువీధుల నాగలక్ష్మి శ్యామలాకుమారి 2005–2010 వరకు, మోదడుగు రమేష్‌బాబు 2014–2019 వరకు, జంజనం శ్రీనివాసరావు 2021–2025 వరకు, మించాల సాంబశివరావు 2025–2026 వరకు మున్సిపల్ చైర్మన్‌లుగా వ్యవహరించారు.
ఓటర్లు : 69,557
పురుషులు : 33,504
మహిళలు : 36,043
ఇతరులు : 10
ఎస్సీలు : 15,604
ఎస్టీలు : 3,838
బీసీలు : 27,948
ఓసీలు : 22,167
వార్డులు : 44
పోలింగ్ బూత్‌లు : 88


