గుంటూరు చానల్‌ను పర్చూరు వరకు పొడిగించే విషయంలో దగా విడుదల చేసిన నోటిఫికేషన్‌తో ప్రయోజనం లేదంటున్న అన్నదాతలు పాత జీవోనే కొద్ది మార్పుతో గెజిట్ నోటిఫికేషన్‌గా చెబుతున్నారని ఆవేదన
సాక్షి టాస్క్‌ఫోర్స్: గుంటూరు చానల్‌ను పర్చూరు వరకు పొడిగించి ప్రజలకు తాగునీరు, రైతులకు సాగునీరు అందించే విషయంలో కూటమి ప్రభుత్వం మరోమారు దగా చేసిందనే వాదనలు వినిపిస్తున్నాయి. పర్చూరు ప్రాంత రైతులను, ప్రజలను దారుణంగా మోసగించిందనే విమర్శలు వస్తున్నాయి. కొన్ని దశాబ్దాలుగా పర్చూరు ప్రాంత రైతులు, ప్రజలు సాగునీరు, తాగునీటి కోసం తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అందు కోసం దశాబ్దాలుగా నిర్విరామ పోరాటాలు చేస్తూ వస్తున్నారు. ఇటీవల కాలంలో నల్లమడ రైతు సంఘం అధ్యక్షుడు డాక్టర్ కొల్లా రాజమోహనరావు ఆధ్వర్యంలో పర్చూరులో పాదయాత్రలు, పలు నిరసన కార్యక్రమాలను ఉధృతంగా చేపట్టారు. ప్రభుత్వం కదలి రాకపోవడంతో పర్చూరు ప్రాంత రైతులు నిరవధిక నిరాహార దీక్షను సైతం చేపట్టారు. స్థానిక శాసన సభ్యులు ఏలూరి సాంబశివరావు చొరవ తీసుకొని గుంటూరు చానల్ పొడిగింపునకు సంబంధించి గెజిట్ నోటిఫికేషన్ 10 రోజుల్లో విడుదల చేయిస్తానని హామీ ఇచ్చారు. దీంతో సెప్టెంబర్ ఒకటిన నల్లమడ రైతులు, పర్చూరు ప్రాంత రైతులు చేస్తున్న నిరాహార దీక్షను విరమింపజేశారు. అటు తరువాత సెప్టెంబరు 18న గుంటూరు చానల్ పర్చూరు వరకు పొడిగింపు అంటూ గెజిట్ నోటిపికేషన్ విడుదల చేయించారు. గుంటూరు జిల్లా పరిటాల వారిపాలెం వరకు గతంలోనే విడుదల చేసిన నోటిఫికేషన్‌తో ఆ జిల్లాలో పనులు జరుగుతున్నాయి. తొండె వాగు వరకు చానల్ పొడింగింపునకు సంబంధించి నోటిఫికేషన్ విడుదల చేయడంలో అర్థం లేదనే వాదనలు వినిపిస్తున్నాయి. గతంలో పరిటాల వారిపాలెం నుంచి తొండె వాగు వరకు డ్రైనేజీగా ఆ ప్రాంతంలో కాలువ కొనసాగుతోందని రైతులంటున్నారు. నోటిఫికేషన్ విడుదలై 41 రోజులు దాటినప్పటికీ ఇప్పటి వరకు ఎటువంటి పనులు చేపట్టక పోవడంపై రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మోసపూరితమైన నోటిఫికేషన్‌తో పర్చూరు ప్రాంత రైతులు, ప్రజలను నమ్మించి ప్రభుత్వం మోసం చేసిందని వాపోతున్నారు. రైతులకు ఎంతోమేలు చేసినట్లుగా డప్పు కొట్టుకోవడం మినహా కూటమి ప్రభుత్వం దారుణంగా దగా చేసిందని అర్థమవుతోందని రైతులు అంటున్నారు.
నల్లమడ రైతుల పట్టు
గుంటూరు చానల్‌ను తొండె వాగు వరకు పొడిగించడం ద్వారా పర్చూరు ప్రాంతానికి ఎటువంటి ప్రయోజనం చేకూరదని.. చానల్‌ను పూర్తి స్థాయిలో పర్చూరు వరకు పొడిగించాలని నల్లమడ రైతులు, పర్చూరు ప్రాంత రైతులు ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు. ప్రభుత్వం ఇప్పటి వరకు చేసిన, చేస్తున్న వాగ్దానాలతో పర్చూరు ప్రాంతానికి ఎటువంటి ప్రయోజనం జరిగే అవకాశం లేదన్నారు. గెజిట్ నోటిఫికేషన్లో ఇచ్చిన విధంగా తొండవాగు వరకు పొడిగించిన చానల్‌ను పర్చూరు ప్రాంతవరకు తీసుకొని రావాలనే డిమాండ్ చేస్తున్నట్లు రైతులు తెలిపారు. లేకపోతే నల్లమడ రైతు సంఘం ఆధ్వర్యంలో ఆందోళనలు చేపట్టేందుకు సిద్ధమవుతామని హెచ్చరిస్తున్నారు.
ప్రభుత్వం విడుదల చేసిన గెజిట్ నోటిఫికేషన్‌తో తమ ప్రాంతానికి ఎటువంటి ప్రయోజనం లేదంటూ పర్చూరు ప్రాంత రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. గెజిట్ నోటిఫికేషన్లో చానల్ పొడిగింపు 70.900 నుంచి 75.035 కి.మీ వరకు ఉంటుందని ప్రకటించారు. అయితే 70.900 కి.మీ అనేది గుంటూరు జిల్లా సరిహద్దు గ్రామమైన పరిటాల వారిపాలెం నుంచి ఏదుబాడు సమీప ప్రాంతం ఏడారి మాదిగ పల్లె వద్ద ఉన్న తొండె వాగు వరకు మాత్రమే. ఈ 4 కి.మీ. మేర పొడిగిస్తున్నట్లుగా ఉంది. నిజానికి పర్చూరు ప్రాంతానికి నీరందించేందుకు గుంటూరు జిల్లా పరిటాల వారి పాలెం నుంచి పర్చూరు వరకు సుమారు 9 కి.మీ. మేర వాగును పొడిగించాల్సి ఉంది. ప్రభుత్వ అధికారికంగా గుంటూరు చానల్‌ను పర్చూరు ప్రాంతం వరకు పొడిగింపు అని హామీలు గుప్పిస్తున్నప్పటికీ నోటిఫికేషన్లో మాత్రం కేవలం 4 కి.మీ. మేర అని ప్రకటించింది. పర్చూరు ప్రాంతానికి పూర్తి స్థాయిలో నీరందించాలంటే మరో 5 కి.మీ. చానల్‌ను పొడిగించాల్సి అవసరం ఉందని రైతులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.


