జిల్లా కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్
బాపట్ల: స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి జిల్లా అధికారులు, నోడల్ అధికారులు వారికి కేటాయించి విధులకు సంబంధించిన వివరాలను ప్రతిరోజూ వాట్సాప్ గ్రూపులో అప్‌లోడ్ చేయాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్ తెలిపారు.
ఆదివారం సాయంత్రం జిల్లా కలెక్టరేట్‌లోని న్యూ వీడియో కాన్ఫరెన్స్ హాల్‌లో ఎన్నికల నోడల్ అధికారులతో సమావేశం నిర్వహించారు. జిల్లాలో చేపట్టనున్న ఎన్నికల నిర్వహణపై కలెక్టర్ సమీక్షించారు. కలెక్టర్ మాట్లాడుతూ ఎన్నికల ప్రక్రియ సజావుగా జరిగేలా ముందస్తు ఏర్పాట్లు చేసుకోవాలని నోడల్ అధికారులను ఆదేశించారు. ఎన్నికల నిర్వహణకు అవసరమైన వివిధ రకాల టీమ్స్ ఏర్పాటు చేశామని, వారందరికి శిక్షణ ఇస్తామని తెలిపారు. సంబంధిత శాఖల మధ్య సమన్వయంపై ప్రత్యేక దృష్టి సారించాలని సూచించారు. ఎక్కడా కూడా ఎన్నికల కోడ్ ఉల్లంఘనలు జరగకుండా పర్యవేక్షించాలని ఆదేశించారు. ఎన్నికల కమిషన్ మార్గదర్శకాలకు అనుగుణంగా విధులు నిర్వహిస్తూ, ఎన్నికల ప్రక్రియలో పారదర్శకత, నిష్పక్షపాత ధోరణి పాటించేలా చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు. ఎంపీటీసీ, జెడ్పీటీసీ, గ్రామ పంచాయతీ ఎన్నికలు నిర్వహించనున్న నేపథ్యంలో సంబంధిత అధికారులు ఇప్పటి నుంచే అవసరమైన కార్యాచరణ రూపొందించుకుని సిద్ధంగా ఉండాలని జెడ్పీ సీఈఓను ఆదేశించారు. ఎన్నికలకు సంబంధించి అధికారులకు, సిబ్బందికి జిల్లాస్థాయిలో జిల్లా కలెక్టర్ ఆధ్వర్యంలో, డివిజన్ స్థాయిలో ఆర్డీవో స్థాయిలో మాస్టర్ ట్రైనర్స్‌తో శిక్షణ ఇచ్చేందుకు షెడ్యూల్ ను తయారు చేయాలని డ్వామా పీడీని ఆదేశించారు. మెటీరియల్ రవాణాకు సంబంధించి అన్ని రకాల వాహనాలను సమకూర్చాలని రవాణా శాఖ అధికారిని ఆదేశించారు. జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలకు సంబంధించిన బ్యాలెట్ పేపర్లను పోస్టల్ బ్యాలెట్స్ వాటికి సంబంధించి ఈ ఈ పంచాయతీరాజ్ పర్యవేక్షించాలన్నారు. ఎన్నికల్లో విధుల్లో పాల్గొనే ప్రతి ఉద్యోగి తప్పనిసరిగా ఐడీ కార్డు ధరించాలని, ఐడీ కార్డులకు సంబంధించి పంపిణీ చేయాలని జిల్లా కలెక్టరేట్ ఏఓను ఆదేశించారు. సమావేశంలో ఇన్‌చార్జి డీఆర్వో లవన్న, జెడ్పీ సీఈఓ సీహెచ్.విజయలక్ష్మి, డీఆర్డీఏ, డ్వామా పీడీలు బి.సింగయ్య, విజయలక్ష్మి, డీపీఓ నరేష్‌కుమారి, ఎస్‌ఎస్‌ఏ పీఓ శ్రీనివాసులు, సీపీఓ ఏ.ఎస్.రాజు, జిల్లా స్వర్ణ గ్రామ, స్వర్ణ వార్డుల అధికారి రాజేష్, గ్రామ, వార్డు సచివాలయం జిల్లా కోఆర్డినేటర్ యశ్వంత్, షఫి, జిల్లా కలెక్టరేట్ సిబ్బంది పాల్గొన్నారు.


