నామినేషన్ల వేళ పోలీసుల అత్యుత్సాహం | - | Sakshi
Sakshi News home page

నామినేషన్ల వేళ పోలీసుల అత్యుత్సాహం

Oct 19 2026 4:01 AM | Updated on Oct 19 2026 4:01 AM

వైఎస్సార్‌ సీపీకి ఆంక్షలు.. కూటమికి వెసులుబాటు మంత్రి అనగాని సమక్షంలో 25 మందికిపైగా అనుమతి వైఎస్సార్‌ సీపీ సమన్వయకర్త మోహన్‌కృష్ణను అడ్డుకున్న డీఎస్పీ నామినేషన్ల కవరేజీకి వెళ్లిన మీడియాకూ అడ్డంకులు

మంత్రి వస్తే ఓకే...

అడ్డుకున్న డీఎస్పీ

రేపల్లె: మున్సిపల్‌ ఎన్నికల నామినేషన్ల వేళ పోలీసుల వ్యవహారశైలి వివాదాస్పదంగా మారింది. నామినేషన్ల కేంద్రం వద్ద అనుమతుల విషయంలో పోలీసులు అధికార, ప్రతిపక్ష పార్టీలకు వేర్వేరు నిబంధనలు అమలు చేశారన్న ఆరోపణలు తీవ్ర చర్చకు దారితీశాయి. వైఎస్సార్‌ సీపీ నేతలను ఆంక్షల పేరుతో అడ్డుకున్న పోలీసులు, కూటమి అభ్యర్థి నామినేషన్‌ సమయంలో మాత్రం వెసులుబాటు కల్పించారన్న విమర్శలు తీవ్రంగా వినిపిస్తున్నాయి.

మీడియా ప్రతినిధులకూ అడ్డంకులు

నామినేషన్ల ప్రక్రియను కవరేజీ చేసేందుకు వెళ్లిన మీడియా ప్రతినిధులను సైతం డీఎస్పీ అబ్దుల్‌ అజీజ్‌ లోపలికి వెళ్లకుండా అడ్డుకున్నారు. ఎన్నికల ప్రక్రియలో జరిగే పరిణామాలను ప్రజలకు చేరవేయాల్సిన జర్నలిస్టులకు ఆటంకాలు ఎదురుకావడం ఆందోళన కలిగిస్తోంది. దీనికి ఎలాంటి నిబంధనలు అమలు చేశారు? గుర్తింపు కార్డులు కలిగిన ప్రతినిధులందరికీ ఒకే విధానం పాటించారా? అనే ప్రశ్నలకు సమాధానం రావాల్సి ఉంది. అయితే, కూటమి అభ్యర్థితో పాటు మంత్రి నామినేషన్‌కు వెళ్లిన సమయంలో ఆయన ప్రైవేటు ఫొటోగ్రాఫర్లకు సైతం అనుమతినిచ్చి, మీడియాను అడ్డుకోవడం పోలీసుల దుశ్చర్యను తెలియజేస్తోంది. ముఖ్యంగా, వైఎస్సార్‌ సీపీ ప్రతినిధులు, మీడియా ప్రతినిధులపై డీఎస్పీ అబ్దుల్‌ అజీజ్‌ కఠినంగా వ్యవహరిస్తూ, కూటమి అభ్యర్థులకు వత్తాసు పలుకుతున్నారనే విమర్శలు వ్యక్తం అవుతున్నాయి.

మరోవైపు, మంత్రి అనగాని సత్యప్రసాద్‌ సమక్షంలో కూటమి అభ్యర్థి కుర్రా అవర్ణ నామినేషన్‌ సందర్భంగా 25 మందికి పైగా వ్యక్తులు నామినేషన్‌ దాఖలు కేంద్రంలోకి వెళ్లారు. ఆ సమయంలో అక్కడే ఉన్న డీఎస్పీ అబ్దుల్‌ అజీజ్‌ వారిని అడ్డుకోకుండా మౌనం వహించడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. భద్రత, రద్దీ నియంత్రణ కోసం నామినేషన్ల కేంద్రం వద్ద ఆంక్షలు విధించడం సమంజసమే. కానీ ఆ నిబంధనలు అందరికీ సమానంగా వర్తించాలి. వైఎస్సార్‌ సీపీ సమన్వయకర్తను నిబంధనల పేరుతో అడ్డుకున్న పోలీసులు, కూటమి అభ్యర్థి విషయంలో మాత్రం మంత్రి సత్యప్రసాద్‌ను చూసి ఎక్కువ మందికి అవకాశం కల్పించడంపై ప్రజలు, ప్రజాసంఘాలు ఇదెక్కడి న్యాయమంటూ ప్రశ్నిస్తున్నాయి.

వైఎస్సార్‌ సీపీ నియోజకవర్గ సమన్వయకర్త మోహన్‌కృష్ణ... చైర్‌పర్సన్‌ అభ్యర్థి చిమటా లక్ష్మితో కలిసి ఆదివారం నామినేషన్‌ దాఖలుకు కేంద్రానికి వెళ్తున్న క్రమంలో డీఎస్పీ అబ్దుల్‌ అజీజ్‌ అడ్డుకున్నారు. నామినేషన్‌ దాఖలు చేసే అభ్యర్థితో పాటు మరో ఇద్దరికే అనుమతి ఉందని, పీటా వెళ్లడానికి వీల్లేదంటూ అడ్డుగా నిలిచారు. మూడు నామినేషన్లు దాఖలు చేస్తున్నామని, అభ్యర్థులను బలపరచడానికి వెళ్తున్నామని చెప్పినా వినకుండా డీఎస్పీ వాదనకు దిగారు. తమకు మూడు నామినేషన్లు ఉన్నాయని, ఇదే నిబంధనను మంత్రి సత్యప్రసాద్‌కు వర్తింపజేస్తారా అంటూ మోహన్‌కృష్ణ ప్రశ్నించారు. కొంతసేపు వాగ్వాదం జరిగిన అనంతరం నాగమోహన్‌కృష్ణను నామినేషన్‌ కేంద్రంలోకి అనుమతించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement