నోట్ల కట్టలు చూపెట్టు.. సీటు పట్టు..! | - | Sakshi
Sakshi News home page

నోట్ల కట్టలు చూపెట్టు.. సీటు పట్టు..!

Oct 17 2026 3:09 AM | Updated on Oct 17 2026 3:09 AM

గుంటూరు తూర్పు నియోజకవర్గంలోని టీడీపీ ప్రజాప్రతినిధి హుకుం డబ్బులు ఉంటేనే టికెట్‌ అంటూ బహిరంగంగానే వ్యాఖ్యలు పార్టీని నమ్ముకుని కష్టపడిన సీనియర్‌లకు మొండిచేయి

పెరుగుతున్న అసంతృప్తి

పట్నంబజారు: టీడీపీలో డబ్బు తప్ప ఇంకేమీ పదవులు ఇచ్చేందుకు కొలమానం కాదనే విషయం మరోమారు రుజువు అవుతోంది. కార్పొరేషన్‌ ఎన్నికల నేపథ్యంలో గుంటూరు తూర్పు నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ నేతల్లో అగ్గి రాజుకుంది. ఎన్నికల వేడి మొదలైన నేపథ్యంలో స్థానిక ప్రజాప్రతినిధి వ్యవహరిస్తున్న తీరు తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఆ పార్టీలో నెలకొన్న పరిణామాలు, తూర్పు నియోజకవర్గ ప్రజాప్రతినిధి వ్యవహరిస్తున్న తీరుతో టీడీపీ నేతలే విసిగిపోతున్నారు. పార్టీని నమ్ముకుని దశాబ్దాలుగా సేవలందించిన సీనియర్‌ నాయకులను కాదని, కేవలం ఆర్థిక బలమే ప్రాతిపదికగా సాగుతున్న వసూళ్ల పర్వం ఇప్పుడు కార్యకర్తల్లో తీవ్ర ఆవేదనకు, ఆగ్రహానికి కారణమవుతోంది.

ఆర్థికంగా పెను భారం

గుంటూరు తూర్పు నియోజకవర్గంలోని మొత్తం 30 డివిజన్లు ఉన్నాయి. ఎన్నికల్లో పోటీ చేయాలని ఆశపడే ప్రతి అభ్యర్థి కచ్చితంగా డబ్బులు ఉంటేనే సీటు అని స్థానిక ప్రజాప్రతినిధి తేల్చిచెబుతున్నట్లు సమాచారం. ఆయా డివిజన్ల నుంచి పోటీ చేయదలచిన ఆశావహులు ముందస్తుగా రూ. 40 లక్షలు డిపాజిట్‌ చేయాలంటూ ప్రజాప్రతినిధి స్పష్టం చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే ఒక రోజు నామినేషన్‌ల పక్రియ ముగియటం, మరో రెండు రోజులు మాత్రమే మిగిలి ఉన్న నేపథ్యంలో ఆశావహులకు స్థానిక ప్రజాప్రతినిధి తీరు మింగుడు పడటం లేదు. ఎన్నో ఏళ్ల నుంచి కష్టపడి పనిచేస్తున్న తమకు టికెట్‌ ఎందుకు ఇవ్వరంటూ పొన్నూరు రోడ్డులోని ప్రజాప్రతినిధి కార్యాలయంలో వాదనలు, ఘర్షణలు జరగటం పరిపాటిగా మారింది. రూ.40 లక్షలు ఉంటేనే టికెట్‌ అంటూ ఒక పక్క చెబుతూనే.. మరోపక్క రూ.10 లక్షలు పార్టీ ఫండ్‌ కింద చెల్లించాలని కూడా హుకుం జారీ చేయడంపై స్థానిక టీడీపీ నేతలు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. నియోజకవర్గ చరిత్రలో ఎన్నడూ లేనివిధంగా ప్రస్తుత ప్రజాప్రతినిధి వ్యవహరిస్తున్న తీరుతో ఆ పార్టీ నేతలకే విసుగొస్తోంది.

జెండా మోసిన వారికి మొండిచేయి

టీడీపీ అధికారంలోకి రావడానికి శ్రమించి, కష్టకాలంలో జెండా మోసిన క్షేత్రస్థాయి నాయకులు, కార్యకర్తలకు ఈ పరిణామాలు తీవ్ర నిరాశను మిగుల్చుతున్నాయి. సంవత్సరాల తరబడి పార్టీ కోసం చెమటోడ్చిన వారికి మొండిచేయి చూపుతున్నారు. కేవలం ఎన్నికల వేళ ప్రత్యక్షమయ్యే ఆర్థిక బలమున్న బడాబాబులకు మాత్రమే ప్రాధాన్యం ఇస్తున్నారనే వాదనలు గట్టిగా వినిపిస్తున్నాయి. ఈ ధోరణి ఏ మాత్రం సబబు కాదనే వాదనలు వినిపిస్తున్నాయి. స్థానిక ప్రజాప్రతినిధి వ్యవహార శైలితో ద్వితీయ శ్రేణి నాయకులు బహిరంగంగానే మండిపడుతున్నారు.

కేవలం టీడీపీలోనే కాకుండా అధికార కూటమిలో భాగస్వామిగా ఉన్న జనసేన పార్టీ వర్గాల్లోనూ తీవ్ర అసంతృప్తి పేరుకుపోతోంది. క్షేత్రస్థాయిలో జనసేన నేతలకు ప్రాధాన్యం ఇవ్వకుండా ఏకపక్షంగా వ్యవహరిస్తుండటంతో టీడీపీ ప్రజాప్రతినిధి తీరుపై వారు కూడా గుర్రుగా ఉన్నారు. ఎన్నికల సమయంలో లేనిపోని హమీలనిచ్చి ఇప్పుడు మాత్రం తనకేమీ పట్టనట్లు వ్యవహరిస్తున్నారనే వాదనలు వినవస్తున్నాయి. ఈ నేపథ్యంలో కార్పొరేటర్‌ సీటు ఆశిస్తున్న జనసేన వారు తమకు సంపూర్ణ న్యాయం జరగకుంటే తీవ్ర పరిణామాలు తప్పవని బహిరంగంగానే హెచ్చరికలు జారీ చేస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement